Asianet News TeluguAsianet News Telugu

Wimbledon 2022: వింబూల్డన్ మహిళల మహారాణి రిబాకినా.. ఫైనల్లో జబేర్ ఓటమి

Elena Rybakina: గడిచిన రెండు వారాలుగా యూకే వేదికగా జరుగుతున్న వింబూల్డన్-2022 లో మహిళల సింగిల్స్  పోరు ముగిసింది. కజకిస్తాన్ కు చెందిన రిబాకినా సంచలన విజయంతో తొలి గ్రాండ్ స్లామ్ నెగ్గింది. 

Elena Rybakina Beats Ons Jabeuer In Wimbledon 2022 Women's singles Finals, Claims her first Grand slam
Author
India, First Published Jul 10, 2022, 10:31 AM IST

వింబూల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్ లో ఎలీనా రిబాకినా (కజకిస్తాన్) సంచలన విజయంతో చరిత్ర సృష్టించింది. తన కెరీర్ లో తొలి గ్రాండ్ స్లామ్ నెగ్గడంతో పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కజకిస్తాన్ కు తొలి ‘గ్రాండ్ స్లామ్’ ను అందించింది. శనివారం రాత్రి ముగిసిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎలీనా 3-6, 6-2, 6-2 ట్యూనీషియా కు చెందిన జబేర్ ను తో ఓడించింది.  ఈ ఇద్దరికీ ఇదే తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ కావడం గమనార్హం.  గంటా 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ప్రపంచ 23వ ర్యాంకర్ అయినా ఎలీనా.. ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన జబేర్ ను మట్టికరిపించింది. 

ఈ సీజన్ లో జోరుమీదున్న జబేర్ ఫైనల్ లోనూ అదే ఆటతీరు కొనసాగించింది. తొలి సెట్ ను జబేర్ గెలుచుకుంది. ఆ తర్వాత కూడా బలమైన  సర్వీస్ లు, డ్రాప్ షాట్లతో  రిబాకినా పై ఆధిపత్యం చెలాయించింది.  అయితే తొలి సెట్ ఓడినా రిబాకినా  నిరాశలో కుంగిపోలేదు. 

రెండో సెట్ లో పుంజుకున్న  రిబాకినా తొలి గేమ్ లోనే జబేర్ సర్వీసును బ్రేక్ చేసింది. అదే జోరులో ఐదో గేమ్ లోనూ బ్రేక్ సాధించింది.  ఆ తర్వాత కూడా అదే జోరు సాగించి విజయాన్ని అందుకుంది. ఫైనల్ లో గెలవడంతో రిబాకినాకు 20 లక్షల బ్రిటీష్ పౌండ్లు (రూ. 19 కోట్ల 7 లక్షలు) గెలుచుకుంది. ఇక రన్నరప్ జబేర్ కు  10 లక్షల 50వేల పౌండ్లు (రూ. 10 కోట్లు) ప్రైజ్ మనీగా లభించింది. 

రష్యాలో పుట్టి.. కజకిస్తాన్ కు ఆడుతూ.. 

కజకిస్తాన్ తరఫున ఆడుతున్న రిబాకినా పుట్టింది మాస్కో (రష్యా) లో. కానీ 2018 నుంచి ఆమె కజకిస్తాన్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నది. 23 ఏండ్ల  ఎలీనా.. రష్యాకు చెందిన అమ్మాయి కావడం.. ఆమె కోచ్ లు కూడా రష్యా వాళ్లే కావడంతో ఆమె విండూల్డన్ ఆడుతుందా..? లేదా..? అని అనుమానాలు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో  రష్యా, బెలారస్ కు చెందిన క్రీడాకారులను వింబూల్డన్ లో ఆడనివ్వడం లేదన్న విషయం తెలిసిందే. కానీ తాను గడిచిన ఐదేండ్లుగా  కజకిస్తాన్ తరఫునే ఆడుతున్నానని రిబాకినా నిరూపించుకోవడంతో వివాదం సమసిపోయింది. ఇప్పుడు ఆమె కజకిస్తాన్ కు తొలి గ్రాండ్ స్లామ్ అందించి కొత్త చరిత్ర సృష్టించింది. 

 

నేడు జకోవిచ్-కిర్గియోస్ పోరు 

మహిళల సింగిల్స్ ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు టెన్నిస్ అభిమానుల కళ్లన్నీ పురుషుల సింగిల్స్ మీద పడ్డాయి. ప్రపంచ నెంబర్ 2 నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), కిర్గియోస్ (ఆస్ట్రేలియా) లు నేడు జరిగే ఫైనల్ లో తలపడతారు. నాదల్-కిర్గియోస్ ల  మధ్య సెమీస్ మ్యాచ్ రద్దవడంతో  కిర్గియోస్ నేరుగా ఫైనల్ కు అర్హత సాధించాడు. జొకోవిచ్ కు ఇది 32 వ గ్రాండ్ స్లామ్ కావడం గమనార్హం. నేటి మ్యాచ్ లో అతడు గెలిస్తే 21 వ గ్రాండ్ స్లామ్ నెగ్గిన ఆటగాడు అవుతాడు. ఈ జాబితాలో  రఫెల్ నాదల్ (22 టైటిళ్లు) ముందున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios