Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ ప్లాన్ ఇదే: మండలిలో కాంగ్రెస్ గల్లంతు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు తమను టీఆర్ఎస్‌‌లో విలీనం చేయాలని శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌కు శుక్రవారం నాడు లేఖ ఇచ్చారు.  

kcr plans to join congress mlc's in trs
Author
Hyderabad, First Published Dec 21, 2018, 10:49 AM IST

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ షాకిచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు తమను టీఆర్ఎస్‌‌లో విలీనం చేయాలని శాసనమండలి ఛైర్మెన్ స్వామిగౌడ్‌కు శుక్రవారం నాడు లేఖ ఇచ్చారు.  ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ నష్టనివారణ చర్యలకు దిగింది. శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు మండలి ఛైర్మెన్ తో భేటీ అయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ మరో షాక్ ఇచ్చింది. శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేసే ప్లాన్ అమలు చేస్తున్నారు. ఈ ప్లాన్ లో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో దామోదర్ రెడ్డి, ప్రభాకర్ లు చేరారు.ఈ ఇద్దరూ కూడ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరారు.

శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలుగా ఉన్న ఆకుల లలిత, సంతోష్ కుమార్ లు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు ఉన్నారు. అయితే ఆకుల లలిత, సంతోష్ కుమార్ లు కూడ కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ   మేరకు తమను టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయాలని  దామోదర్ రెడ్డి, ప్రభాకర్ రావు, ఆకుల లలిత, సంతోష్ కుమార్ లు శాసనమండలి ఛైర్మెన్  స్వామి గౌడ్ కు లేఖ అందించింది.

గత టర్మ్ లో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడ టీఆర్ఎస్ లో చేరారు. టీడీపీ శాసనసభపక్షం టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు అప్పటి టీడీపీ శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు లేఖ ఇచ్చారు.ఈ లేఖపై టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది.

తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకోవడంపై కూడ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు విషయమై కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అప్పటికే అసెంబ్లీ రద్దైంది. 

తాజాగా శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తమను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని ఇచ్చిన లేఖపై మండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది.మెజారిటీ ఎమ్మెల్సీలు తమను టీఆర్ఎస్ లో విలీనం చేయాలని లేఖ ఇచ్చినందున వారికి అనుకూలమైన నిర్ణయం వెలువడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత టర్మ్ లో ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు ఇచ్చిన లేఖకు అనుగుణంగా తీసుకొన్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు గుర్తు చేసే అవకాశం ఉంది.అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ టీడీపీ కోర్టును ఆశ్రయించిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రస్తావించనున్నారు.
ఇప్పటికే ఓటమి భారంతో ఉన్న కాంగ్రెస్‌కు ఎమ్మెల్సీల వ్యవహరం భారీ షాక్ గా మారింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తోందో చూడాలి.

వచ్చే ఏడాది మార్చితో షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిల టర్మ్ పూర్తి కానుంది. ఈ నలుగురు ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ లో విలీనం చేస్తే  మండలిలో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిథ్యం లేకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

పార్లమెంట్‌ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి: జనవరి నుండి ప్రచారం
 

Follow Us:
Download App:
  • android
  • ios