Asianet News TeluguAsianet News Telugu

కామారెడ్డి మాస్టర్ ప్లాన్: భవిష్యత్తు కార్యాచరణపై రైతు జేఏసీ భేటీ

కామారెడ్డి మాస్టర్ ప్లాన్  ను నిరసిస్తూ  రైతు జేఏసీ నేతలు మంగళవారంనాడు  భేటీ అయ్యారు.  భవిష్యత్తు కార్యాచరణపై  ఈ సమావేశంలో  చర్చించనున్నారు.  ఇప్పటికే  విలీన గ్రామాల కౌన్సిలర్లు రాజీనామాలు చేయాలని డెడ్ లైన్ విధించారు. 
 

Kamareddy Master plan:Farmers JAC  holds meeting  to  plan future cours of action  in Nizambad district
Author
First Published Jan 17, 2023, 11:38 AM IST

నిజామాబాద్: కామారెడ్డి  మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  భవిష్యత్తు  కార్యాచరణపై  రైతు జేఏసీ నేతలు మంగళవారంనాడు  సమావేశమయ్యారు.  పాతరాజంపేట పోచమ్మ ఆలయం వద్ద  రైతు జేఏసీ నేతలు భేటీ అయ్యారు.  ఈ నెల  20వ తేదీలోపుగా  విలీన గ్రామాల పరిధిలోని కౌన్సిలర్లు  రాజీనామా చేయాలని  ఇప్పటికే  రైతు జేఏసీ  డెడ్ లైన్  విధించింది. ఈ డెడ్ లైన్  కు  మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నెల  20వ తేదీ తర్వాత  ఏ రకమైన  కార్యాచరణ చేయాలనే దానిపై  కూడా ఈ  సమావేశంలో  చర్చించనున్నారు.

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  ఈ నెల  5వ తేదీన  కలెక్టరేట్ ముందు  ఆందోళన నిర్వహించారు రైతు  జేఏసీ నేతలు . ఈ నెల  6వ తేదీన  కామారెడ్డి బంద్ నిర్వహించారు.  కలెక్టరేట్  ముందు  ఆందోళన నిర్వహించిన  సమయంలో ఉద్రిక్తత నెలకొంది. మాస్టర్ ప్లాన్ విషయమై  కలెక్టర్  స్పష్టమైన హామీ ఇవ్వాలని  రైతులు డిమాండ్  చేశారు.   

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  అడ్లూరు  ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు రాములు  ఈ నెల  4వ తేదీన  మృతి చెందారు.  అయితే  రాములు మృతికి  కామారెడ్డి  మాస్టర్ ప్లాన్  కారణం కాదని అధికారులు ప్రకటించారు. రాములు మృతికి  మాస్టర్ ప్లాన్ కారణమని  రైతు జేఏసీ  నేతలు చెబుతున్నారు. 

మాస్టర్ ప్లాన్  కేవలం ముసాయిదా  మాత్రమేనని  జిల్లా కలెక్టర్  జితేష్ పాటిల్,  కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్ ప్రకటించారు.   అయితే ఈ విషయమై  రైతు జేఏసీ నేతలు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  మరో వైపు  విలీన గ్రామాలకు  చెందిన  కౌన్సిలర్లు రాజీనామాలు చేయాలని డెడ్ లైన్ విధించారు. కౌన్సిలర్లు రాజీనామాలు చేయకపోతే   కౌన్సిలర్ల ఇండ్లను ముట్టడించాలని కూడా  రైతు జేఏసీ ఇదివరకే నిర్ణయం తీసుకుంది.   కౌన్సిలర్లతో పాటు  ఇతర ప్రజా ప్రతినిధులపై  ఎలా ఒత్తిడి  చేయాలనే విషయమై  కూడా  రైతు జేఏసీ నేతలు  ఈ సమావేశంలో  చర్చించనున్నారు.  

కామారెడ్డి తరహలోనే జగిత్యాల మాస్టర్ ప్లాన్  అంశం కూడా తెరమీదికి వచ్చింది. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను  స్థానిక రైతులు వ్యతిరేకిస్తున్నారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ  రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఉప్పర్ పేట, నర్సింగాపూర్ , మోతె , తిమ్మాపూర్ గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు.  తిమ్మాపూర్ గ్రామపంచాయితీ పాలకవర్గం రాజీనామాలు సమర్పించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ పదవులకు రాజీనామాలు చేశారు. 

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇంటి ముందు  మహిళా రైతులు ఇవాళ ధర్నా నిర్వహించారు.  మాస్టర్ ప్లాన్  ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోవాలని  డిమాండ్  చేశారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని  ఎమ్మెల్యే  సంజయ్ కుమార్ కు సమర్పించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios