Asianet News TeluguAsianet News Telugu

Hyderabad : అసదుద్దీన్ ఓవైసిపై ఆడబిడ్డ పోటీ? ఎవరీ మాధవీలత? 

హైదరాబాద్ పాతబస్తీలో బిజెపి ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు మాధవీలత. సడన్ గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు కేవలం తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం. ఈ నేపథ్యంలో ఆమె గురించి తెలుసుకుందాం....

Hyderabad Lok Sabha Candidate Madhavi Latha Challenging AIMIM Chief Asaduddin Owaisi AKP
Author
First Published Apr 8, 2024, 1:03 PM IST

హైదరాబాద్ : మాధవి లత... ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం. తన మాటలతో దేశ ప్రజలను మంత్రముగ్దులను చేసే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈమె మాటలకు ఫిదా అయిపోయారు. జాతీయ మీడియాలో ప్రసారమయ్యే ప్రముఖ పొలిటికల్ షో 'ఆప్ కి అదాలత్' లో మాధవీ లత పాల్గొన్నారు. ఈ షో ను చూసిన ప్రధాని మోదీ ఆమెను ప్రశంసించకుండా వుండలేకపోయారు. దీంతో ఒక్కసారిగా మాధవీలత పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.   

ఎవరీ మాధవీలత? : 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని విరించి హాస్పిటల్స్ యజమానే మాధవీలత. భర్త కొంపెల్ల విశ్వనాథ్ తో కలిసి ఇంతకాలం హాస్పిటల్ తో పాటు ఇతర వ్యాపార వ్యవహారాలు చూసుకున్న ఆమె ఒక్కసారిగా రాజకీయాల వైపు వచ్చారు. అయితే ఆమె తన రాజకీయ ప్రస్థానాన్ని అషామాషీగా ప్రారంభించలేదు... వస్తూవస్తూనే హైదరాబాద్ పాతబస్తీలో పోటీకి సిద్దమయ్యారు. ముస్లింల ఆధిపత్యం కలిగిన పాతబస్తీలో హిందుత్వ పార్టీగా ముద్రపడిన బిజెపి జెండాను భుజానెత్తుకుని తిరుగేందుకు సై అంటున్నారు. ఇలా పాతబస్తీ వేదికగా రాజకీయాలు చేస్తుండటమే మాధవీలతను ఇంతలా ఫేమస్ చేసాయి. 

మాధవీలత పుట్టిపెరిగింది హైదరాబాద్ పాతబస్తీలోనే. దీంతో ఇక్కడి పరిస్థితుల గురించి బాగా తెలిసిన ఆమె హైదరాబాద్ లోక్ సభ కు పోటీ చేస్తున్నారు. ఇప్పటికే బిజెపి ఆమెకు టికెట్ కూడా కేటాయించింది. అయితే పాతబస్తీలో రాజకీయాలు అంత ఈజీ కాదు. దశాబ్దాలుగా అక్కడ ఎంఐఎం పార్టీ హవా సాగుతోంది... ఆ పార్టీ ఎదిరించడం అదికూడా బిజెపి తరపున అంటూ చాలా కష్టం. కానీ ఓ ఆడబిడ్డ ఆ పని చేస్తానంటూ ముందుకురావడం రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీసింది. ఇప్పుడు ప్రధాని మోదీ ట్వీట్ తో మాధవీలత పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. 

పాతబస్తీలోని యాకుత్ పురా సంతోష్ నగర్ లో నివాసముండే బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు మాధవీలత. ఆమె ప్రాథమిక విద్య మొత్తం అదే ప్రాంతంలో సాగింది. అనంతరం ఉన్నత విద్య కోఠి మహిళా కాలేజీ, నిజాం కాలేజీలో సాగింది. ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొలిటికల్ సైన్స్ లో ఎంఏ పూర్తిచేసారు. 

సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మాధవీలత కేవలం చదువులోనే కాదు ఇతర విషయాల్లోనూ చురుకే. చిన్ననాటినుండే భరతనాట్యం నేర్చుకుంటూ అందులో మంచి ప్రావీణ్యం సాధించారు. ఇక వీణ వాయించడంతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. పెళ్లి తర్వాత భర్తతో కలిసి విరించి హాస్పిటల్స్, వివో బయోటెక్స్ స్థాపించి బిజినెస్ ఉమెన్ గా కూడా మారారు. ఇప్పుడు రాజకీయ నేతగా కూడా మారారు. 

మాధవీ లత కుటుంబం : 

మాధవీలత భర్త  విశ్వానాథ్. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం.  పెద్దకూతురు లోపాముద్ర, కొడుకు రామకృష్ణ పరమహంస చెన్నై ఐఐటీ విద్యార్థులే. మరో కూతురు హైదరాబాద్ లోనే  చదువుకుంటోంది. వీరి చదువు బాధ్యతలు కూడా మాాధవీలత చూసుకుంటున్నారు. వ్యాపారాలు, ఇప్పుడు రాజకీయంగా ఎంత బిజీగా వున్నా తమ పిల్లలకు మాత్రం ప్రతిరోజూ సమయం కేటాయిస్తానని ఆమె చెబుతున్నారు. 

వ్యాపారవేత్త నుండి రాజకీయాల వైపు ప్రయాణం : 

మాధవీలత వ్యాపారాల్లో బిజీగా వుంటూనూ ఓ ట్రస్ట్  ద్వారా సేవాకార్యక్రమాలు చేయడం ప్రారంభించారు. అయితే ఈ సేవలను మరింత విస్తరించాలని భావించిన ఆమె అందుకు రాజకీయాలే మంచి మార్గమని భావించారు. అంతేకాదు చిన్ననాటినుండి పాతబస్తీలోనే పుట్టిపెరిగిన ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్దిని చూస్తున్నారు. కానీ పాతబస్తీ మాత్రం తన చిన్నపుడు ఎలా వుందో అలాగే వుందని... అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మారలేదని మాధవీలత చెబుతున్నారు. పాతబస్తి అభివృద్ది  చెందకపోవడానికి ఎంఐఎం పార్టీ, అసదుద్దిన్ ఓవైసి ఓటు బ్యాంకు రాజకీయాలే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. తాను రాజకీయాల్లోకి రావడానికి ఈ పరిస్థితులే కారణమని ఆమె చెబుతున్నారు. 

మాధవీలత వివాదాలు :

ఇలా బిజెపిలో చేరి అలా హైదరాబాద్ అభ్యర్థిగా  మారారు మాధవీలత. అయితే ఎంఐఎం కంచుకోట పాతబస్తీలోనే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసిని ఓడిస్తానని అంటున్నారు. ఓవైసి గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు మాధవీలత. 

తాజాగా అసదుద్దీన్ కు ఉగ్రవాద సంస్థ ఐసిస్ తో సంబంధాలున్నాయని మాధవీలత ఆరోపించారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో మాఫియా డాన్ మఖ్తార్ అన్సారీ కుటుంబాన్ని అసదుద్దీన్ పరామర్శించడంపై మాధవీలత సీరియస్ అయ్యారు. ఇలా ఆమె ఓవైసికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న కామెంట్స్ లోక్ సభ ఎన్నికల వేళ కాక రేపుతున్నాయి. 

ఇక పాతబస్తీలో పరిస్ధితులు, అక్కడి మహిళల ధీన స్థితి గురించి కూడా మాధవీలత మాట్లాడుతున్నారు.పాతబస్తీ అభివృద్ది కోసం, అక్కడి ప్రజల కోసం తాను ఏం చేస్తానో చెబుతున్నారు.  ఈ క్రమంలో ఆమె ఎంఐఎం నాయకులపై విరుచుకుపడుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూల్లో మాధవీలత చేస్తున్న కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి.

మాధవీలత భద్రత : 

ఇక సున్నితమైన హైదరాబాద్ లోక్ సభలో పోటీచేస్తున్న మాధవీలతకు కేంద్ర హోంశాఖ వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. ఇందులో భాగంగా ఆమెకు 11 మంది సెక్యూరిటీ సిబ్బంది నిత్యం భద్రత కల్పించనున్నారు. అలాగే ఆమె కుటుంబసభ్యుల భద్రత కోసం పాతబస్తీలోని ఇంటివద్ద కూడా సెక్యూరిటీని ఏర్పాటుచేసారు. ఇలా సాయుధులైన భద్రతా సిబ్బంది మాధవీలతకు భద్రత కల్పిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios