Asianet News TeluguAsianet News Telugu

బాబాసాహెబ్ ఆశయాల సాకార క్షేత్రం తెలంగాణ

మన రాష్ట్ర సచివాలయం వద్ద రేపు 125 అడుగుల అంబేద్కర్ విరాట్ మూర్తి ఆవిష్కరణ సందర్భంగా   తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఘనపురం దేవేందర్ రాసిన వ్యాసం ఇక్కడ చదవండి :
 

Writer Ghanapuram Devender essay on  DR BR Ambedkar statue in Hyderabad AKP
Author
First Published Apr 13, 2023, 11:37 AM IST

"మనం ఎంచుకున్న మార్గం వెంట జంకు లేకుండా ముందుకు సాగిపోవాలి" భారత రాజ్యాంగ నిర్మాత, సమ సమాజ స్థాపన ఆలోచన ప్రదాత డా. బి.ఆర్. అంబేద్కర్ చెప్పిన ఈ మాట నాయకుని ప్రధాన లక్షణం. ఆ లక్షణం ముమ్ముూర్తుల పునికి పుచ్చుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం చేయగలిగాడు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మూడవ అధికరణ ప్రకారం దేశంలోని రాజకీయ పార్టీల అందరిని మెప్పించి, ఒప్పించి, తెలంగాణ రాష్ట్రానికి జై కొట్టించి పార్లమెంటు ద్వారా ప్రజాస్వామికంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత వారి ప్రత్యర్థుల సాక్షిగా కెసిఆర్ దే. రాజకీయం కోసం ఎన్ని మాట్లాడినా ఈ విషయాన్ని ఒప్పుకోకపోతే వారు మనుషులే కారు అన్నది సత్యం. అంబేద్కర్ చూపిన బాట మొదట్లో కఠినం అనిపించినా ప్రయాణం మొదలుపెడితే లక్ష్య సాధన వరకు వెనుక అడుగు వేయనీయదు. అంబేద్కర్ బోధించాడు అదే బాటలో కేసీఆర్ సాధించాడు. తెలంగాణ సాధనలో రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకమైన తెలుగుదేశం, వైసిపి, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని బీరాలు పలికి చంద్రబాబు బాటలో సాగిన భారతీయ జనతా పార్టీలతో తెలంగాణకు సై కొట్టించిన ఘనత కెసిఆర్ దే.  పయనించిన బాట అంబేద్కర్ దే.  ఈరోజు 125 అడుగుల అంబేద్కర్ విరాట్ మూర్తిని హైదరాబాదు నడిబొడ్డున నెలకొల్పిన ఘనుడు కేసీఆర్. స్ఫూర్తి మాత్రం విశ్వానికి.  అంబేద్కర్ లాంటి విశ్వ గురువు విరాట్ మూర్తి స్ఫూర్తి  విష గురువుల అసలు రూపాలను కనిపెట్టే శక్తి ప్రజలకు ఇస్తుందనడంలో సందేహం లేదు. అంతేకాదు ఆ విరాట్ మూర్తి అంబేద్కర్ ఆశయాలను సాకారం చేస్తున్న క్షేత్రంగా తెలంగాణను దేశానికి,  ప్రపంచానికి ఆదర్శంగా చాటిచెబుతున్నది.

"ఒక ఉన్నతమైన ఆదర్శం కలిగి ఉండటం, దానిని చేరుకోవడానికై ఓపికగా పరిశ్రమించడం మన జీవిత సూత్రంగా ఉండాలి" అని ఎంతో విలువైన మాట చెప్పారు డా. బి.ఆర్. అంబేద్కర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత  తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా, దేశంలోనే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలపాలన్న లక్ష్యంతో, అద్భుతమైన పథకాలతో ప్రత్యర్ధులు ఎంత కుటిలంగా విమర్శిస్తున్నా సడలని పట్టుతో , ధైర్యంతో కెసిఆర్ ముందుకు సాగుతుంటే... ఫలితాలు ప్రజల ఒడిలో చేరుతుంటే..  అంబేద్కర్ మాటల్లో ఉన్న శక్తి... కెసిఆర్ ఆచరణలో ఉన్న అంకితభావం సమాజానికి కొత్త సందేశాన్ని అందిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, రైతుబంధు, దళిత బంధు, పేద పిల్లలకు సకల సౌకర్యాలతో ఉత్తమ విద్యను అందించే వెయ్యికి పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, వృద్ధాప్య, ఒంటరి మహిళ, దివ్యాంగుల, బీడీ చేనేత కార్మికుల పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సమాజంలో ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పే పథకాలు, టీఎస్ ఐ పాస్ వంటి పారిశ్రామికరణను, పెట్టుబడులను ప్రోత్సహించే పాలసీలు విజయవంతంగా సుదీర్ఘకాలంగా అమలు చేస్తూ ఉంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్వప్నాలు సాకారం అవుతున్న యుగాన్ని చూస్తున్నాం. ఆయన చెప్పిన ఆదర్శం, సహనశీలత , పరిశ్రమ ముఖ్యమంత్రి కేసీఆర్ లో ప్రస్ఫుటంగా చూడలేని వాళ్లు కళ్ళున్న అంధులే.  ఇంకా చెప్పాలంటే అత్యంత దౌర్భాగ్యంగా లేని వైకల్యాన్ని నటిస్తున్న వారే అనడంలో సందేహం లేదు.‌ " ఏ కారణము లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నీవు చేసే పనిలో విజయం సాధిస్తావని అర్థం" అని అంబేద్కర్ చెప్పిన మరో గొప్ప విషయాన్ని గమనిస్తే కెసిఆర్ జీవితంలో ఎన్నో అనుభవాలు మనకు కనిపిస్తాయి. తెలంగాణ సాధనలో ఎంతోమంది విమర్శించారు. కెసిఆర్ విజయాన్ని సాధించారు. కాళేశ్వరం విషయంలోనూ, దళిత బంధు విషయంలోనూ, అనేక సంక్షేమ పథకాల విషయంలోను, రాజకీయ వ్యూహాలలోనూ కేసీఆర్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఎవరూ ఎదుర్కోలేదు అనడంలో అతిశయోక్తి లేదు. అంబేద్కర్ చెప్పినట్టు ఆయన సాధించే విజయాలే ఆయన ప్రత్యర్థుల నోళ్లు మూయించాయి. భవిష్యత్తులోనూ  మూయిస్తాయి.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ హెచ్చరించినట్టుగా "  ఒక వర్గాన్ని ఇంకొక వర్గం పైకి ఉసిగొల్పే ధోరణి చాలా ప్రమాదకరం" అటువంటి దుర్భర పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయి. ఇప్పుడు దేశ ప్రజలకు అండగా ఉండడానికి సమర్థవంతమైన నాయకత్వం అవసరం. అంబేద్కర్  మాటల్లో చెప్పాలంటే  "ధ్యేయం పట్ల అంకిత భావం కలిగిన వ్యక్తులు కార్యాన్ని ముందుకు నడిపిస్తారు" అంకిత భావం కలిగిన  నాయకుడు కేసీఆర్.  అందుకే ఇప్పుడు ఆయన దేశానికి దిక్సూచి.

"నీ కోసం జీవిస్తే.. నీ లోనే నిలిచిపోతావు. జనం కోసం జీవిస్తే… జనంలో నిలిచి పోతావు" అంటారు బిఆర్ అంబేద్కర్.  అనడమే కాదు తను జీవించి చూపించాడు. అంతేకాదు  తన వర్గ ప్రజలందరికీ ఆశాజ్యోతి కాగలిగాడు. ప్రత్యర్థులకు సైతం ఆరాధ్యుడు కాగలిగాడు. "ఇంతింతై వటుడింతై..." అన్నట్టు పురాణాలలో చదువుకున్న విష్ణుమూర్తి తత్వాన్ని పేదరికంలో పుట్టి అడ్డంకులను సహనంతో అధిగమించి ప్రజలకు శాశ్వత సౌభాగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ నిర్మాతగా  విరాట్ స్వరూపాన్ని ప్రపంచం దర్శించే విధంగా జీవితాన్ని కొనసాగించాడు. విష్ణుమూర్తి లక్ష్యం రాక్షస రాజు పతనమైతే అంబేద్కర్ లక్ష్యం బడుగు వర్గాల అభ్యున్నతి. అందుకే భారత జాతికి అంబేద్కర్ ఒక దేవుడు. 

విచిత్రం ఏమిటంటే ఇప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వాటి ప్రభావంగా అన్నీ నిత్యావసరాల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగినా పోరాట చైతన్యం సమాజంలో కనబడడంలేదు. ప్రజల అచేతనావస్థకు  కారణం ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరం ఉంది. అందుకు  ప్రజలంతా అంబేద్కర్ భావజాలాన్ని అధ్యయనం చేసి అర్థం చేసుకుంటే మన దేశం ఆధునిక ప్రపంచంలోనూ ఆదర్శంగా నిలవగలదు. ఆయన చెప్పినట్టు "ఏ ప్రజలైతే తమ లక్ష్యాన్ని నిర్ణయించుకోరో వారు ఎటువంటి విజయాన్ని పొందలేరు ఎపుడైతే వారు విజయాన్ని పొందలేరో, వారు చరిత్రపై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేరు". ప్రజలంతా ఒక లక్ష్యాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కులాలకు మతాలకు అతీతంగా బతకాల్సి ఉంది. ఆలోచించాల్సి ఉంది.  అందుకోసం ఒక ఆయుధంగా ఉపయోగపడే నాయకత్వాన్ని గుర్తించి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. సరికొత్త రాజకీయ, రాజనీతి సైనికులను తయారు చేసుకోవాల్సి ఉంది. అప్పుడే అంబేద్కర్ దార్శనికతతో దేశం ప్రపంచ ప్రజలను ప్రభావితం చేస్తుంది. 

"గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్ధులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి" అని అంబేద్కర్ చెప్పినట్టు విద్యార్థులు మత పిచ్చిలో మూఢులుగా మారకుండా, సమాజానికి దేశానికి మేలు చేసే శక్తులుగా సత్ప్రవర్తనతో ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. "మహిళలు సాధించిన పురోగతి స్థాయిని బట్టి నేను సమాజ పురోగతిని కొలుస్తాను" అంటారు భారత రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్.  అందుకే భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మొక్కవోని దీక్షతో చట్టసభలలో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దేశంలోని ఆలోచనా పరులు అందర్నీ  కూడగట్టుకొని పోరాటం చేస్తున్న విషయాన్ని చూస్తున్నాం. గతంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం కృషిచేసి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ స్ఫూర్తిగా కల్వకుంట్ల కవిత పోరాటం మహిళా రిసర్వేషన్ బిల్లు విషయంలో కూడా తప్పకుండా విజయం సాధిస్తుంది. దేశ వ్యాప్తంగా కవిత పోరాటానికి లభిస్తున్న మద్దతు అందుకు నిదర్శనం. నాయకుని లక్షణాలను అవపోసాన చేసుకుంటే కార్యకర్తలు సైతం గొప్ప నాయకులుగా ప్రజల హృదయాలలో నిలిచిపోతారు. అంబేద్కర్ బాటలో పయనిస్తున్న కేసీఆర్... కెసిఆర్ ను తండ్రిగా, నాయకునిగా ఆదర్శంగా తీసుకొని మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న కల్వకుంట్ల కవిత జాతీయస్థాయి నాయకురాలిగా స్థిరపడుతున్నారు. అంబేద్కర్ ఆదర్శమైనప్పుడు, ఆయన బాటలో పయనిస్తున్నప్పుడు ప్రత్యర్థులు చేసే కుటుంబం అనే నిరాధార,  అసందర్భ విమర్శల జడిని తట్టుకొని ప్రజల నేతలుగా ముందుకు సాగుతారు అనడానికి కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం ఎదురులేని నిదర్శనం. కుటుంబం కొందరికి రాజకీయ యోగం కలిగించవచ్చు. అంతలోనే వియోగం ప్రాప్తించవచ్చు. కానీ ప్రతిభ, సేవ చేయాలన్న సంకల్పం, ఒంట పట్టించుకున్న అంబేద్కర్ ఆశయాలు , అవలంభిస్తున్న రాజనీతి, రాజకీయ వ్యూహాలు వారిని ప్రజా నాయకులుగా నిలబెడతాయని కేటీఆర్, హరీశ్ రావు, కవిత రాజకీయ జీవితాలు నిరూపిస్తున్నాయి. కానీ ప్రతిభ, సేవ చేయాలన్న సంకల్పం లేకుండా  కేవలం అధికారం కోసం అర్రులు చాచే వారి రాజకీయ జీవితం ఎలా ఉంటుందో మనదేశంలోనే చాలా మంది రాజకీయ నాయకుల వారసులు మన కళ్ళముందు పాదలమీద యాత్రలు చేస్తూ కనబడుతుంటారు.

"స్వతంత్రంగా జీవించే అవకాశం ఉండీ... బానిస భావాలు కలిగిన వ్యక్తి కన్నా స్వతంత్ర భావాలున్న బానిస వెయ్యిరెట్లు మేలు" అనే బి. ఆర్. అంబేద్కర్ మాటలు దేశాన్ని తిరోగమనవం వైపు తీసుకెళ్తున్న వారిని సమర్థించే నాయకులకు చెంపపెట్టు లాంటివి. స్వార్థం కోసం దేశాన్ని హీన దిశ వైపు  నడిపిస్తున్న వారిని అధినాయకులుగా శిరస్సు మీద పెట్టుకునే బానిసనేతలు ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ను అర్థం చేసుకోవాల్సి ఉందన్న నిజాన్ని గ్రహించాలి. ముఖ్యంగా ఉద్రేకాలతో అనుచిత దారిలో పోతున్న యువత గమనించ వలసిన అంబేద్కర్  మాటలను ఒక్కసారి గమనిద్దాం. " రాజ్యాంగాన్ని నమ్ముకుంటే చెప్రాసి నుండి రాష్ట్రపతిని చేస్తుంది. మతాన్ని నమ్ముకుంటే….మళ్ళీ నిన్ను బానిసగా తయారు చేస్తుంది" అంబేద్కర్ చెప్పిన మాటలు భారత సమాజానికి ముఖ్యంగా యువతరానికి హెచ్చరికలు. ప్రస్తుత తరాలకు మత పిచ్చి ఏమాత్రం హితం కాదు. సమాజ అభివృద్ధికి హేతువు కాదు. ముఖ్యంగా ఆవేశంలో ఇటువంటి పరిస్థితులను సృష్టించే శక్తులకు ప్రజాస్వామ్యంలో స్థానం అనవసరం. అందుకు వ్యతిరేకంగా పోరాడే కెసిఆర్ లాంటి నాయకులు ప్రస్తుతం దేశానికి ఆశాజ్యోతులు. అంబేద్కర్ చూపిన బాట ఆ నాయకులకు శిరోధార్యం.

 

Follow Us:
Download App:
  • android
  • ios