Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలైన ముసలం.. ఫలించిన బాబు వ్యూహం.. జగన్‌కు ఇబ్బందికరమేనా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 2019లో తన పార్టీని భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా వైఎస్ జగన్.. పార్టీపై, పాలనపై పూర్తి నియంత్రణతో ముందుకు సాగుతున్నారు.

MLC Elections results creates shock waves in YSR Congress Party ksm
Author
First Published Mar 24, 2023, 11:52 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బలమైన నేతగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 2019లో తన పార్టీని భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా వైఎస్ జగన్.. పార్టీపై, పాలనపై పూర్తి నియంత్రణతో ముందుకు సాగుతున్నారు. సంక్షేమ పథకాలు పంపిణీ ప్రధాన ఏజెండాగా పాలన సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే 2019 నుంచి జరిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయయాత్ర కొనసాగించింది. 

అయితే ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ  ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో వైసీపీ ఓటమి.. ఆ పార్టీలో కలకలం రేపుతోంది. అయితే ఎన్నికలకు మరో ఏడాది  సమయం ఉన్నందున.. ఈ పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ఇటీవలి కాలంలో మొత్తం 21 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగగా.. వైసీపీ 17, టీడీపీ నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాలకే పరిమితమైన టీడీపీ.. ఆ తర్వాత జరిగిన పలు ఎన్నిక ఘోర ఓటమిని చవిచూసింది. అయితే ఇప్పుడు నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకోవడం ఆ పార్టీలో జోష్‌ను నింపింది.

తొలుత పట్టభద్రుల కోటాలోని మూడు స్థానాల్లో వైసీపీ ఓడిపోవడం.. ఆ పార్టీ నేతలను తీవ్ర షాక్‌కు గురిచేసింది. అయితే ఈ ఎన్నికలు సమాజంలోని అన్ని వర్గాలను కవర్ చేయదని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. తమ ఓటు బ్యాంక్ వేరే ఉందని కూడా కామెంట్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలపడంతో.. ఆ ఎన్నిక అనివార్యం అయింది. అయితే పట్టభద్రుల స్థానాల్లో వైసీపీ ఓటమితో.. ఈ ఎన్నికపై సీఎం జగన్ పలు జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం ఏడు స్థానాల్లో విజయం సాధించేలా పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. 

మరోవైపు సాంకేతిక సంఖ్యాబలం కలిగి(2019లో టీడీపీ 23 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే).. వాస్తవికంగా బలం లేని టీడీపీ తమ అభ్యర్థిని గెలుపించుకోవడం కోసం పావులు కదిపింది. వైసీపీ రెబల్స్‌గా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు.. అటు నుంచి మరో ఓటు వస్తే విజయం సాధిస్తామని లెక్కలు వేసుకుంది. అందులో విజయం సాధించింది. ఆ ఇద్దరు రెబల్స్ కాకుండా.. మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు  క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. 

సొంత పార్టీలోనే వ్యతిరేకత..?
ఈ ఫలితాలతో పట్టభద్రుల్లోనే కాకుండా.. సొంత పార్టీలోనే సీఎం జగన్‌పై వ్యతిరేకత ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఓటమితో.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ అధిష్టానం మరింత సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అసంతృప్త గళం వినిపంచగా.. ఆనం రామనారాయణ రెడ్డితో కూడా పార్టీకి సత్సబంధాలు లేవు. ఈ క్రమంలోనే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డిలపై ఆశలను వైసీపీ అధిష్టానం ఎప్పుడో వదులుకుంది. మిగిలినవారితోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వ్యుహాన్ని సిద్దం చేసింది. వైసీపీ 149(ఇద్దరు రెబల్స్‌ను లెక్కలోకి తీసుకోకుండా), టీడీపీ రెబల్స్ 4, జనసేన రెబల్ 1తో.. మొత్తం 154 మంది ఓట్లను సక్రమంగా వినియోగించుకునేలా సీఎం జగన్ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. 

మొత్తం 154 మందిని.. 22 మంది ఎమ్మెల్యేల చొప్పున ఏడు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూప్‌కు ఒక్కో ముఖ్య నేతను ఇంచార్జ్‌ను నియమించింది. అలాగే ప్రతి గ్రూప్‌లోని మరో ముగ్గురు నేతలకు వారిచేత ఓట్లు సక్రమంగా వేయించే బాధ్యతలను అప్పగించింది. ఇందుకోసం అనేకసార్లు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. విజయవాడలో బుధవారం రాత్రి వైసీపీ గ్రూప్‌ల వారీగా ఎమ్మెల్యేలతో విందు రాజకీయం ఏర్పాటు చేయడం.. ఎమ్మెల్సీ ఎన్నికల పోరును మరింత రసవత్తరంగా మార్చింది. 

అయితే వైసీపీ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేకపోయింది. వైసీపీ అభ్యర్థులు పెనుమత్స సూర్యనారాయణ రాజు,  ఇజ్రాయిల్, మ‌ర్రి రాజశేఖర్, పోతుల సునీత, చంద్రగిరి యేసురత్నంలు మొదటి ప్రాధాన్యత ఓట్లతో(వారికి 22 చొప్పున ఓట్లు వచ్చాయి)  విజయం సాధించారు. అయితే కోలా గురువులు, జయమంగళం వెంకట రమణలకు 21 చొప్పున మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత జయమంగళ వెంకట రమణను విజయం వరించింది. కోలా గురువులు ఓడిపోయారు. అయితే వైసీపీ నుంచి టీడీపీ అభ్యర్థికి  క్రాస్ ఓటింగ్ చేసిన ఇద్దరు ఎవరనేది  ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

అయితే టీడీపీ నుంచి గెలిచిన వైసీపీకి మద్దతు తెలిపిన నలుగురు ఎమ్మెల్యేలు గానీ,  జనసేన నుంచి గెలుపొంది జగన్‌ అనుకూల వైఖరి తీసుకున్న రాపాక వరప్రసాద్ గానీ.. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టుగా ఆ పార్టీ వర్గాలు భావించడం లేదు. వారు క్రాస్‌ ఓటింగ్ చేశారనే మాట కూడా వినిపించడం లేదు. వైసీపీలోని ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్టుగా ఆ పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతుంది. అయితే వారు ఎవరనేది వైసీపీ అధిష్టానం గుర్తించినప్పటికీ.. బయటకు చెప్పడానికి ఇష్టపడటం లేదని సమాచారం. 

మరోవైపు చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థిని గెలిపంచుకునే  వ్యుహంలో భాగంగా తన పార్టీ రెబల్ ఎమ్మెల్యేలను సంప్రదింపులు జరిపిన దాఖాలాలు కూడా లేవు. దీంతో టీడీపీ రెబల్స్ క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో సొంత పార్టీలోనే పలువురు జగన్‌ వ్యతిరేక ధోరణి అవలంభించారనేది స్పష్టమవుతంది. 

అయితే సీఎం జగన్.. ప్రస్తుతం చాలా బలమైన నేతగా ఉన్నారు. తన తండ్రి వైఎస్సార్ అభిమానులు, మద్దతుదారుల అండతో పాటు.. తనకంటూ ప్రత్యేక వర్గాన్ని జగన్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జగన్.. 151 స్థానాలు సొంతం చేసుకుని ఘన విజయం సాధించారు. అయితే అప్పటి నుంచి సీఎం జగన్‌ మరింత బలవంతుడిగా మారారనే చెప్పాలి. పార్టీపై, పాలనపై పూర్తి స్థాయి నియంత్రణతో ముందుకు సాగుతున్నారు. వైసీపీలో కూడా ఆయన నిర్ణయమే ఫైనల్. అతి కొద్ది మందిని మాత్రమే సీఎం జగన్ తన తీసుకునే నిర్ణయాల్లో భాగస్వామ్యం చేస్తారనే ప్రచారం కూడా ఉంది. అయినప్పటికీ.. ఆయన నిర్ణయానికి అడ్డుచెప్పేవారు లేరని కూడా అంటారు. 

కానీ ఇప్పుడిలా సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవ్వడం.. వైసీపీకి భారీ షాక్ అనే చెప్పాలి. సాధారణంగా అధికారంలోకి ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు.. ఎన్నికల వరకు తమకు అసంతృప్తి ఉన్నప్పటికీ దానిని బయటపడనివ్వరు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి బయటకు వస్తే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని భావిస్తుంటారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాతనే.. జగన్‌పై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్ చేసే ధైర్యం చేశారనే వాదన కూడా ఉంది. ఆ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగి ఉండేది కాదనే టాక్ వినిపిస్తుంది.

అటు పట్టభద్రులు మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి.. ఇటు ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్‌తో ఒక స్థానంలో ఓటమి నేపథ్యంలో వైసీపీలో ముసలం మొదలైందనే ప్రచారం సాగుతుంది. మరోవైపు 2019 ఎన్నికల్లో ఓటమి నుంచి వరుస అపజయాలు, పరాభావాలు ఎదుర్కొంటూ వస్తున్న చంద్రబాబు.. రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం తెరవెనక పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ వ్యతిరేక శక్తులను ఒకటి చేయడంపై దృష్టిసారించిన చంద్రబాబు.. తాజాగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే విషయాన్ని బలంగా చాటిచెప్పేలా చేయడంలో విజయం సాధించారు. తన గేమ్ ప్లాన్ ద్వారా పట్టభద్రుల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలతో పాటు, ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకునేలా చేశారు. 

అయితే ఇక్కడ బలమైన, శక్తివంతమైన నేతగా పేరు తెచ్చుకున్న జగన్‌కు.. సొంత పార్టీలో నుంచే ఇటువంటి పరిణామం ఎదురుకావడం చిన్న విషయమేమి కాదని చెప్పాలి. ఎందుకంటే సంక్షేమ పథకాలను నమ్ముకున్న వైసీపీకి వచ్చే ఎన్నికల్లో కూడా విజయం ఖాయమని ఆ పార్టీ వర్గాలు నమ్ముతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం జగన్ కూడా ‘‘వై నాట్ 175’’ అనే నినాదాన్ని తీసుకొచ్చారు. అలాంటి వైపీలో వ్యతిరేక వాయిస్ వినిపించడంలో.. భవిష్యత్‌లో ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అనే చర్చ కూడా మొదలైంది. 

మరోవైపు ఈ వరుస విజయాలతో టీడీపీ శ్రేణులు జోష్‌ నెలకొంది. ఇన్నాళ్లు తెర వెనక ఉన్నవాళ్లు కూడా అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉండటం, తాజా విజయాలతో బయటకు వస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనే కాకుండా.. ఇటూ క్షేత్ర స్థాయిలో బలంగా అడుగులు వేసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఈ పరిణామాలు వైసీపీ శ్రేణులను మాత్రం కొంత నిరాశలోకి నెట్టివేశాయి. ఇదే ప్రభావం వైసీపీ సెకండ్ క్యాడర్‌ నేతలను తాకితే పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల తమకు బిల్లలు రావడం లేదంటూ.. వైసీపీ నేతలే ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపించాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం పార్టీ పరంగా చోటుచేసుకున్న పరిణామాలను వైఎస్ జగన్ చక్కదిద్దకుంటే.. పరిస్థితులు మరింత దిగజారే అవకాశం లేకపోలేదు. 

ఇక, తాజాగా ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలు.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసినా టీడీపీ కొంతైనా పుంజుకునే అవకాశం ఉందని వారు అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios