Asianet News TeluguAsianet News Telugu

‘హెక్టార్’ బుకింగ్స్ పున: ప్రారంభించిన ఎంజీ.. ధర కూడా పెంచేసింది

బ్రిటన్ ఆటో మేజర్ ఎంజీ మోటార్స్ ఇండియా తన ఎస్‌యూవీ మోడల్ హెక్టార్‌కు వినియోగదారుల నుంచి వచ్చిన స్పందనతో ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నది. తిరిగి పరిమిత కాలానికి వాటి బుకింగ్స్ పున: ప్రారంబించింది. మరోవైపు హెక్టార్ ధరను 2.5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.

MG Hector bookings start again, price goes up
Author
Hyderabad, First Published Sep 30, 2019, 11:35 AM IST

న్యూఢిల్లీ: బ్రిటన్ ఆటోమొబైల్ దిగ్గజం ‘ఎంజీ మోటార్స్’ భారతదేశ విపణిలో హెక్టార్ మోడల్ కార్ల కొనుగోలు కోసం బుకింగ్స్ ప్రారంభించింది. అయితే ఈ బుకింగ్స్ పరిమిత కాలం పాటు మాత్రమే స్వీకరిస్తామని తెలిపింది.

బుకింగ్స్‌ కోసం హెక్టార్ల కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి గుజరాత్ రాష్ట్రంలోని హలోల్ ప్లాంట్‌లో రెండో షిఫ్ట్ కూడా ప్రారంభించాలని నిర్ణయించింది. దీంతోపాటు హెక్టార్ మోడల్ కారు ధరు 2.5 శాతం పెంచుతున్నట్లు ఎంజీ మోటార్స్ తెలిపింది.

అయితే అది వేరియంట్‌ను బట్టి మారనున్నది. కొత్తగా కారు కోసం బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ధర పెంపు వర్తిస్తుంది. ఇప్పటికే కార్లను బుక్ చేసుకుని డెలివరీ కోసం వేచి చూస్తున్న వినియోగదారులకు మాత్రం ఈ ధర పెంపు వర్తించదు.

ప్రస్తుతం ఎంజీ మోటార్స్ హెక్టార్ మోడ్ కారు ధర రూ.12.18 లక్షల నుంచి ప్రారంభమై రూ.16.88 లక్షల వరకు ఉంటుంది. పెంచిన 2.5 శాతం ధరలతో రూ.12.48 లక్షలకు మొదలై రూ.17.18 లక్షలకు చేరుతుందని అంచనా.

దీనిపై ఎంజీ మోటార్స్ భారత్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా మాట్లాడుతూ ‘ఎంజీ హెక్టార్‌కు భారతదేశంలో లభించిన స్పందన మాకు సంతోషాన్ని కలిగించింది. మేం మా వినియోగదారులను సంతోష పెట్టేందుకు తొలుత వచ్చిన కస్టమర్లకు ప్రత్యేక ధరకు కారును అందజేశాం’ అని చెప్పారు.

‘వినియోగదారులు మా బ్రాండ్ పై ఉంచిన నమ్మకానికి ప్రతిఫలంగా ఇది వారికిచ్చాం. మా బుకింగ్స్ కు అనుగుణంగా సకాలంలో డెలివరీ కోసం ప్రొడక్షన్ వేగవంతం చేస్తున్నాం’ అని ఎంజీ మోటార్స్ భారత్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా చెప్పారు.

ఎంజీ హెక్టార్ విపణిలో ఆవిష్కరించినప్పటి నుంచి భారతదేశంలో ఊహించిన దానికన్నా ఎక్కువ డిమాండ్ లభించింది. దీంతో ప్రొడక్షన్ పెంచడానికి 500 మందిని అదనంగా ఎంజీ మోటార్స్ నియమించుకోవడం ఆసక్తికర పరిణామం.

లోకల్ స్పేర్ పార్ట్స్ సప్లయర్స్ తమ వద్ద నుంచి వస్తువులు, పరికరాల పంపిణీ పెంచగానే హలోల్ ప్లాంట్‌లో రెండో షిప్ట్‌ను కూడా ప్రారంభించనున్నది. నవంబర్ నుంచి ఉత్పత్తి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం 15 వేల మంది వినియోగదారులు ఎంజీ హెక్టార్ మోడల్ కారు కోసం వెయిటింగ్ లిస్ట్‌లో వేచి చూస్తున్నారు. జూలైలోనే ఈ కారు కోసం సుమారు 28 వేల బుకింగ్స్ నమోదు కావడం గమనార్హం. దీంతో కార్ల వినియోగదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని మూడు, నాలుగు నెలలకు పెంచుతూ ఎంజీ మోటార్స్ నిర్ణయం తీసుకున్నది.

జూన్ నాలుగో తేదీన బుకింగ్స్ ప్రారంభించింది ఎంజీ మోటార్స్. ఆకె వారాల్లోనే కార్ల బుకింగ్స్ 28 వేలకు చేరుకున్నాయి. ఎంజీ హెక్టార్ తన ప్రత్యర్థి సంస్థలు కియా సెల్టోస్, టాటా హరియర్, మహీంద్రా ఎక్స్‌యూవీ 500, జీప్ కంపాస్ ఎస్ యూవీ మోడల్ కార్లతో తలపడనున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios