Asianet News TeluguAsianet News Telugu

బజాజ్ ఈజ్ బ్యాక్.. న్యూ లుక్‌తో విపణిలోకి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

దశాబ్ద కాలం క్రితం కనుమరుగైన బజాజ్ ఆటోమొబైల్ రీ ఎంట్రీ ఇచ్చింది. హమారా కల్ ట్యాగ్ లైన్‌తో ఎలక్ట్రిక్ చేతక్ స్కూటర్‌తో విపణిలో అడుగు పెట్టింది. జనవరి నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు ప్రారంభం అవుతాయి.

Bajaj Auto enters EV market with the launch of Chetak electric scooter
Author
Hyderabad, First Published Oct 17, 2019, 12:49 PM IST

న్యూఢిల్లీ: ఒకనాడు దేశీయ టూవీలర్‌ మార్కెట్‌ను ఒక ఊపు ఊపేసిన బజాజ్‌ చేతక్‌. తాజాగా న్యూ లుక్‍తో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ సిద్ధమైంది. సరికొత్త రూపంలో ఈ స్కూటర్లను మార్కెట్లోకి తేవడానికి బజాజ్ ఏర్పాట్లు చేసింది. చేతక్‌ ఎలక్ర్టిక్‌ స్కూటర్‌ (ఈ-స్కూటర్‌)ను బజాజ్‌ బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

చేతక్‌ బ్రాండ్‌ కింద ఎలక్ర్టిక్‌ స్కూటర్లను వచ్చే జనవరి నుంచి విక్రయించాలని కంపెనీ నిర్ణయించింది. చకన్‌ ప్లాంట్‌లో ఈ స్కూటర్లను తయారు చేసి క్రమంగా ఒక్కో నగరంలో అమ్మకాలను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. తొలుత పుణె, తదుపరి బెంగళూరు నగరాల్లో విక్రయాలు ప్రారంబించనున్నది. అటుపై తన నెట్ వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించడానికి బజాజ్ ప్రణాళికలను సిద్దం చేసింది. అర్బనైట్ బ్రాండ్ కింద బజాజ్ తొలి వాహనం ఇదే.

కంపెనీకి చెందిన ప్రో బైకింగ్‌ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ-స్కూటర్లను విక్రయించనున్నారు. యూరప్‌ తదితర మార్కెట్లకు వచ్చే ఏడాది నుంచి ఈ స్కూటర్లను ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది. బుధవారం జరిగిన కార్యక్రమంలో చేతక్‌ ఈ-స్కూటర్‌ను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌, బజాజ్‌ ఆటో మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ బజాజ్‌ ఆవిష్కరించారు.

దేశీయ టూవీలర్‌ మార్కెట్లో తమ కంపెనీ సుస్థిర స్థానాన్ని సంపాదించుకుందని, ఇప్పుడు ఎలక్ర్టిక్‌ స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించి మరింత ముందడుగు వేయాలని నిర్ణయించినట్టు రాజీవ్‌ బజాజ్‌ తెలిపారు. ఈ-స్కూటర్‌ ధరను కంపెనీ వెల్లడించలేదు.

దీని ధర రూ.1.5 లక్షల కన్నా ఎక్కువ ఉండకపోవచ్చని మార్కెట్‌వర్గాలు భావిస్తున్నాయి. ఈ స్కూటర్‌లో రెండు మోడ్స్‌ ఉన్నాయి. ఒక్కసారి ఐదు గంటల పాటు చార్జ్‌ చేస్తే స్పోర్ట్స్‌ మోడల్‌లో 85 కిలో మీటర్లు, ఈకో మోడ్‌లో 95 కిలో మీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

ప్రస్తుతానికి ఇది బజాజ్ ప్రీ బుకింగ్ నెట్ వర్క్ కింద ఉంటుంది. కేటీఎం వాహనాలు ఇలాగే బుక్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత వాహనాల కొనుగోలుదారుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా నెట్ వర్క్ పరిధి విస్తరించనున్నది బజాజ్.

బజాజ్ కొత్త వాహనం (స్కూటర్)లో ఐపీ 67 రేటింగ్ గల హైటెక్ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు. దీన్ని 5-15 ఎఎంపీస్ ఎలక్ట్రికల్ ఔట్ లెట్లలో చార్జింగ్ చేసుకోవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యాటరీ మేనేజ్మెంట్ వ్యవస్థను అమర్చారు. ఇది బ్యాటరీని నియంత్రిస్తుంది. దీనిపై పూర్తి వివరాలను బజాజ్ యాజమాన్యమే వెల్లడించాల్సి ఉంది. రీ జనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థను అమర్చారు. ఇది బ్రేకింగ్ కారణంగా వచ్చే వేడిని గతిశక్తిగా మార్చేసి స్కూటర్ రేంజి పెంచివేస్తుంది.

సరికొత్త చేతక్ రూపు రేఖలను మార్చేసే రెట్రో స్టయిల్ లో తయారు చేశారు. ఎల్ఈడీ డే టైం ల్యాంప్, ఎల్ఈడీ హెడ్ లైట్ ఉన్నాయి. ఫెదర్ టచ్ యాక్టివేటెడ్ ఎలక్ట్రానిక్ స్విచ్ లు వాహనానికి మరింత ఆకర్షణ కానున్నాయి. మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్ అందించనున్నది. ఆరు రంగుల్లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి రానున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios