Asianet News TeluguAsianet News Telugu

అసలేంటీ 'కచ్చతీవు' దీవి వివాదం? నిజంగానే భారత్ శ్రీలంకకు ధారాదత్తం చేసిందా!? 

Katchatheevu Island Controversy: ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టు నిజంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు కచ్చాతీవులను ధారాదత్తం చేసిందా ? అసలేం జరిగింది ? కచ్చాతీవుల ప్రాముఖ్యత ఏంటి ? ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

BJP Congress Clash Escalates Over Katchatheevu Island What Is The Katchatheevu Island Controversy KRJ
Author
First Published Apr 14, 2024, 10:28 AM IST

Katchatheevu Island: గత కొంతకాలంగా కచ్చాతీవు లేదా కచ్చాదీవులు వార్తల్లో నిలిచాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కచ్చాతీవులను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిందని, ఈ నిర్ణయానికి తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. దీంతో ఈ అంశం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. డీఎంకే దీనికి కౌంటర్ ఇస్తూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దీవులను భారత్ కు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించింది. మరి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్టు నిజంగానే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు కచ్చాతీవులను ఇచ్చేసిందా ? అసలు నిజంగా అప్పుడేం జరిగింది. కచ్చాతీవులకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి ? ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

తమిళనాడులోని రామేశ్వరానికి 33 కి.మీ. దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు 62 కి.మీ. దూరంలో హిందూ మహా సముద్రంలో కచ్చతీవు దీవి ఉంది. దీని మొత్తం విస్తీర్ణం 285 ఎకరాలు. 1605 మధురై రాజులు ఆధీనంలో ఉండేది. బ్రిటీష్ వాళ్లు వచ్చిన తరువాత తమిళనాడుతో పాటు ఈ దీవి కూడా వాళ్ల ఆదీనంలోకి వెళ్లిపోయింది. బ్రిటీషర్లు కూడా దీనిని భారత్ లో అంతర్భాగంగానే గుర్తించారు. కచ్చాతీవు మనదేశ భాగమేనని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. రామనాథపుర రాజవంశం ఏలిన ఎనిమిది దీవులలో ఇదొకటి. అక్కడ చేపల వేటకీ, ముత్యాల వెలికితీతకీ ఆ వంశీయులే అబ్దుల్ మరికర్‌కు ఏడు వందల రూపాయలకు లీజుకు ఇచ్చారనీ ఇందుకు సంబంధించిన పత్రాలు ఉన్నాయని ఆ వంశీకుడు రాజకుమారన్ సేతుపతి చెబుతున్నారు. 

కట్ చేస్తే ఈ దీవి విషయంలో శ్రీలంకు, భారత్ కు మధ్య వివాదాలు మొదలయ్యాయి. ఈ దీవి తమదంటే తమదని రెండు దేశాలు వాదించాయి. అయితే దీనికి ముగింపు పలికేందుకు రెండు దేశాలు ముందుకొచ్చాయి. 1974లో అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ, శ్రీలకం ప్రధాని సిరిమావో బండారు నాయకే, అలాగే రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య చర్చలు జరిగాయి. ఆ సమయంలో తమిళనాడు రాష్ట్రానికి డీఎంకే పార్టీకి చెందిన కరుణానిధి సీఎంగా ఉన్నారు. 

ఆ సమయంలో రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం కచ్చాతీవులు శ్రీలంకకు వెళ్లిపోయాయి. 1974 ఒప్పందం ప్రకారం ఇరు దేశాల ప్రాదేశిక జలాల్లో ఇరు దేశాల మత్స్యకారులు చేపలు పట్టవచ్చు. కానీ తరువాత దానిని సమీక్షించి 1976 లో సవరించారు. దీని ప్రకారం ఇరు దేశాలకు చెందిన మత్స్యకారులు పొరుగు జలాల్లో చేపల వేటకు వెళ్లకుండా నిషేధం విధించారు. భారత జాలర్లు కేవలం విశ్రాంతి తీసుకొనేందుకే ఈ దీవికి రావొచ్చని, తమ దీవి పరిధిలో చేపల వేటను అంగీకరించబోమని శ్రీలంక వాదించింది. 

అయితే భారత్, శ్రీలంకను పాక్ జలసంధి విడదీస్తోంది. పాక్ జలసంధి దాటి చేపలు పట్టేందుకు భారత జాలర్లకు అనుమతి లేదు. అయితే ఆ పాక్ జలసంధి కేవలం ఊహాజనితమైనదే గానీ.. దానిని గుర్తుపట్టేందుకు ఎలాంటి బార్డర్లు లేవు. దీంతో భారత జాలర్ల శ్రీలంక జలాల్లోకి వెళ్లి, చేపలు పడుతుంటే శ్రీలంక వారిని అరెస్ట్ చేసింది. ఇలా గత 20 ఏళ్లలో శ్రీలంక 6,000 మందికి పైగా భారతీయ జాలర్లను, 1,175 ఫిషింగ్ బోట్లను నిర్బంధించింది. 

దీనిపై తమిళనాడు ప్రభుత్వం చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేసింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చేసుకున్న ఒప్పందాన్ని సవాల్ చేస్తూ, కచ్చా తీవులు భారత్ కే చెందాలని కోరుతూ 2011లో అప్పటి సీఎం జయలలితా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేయడంతోపాటు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రాజ్యాంగ సవరణ చేయకుండా ఈ దీవిని లంకకు అప్పగించడం చెల్లదని వాదించారు.

కానీ కొంత కాలం తరువాత ఈ అంశం మరుగునపడిపోయింది. తాజాగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కచ్చాతీవులను ప్రస్తావించడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, డీఎంకే కలిసి కచ్చాతీవును శ్రీలంకకు ధారాదత్తం చేశారని బీజేపీ వాదిస్తోంది. తాము చాలా కాలంగా ఈ అంశంపై శ్రీలంకతో మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోడీకి చెబుతూ వస్తున్నామని, కానీ ఆ దీవులను తిరిగి స్వాధీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపలేదని డీఎంకే చెబుతోంది. అయితే ఈ వివాదం ఎప్పుడో ముగిసిపోయిందని, ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటివి సాధారణంగా తెరపైకి వస్తాయని శ్రీలంక చెబుతోంది. ఆ దీవులు తమవే అని తేల్చి చెబుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios