Asianet News TeluguAsianet News Telugu

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల : ఎంపిక విధానం.. అర్హతలు, వివరాలివే..?

2023 సంవత్సరానికి గాను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఎంపిక విధానం, అర్హతలు, సిలబస్ ఇతర వివరాలు ఒకసారి చూస్తే. 
 

indian airforce agniveer notification 2023 released full details here ksp
Author
First Published Jul 12, 2023, 4:13 PM IST

త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం గతేడాది కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎంపికైనవారిని అగ్నివీర్లుగా పిలుస్తున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్స్ కొత్త రిక్రూట్‌మెంట్ (01/2024) నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 27 నుండి ప్రారంభమవుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.inని సందర్శించి ఆగస్టు 17 ,2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష 13 అక్టోబర్ 2023 నుంచి ప్రారంభమవుతుంది.

అర్హత :

దరఖాస్తుదారుడు గణితం, భౌతిక శాస్త్రం, ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లలో ఒకదానితో కలిపి కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణుడై వుండాలి. అలాగే ఇంగ్లీష్‌లో  కనీసం 50 శాతం మార్కులు వుండాలి. డిప్లొమా హోల్డర్ 50 శాతం మార్కులతో పాసై వుండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్‌లతో నాన్ ఒకేషనల్ సబ్జెక్ట్‌లతో కలిపి కనీసం 50 శాతం మార్కులతో రెండేళ్ల వృత్తి విద్యా కోర్సు‌లో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్ధి వయసు 21 సంవత్సరాల కంటే తక్కువ వుండాలి. 2003 జూన్ 27 నుంచి డిసెంబర్ 27, 2006 మధ్య జన్మించి వుండాలి. దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్ధి ఎత్తు కనీసం 152.5 సెం.మీ వుండాలి.. అదే మహిళా అభ్యర్ధి ఎత్తు కనీసం 152 సెం.మీ వుండాలి. పురుష అభ్యర్ధుల ఛాతీ 77 సెం.మీ వుండాలి. మరో 5 సెం.మీ వరకు దానిని విస్తరించాలి. 

ఎంపిక ఇలా :

- ఆన్‌లైన్ రాత పరీక్ష.
- ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT)
- వైద్య పరీక్ష

రిక్రూట్‌మెంట్ యొక్క ఇతర ముఖ్యాంశాలు:

ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ నాలుగు సంవత్సరాల శిక్షణలో అభ్యర్ధికి రూ.48 లక్షల వైద్య బీమా ఉంటుంది.
సేవ సమయంలో, అగ్నివీర్ భారత వైమానిక దళానికి చెందిన ఆసుపత్రులు, భారత వైమానిక దళానికి చెందిన CSD క్యాంటీన్‌ల ప్రయోజనాన్ని కూడా పొందగలుగుతాడు.
అగ్నివీర్లకు ఏటా 30 సెలవులు లభిస్తాయి. ఇది కాకుండా, వైద్యుని సిఫారసు మేరకు అనారోగ్య సెలవు ఇవ్వబడుతుంది.

ఇదిలాఉంటే, 2026 నాటికి దాదాపు 1.75 లక్షల మంది యువకులు అగ్నిపథ్ పథకం కింద చేరనున్నారనే అంచనాలు ఉన్నాయి. 2022 జూన్‌లో అప్పటి సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి మాట్లాడుతూ.. సమీప భవిష్యత్తులో అగ్నివీరుల సంఖ్య 1.25 లక్షలకు చేరుతుందని చెప్పారు. ‘‘రాబోయే 4-5 సంవత్సరాలలో.. మన (సైనికుల) సంఖ్య 50,000-60,000కు, తరువాత 90,000-1 లక్షలకు పెరుగుతుంది. స్కీమ్‌ను విశ్లేషించడానికి, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి మేము 46,000 వద్ద చిన్నగా ప్రారంభించాము’’ అని పేర్కొన్నారు. 

అయితే ప్రతి ఏడాది దాదాపు 60,000 మంది సైనికులు పదవీ విరమణ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే  మూడు సర్వీసుల్లో సైనికుల కొరత తీవ్రంగా ఉంది. ఇక, 2021లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లలో వరుసగా 1.18 లక్షలు, 11,587, 5,819 మంది సైనికుల కొరత గురించి పార్లమెంటుకు తెలియజేయబడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios