Asianet News TeluguAsianet News Telugu

షాక్ : 'మైత్రీ మూవీస్' నవీన్‌ యర్నేని పై కిడ్నాప్‌ కేసు!

ఈ కేసులో ఉన్న నిందితులు తనను గతంలో కిడ్నాప్‌ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా బదలీ చేసుకున్నారని, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారికి సహకరించారని ఫిర్యాదు చేశారు. 

Police Case filed against Tollywood pruducer, Mythri Movies owner Naveen Yerneni jsp
Author
First Published Apr 15, 2024, 11:46 AM IST


జూబ్లీహిల్స్‌లోని క్రియా హెల్త్‌కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సంబంధించి.. బలవంతంగా షేర్ల బదాలయింపు, యాజమాన్య మార్పిడి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రముఖ సినీ నిర్మాత, మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేత నవీన్‌ యర్నేని పేరు తాజాగా వెలుగులోకి వచ్చి షాక్ ఇచ్చింది. ఈ కేసు నిందితుల జాబితాలో ఆయన ఉన్నట్లు జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ గట్టుమల్లు, ఎస్సై మల్లికార్జున్‌ సహా పలువురు నిందితులపై పంజాగుట్ట స్టేషన్‌లో పలు కేసులు నమోదు అయ్యాయి. ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కొన్నేళ్ల క్రితం తనకు జరిగిన అన్యాయంపై ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త చెన్నుపాటి వేణుమాధవ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులను సంప్రదించాడు.

ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు తనను కూడా బెదిరించినట్టు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఉన్న నిందితులు తనను గతంలో కిడ్నాప్‌ చేసి తన కంపెనీ షేర్లను బలవంతంగా బదలీ చేసుకున్నారని, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారికి సహకరించారని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులతోపాటు తన సంస్థకు చెందిన నలుగురు డైరెక్టర్లకు సైతం లబ్ధి చేకూరినట్లు వేణుమాధవ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆ సంస్థ ఎండీగా వ్యవహరించిన రాజశేఖర్‌ తలసిల, డైరెక్టర్లుగా ఉన్న గోపాలకృష్ణ సూరెడ్డి, నవీన్‌ యర్నేని, రవికుమార్‌ మందలపు, వీరమాచినేని పూర్ణచందర్‌రావులను తాజాగా నిందితుల జాబితాలో చేర్చారు. దీంతో డైరెక్టర్లకూ నోటీసులిచ్చి విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా వేణుమాధవ్‌, చంద్రశేఖర్‌ వేగేల మధ్య ఆర్థికపరమైన విభేదాలతో ఇరువురిపై  కేసులు నమోదై ఉన్నాయి. చంద్రశేఖర్‌ మీద గతంలో పీడీ చట్టాన్ని సైతం ప్రయోగించగా విచారణ క్రమంలో దానిని అడ్వైజరీ బోర్డు తిరస్కరించింది.

ఈ మేరకు రాధాకిషన్‌రావు, గట్టుమల్లు, మల్లికార్జున్‌తోపాటు కృష్ణ, గోపాల్‌, రాజ్‌, రవి, బాలాజీ, చంద్రశేఖర్‌ వేగేతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios