Asianet News TeluguAsianet News Telugu

జీఎస్పీ రద్దుపై నో ‘గోబ్యాక్’: భారత్‌కు తేల్చేసిన ట్రంప్


సందట్లో సడేమియా అన్నట్లు సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో జీఎస్పీ కింద భారతదేశానికి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ స్టేటస్ రద్దు చేస్తున్నట్లు మార్చిలో ప్రకటించింది అమెరికా. అమెరికా కాంగ్రెస్ సభ్యులు.. భారత్ లో ఎన్నికలు జరుగుతున్నందున వాయిదా వేయాలన్నా.. తీరా గడువు ముగిసాక జీఎస్పీ పునరుద్ధరణ మాటే లేదని ట్రంప్ సర్కార్ బెదిరింపులకు దిగుతోంది. దీనివల్ల భారత ఎగుమతులపై ప్రభావం పడుతుందని అంచనా. 

Suspension of preferential trade status for India under GSP is 'done deal': Trump
Author
Washington D.C., First Published Jun 1, 2019, 10:51 AM IST

వాషింగ్టన్‌: భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా(జీఎస్పీ) తొలగింపుపై వెనక్కి తగ్గబోమని అమెరికా ప్రకటించింది. బీజేపీ నేత నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీయే అఖండ విజయానికి శుభాకాంక్షలు తెలిపిన అమెరికా.. మోదీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసిన మరునాడు ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. 

భారత్‌కు జీఎస్పీ హోదా రద్దు ఇప్పటికే ‘జరిగిపోయిన ప్రక్రియ’ అని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ‘జీఎస్పీ హోదా రద్దు ఒక జరిగిపోయిన అంశం. ఇక దీనిపై ముందుకు ఎలా వెళ్లాలన్నదే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. మోదీ ప్రభుత్వంతో ఎలా నడుచుకోవాలి, ఈ విషయంలో ఉన్న ఇతర పరిష్కార మార్గాలేంటి? అన్న దానిపై సమాలోచనలు జరపాలి’’ అని అమెరికా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

దీనిపై గత మార్చి మూడో తేదీ నుంచి అమెరికా ఇచ్చిన 60 రోజుల గడువు గతనెల మూడో తేదీతో ముగిసింది. అయితే భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసేంత వరకు జీఎస్పీ రద్దుపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని కొందరు అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు కోరడంతో దీనిపై తదుపరి నిర్ణయం ఆగిపోయింది. 

భారత్‌తో పాటు టర్కీకి కూడా విధించిన గడువు ముగియడంతో మే 17న ఆదేశానికి జీఎస్పీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లో ఎన్నికల ముగియడంతో ఇక త్వరలో ట్రంప్‌ నుంచి ఓ ప్రకటన రావచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇరుదేశాల మధ్య గల కొన్ని వాణిజ్య చిక్కులను పరిష్కరించుకోగలిగితే కొన్ని రాయితీలు కల్పించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని అధికారులు తెలిపారు. దీనిపై ఇరు దేశాలు విస్తృత చర్చలు జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

అమెరికా ఉత్పత్తులకు భారత మార్కెట్లలో ‘సమానమైన, సర్థనీయమైన’ వాతావరణం కల్పించడంపై భారత్ నుంచి ఎటువంటి హామీ లభించనందున భారత్‌కు ప్రాధాన్య వాణిజ్య హోదా రద్దు చేయాలని మార్చిలో అమెరికా కాంగ్రెస్‌కు ట్రంప్‌ లేఖ రాసిన విషయం తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్‌ అత్యధిక పన్నులు విధిస్తుందని ట్రంప్‌ వాదన. మరోవైపు జీఎప్పీ తొలగింపు వల్ల భారత్‌ ఎగుమతులపై పెద్దగా ప్రభావం ఉండదని భారత్‌లోని వాణిజ్య నిపుణులు అంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios