Asianet News TeluguAsianet News Telugu

షరతుల మధ్య ‘జెట్ ఎయిర్వేస్’ విలవిల.. డైరెక్టర్లుగా బ్యాంకర్లు?

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ పునర్వ్యవస్థీకరణకు ఇటు బ్యాంకుల కన్సార్టియం.. అటు ఎతిహాద్ కఠిన షరతులు విధిస్తున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే జెట్ ఎయిర్వేస్ బోర్డులో బ్యాంకుల కన్సార్టియంకు చోటు దక్కనున్నది. దీని ప్రకారం బ్యాంకర్లకు 40 శాతం వాటా లభిస్తుంది. ఎతిహాద్ మరో రెండు మూడుశాతం వాటా పొందే అవకాశాలు ఉన్నాయి. 

Stringent terms by Etihad may put Jet Airways lifeline at risk
Author
New Delhi, First Published Jan 17, 2019, 11:34 AM IST

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కి విలవిల్లాడుతున్న ‘జెట్‌ ఎయిర్‌వేస్‌’ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులేస్తున్నది. ఈ క్రమంలో దన్నుగా నిలిచిన భాగస్వామ్య సంస్థ ‘ఎతిహాద్’, రుణాలు మంజూరు చేసిన ‘ఎస్బీఐ’ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం పరిస్థితులను కట్టుదిట్టం చేస్తున్నాయి. 

వాటాల రూపంలో పెట్టుబడులు.. బోర్డులో మార్పులు
కొత్తగా వాటాల రూపంలో పెట్టుబడులు, తత్ఫలితంగా బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లలో వచ్చే మార్పుల వంటి అంశాలన్నీ ఈ ప్రణాళికలో భాగమేనని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. పునరుద్ధరణ ప్రణాళికపై స్పష్టత రాకపోవడంతో, స్టాక్‌ మార్కెట్లలో షేర్ బుధవారం నాడే ఎనిమిది శాతం నష్టపోయింది. 

పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘జెట్ ఎయిర్వేస్’ చర్యలు
ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణకు, రుణ భారం తగ్గింపునకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది. తీవ్ర నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌, 2018 డిసెంబర్ నెలాఖరు నాటికి ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియానికి రుణాలు చెల్లించడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత, కొత్త వాటాదార్ల నుంచి అదనపు పెట్టుబడులు స్వీకరించేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది.

సమగ్ర పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్న జెట్ ఎయిర్వేస్
‘కంపెనీని సమగ్రంగా పునరుద్ధరించడంతోపాటు ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా చూసేందుకు ఎస్‌బీఐ, ఇతర ఆర్థిక సంస్థలు, వాటాదార్లతో చర్చలు జరుగుతున్నాయి’ అని జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. ప్రణాళికపై వాటాదార్లు విస్తృతంగా చర్చిస్తున్నారని, అయితే ఇంకా తుది నిర్ణయానికి రాలేదని, కంపెనీకి ప్రయోజనం కలిగేలా ఇది ఉంటుందని తెలిపింది. 

ఇవీ జెట్ ఎయిర్వేస్ ముందు ఉన్న ప్రతిపాదనలు
కొత్తగా పెట్టుబడుల స్వీకరణ, ఆస్తుల సమగ్ర వినియోగం, లాయల్టీ పథకంలో కంపెనీ వాటా విక్రయం వంటివి అమలు చేస్తున్నట్లు పేర్కొంది. సంస్థలో ప్రస్తుతం 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌, తన వాటా పెంచుకునేందుకు చూస్తోందని వార్తలు వస్తున్నా, స్పందించేందుకు ఆ సంస్థ ప్రతినిధి నిరాకరించారు. ఒకవేళ ఎతిహాద్‌ కనుక తన వాటా పెంచుకునేందుకు ముందుకు వస్తే, ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో ప్రిఫరెన్స్‌ ప్రైసింగ్‌కు సంబంధించి, తమకు మినహాయింపు ఇవ్వాలని ఎతిహాద్‌ కోరుతున్నట్లు సమాచారం.

సెబీదే నిర్ణయమన్న పౌర విమానయానశాఖ 
పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్‌ చౌబేను దీనిపై ప్రశ్నించగా అలాంటి అభ్యర్థన ఏదైనా సెబీకి చేయాల్సి ఉంటుందని, దానిపై సెబీ నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. ఆ వ్యవహారాల్లో ప్రత్యక్షంగా ప్రభుత్వ జోక్యం ఏమీ ఉండబోదని, ప్రమోటర్లు, రుణదాతలు సంస్థను రుణాల ఊబి నుంచి బయటపడేసేందుకు సహాయపడే వివిధ కోణాలపై చర్చిస్తున్నారని ఆయన చెప్పారు. గతంలో స్పైస్‌జెట్‌ కొనుగోలు విషయంలో పౌర విమానయాన శాఖ ఈ మేరకు సిఫారసు చేసిన అంశం ప్రస్తావించగా ఇప్పటివరకు తాము దానిపై దృష్టి పెట్టలేదన్నారు.

జెట్ ఎయిర్వేస్‌లో 40 శాతం వాటా పొందనున్న బ్యాంకుల కన్సార్టియం
జెట్ ఎయిర్వేస్ పునరుద్ధరణ ప్రణాళికలో ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం అతిపెద్ద వాటాదారుగా కానున్నది. అందుకు సంస్థ చైర్మన్ నరేశ్ గోయల్ అంగీకరించిన తర్వాతే బ్యాంకులు తమ రుణ ప్రణాళికను పునర్వ్యవస్థీకరించేందుకు ముందుకు వచ్చాయి. దీని ప్రకారం ఎస్బీఐ బ్యాంకుల కన్సార్టియంలోని సభ్యులు నూతన ‘జెట్ ఎయిర్వేస్’ సంస్థలో డైరెక్టర్లు కానున్నారు. దీని ప్రకారం బ్యాకుల టీంకు సంస్థలో 40 శాతం వాటా లభించనున్నది. 

జెట్ ఎయిర్వేస్‌కు రూ.8000 కోట్ల రుణాలిచ్చిన బ్యాంకులు
బ్యాంకులు జెట్ ఎయిర్వేస్ సంస్థకు రూ.8000 కోట్ల రుణాలు ఇచ్చాయి. గత డిసెంబర్ నెలలో రుణ బకాయిలను చెల్లించడంలో జెట్ ఎయిర్వేస్ విఫలమైన సంగతి తెలిసిందే. ఇక అబుదాబీ ఎయిర్ లైన్స్ ‘ఎతిహాద్’ మరో రెండు, మూడు శాతం వాటా పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక సంస్థ చైర్మన్ నరేశ్ గోయల్ వాటా 24 శాతానికి పడిపోనున్నదని తెలుస్తున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios