Asianet News TeluguAsianet News Telugu

అనిల్‌కు సుప్రీంషాక్: నెలలో బకాయి చెల్లింపు కాదంటే 3 నెలల జైలు

కోర్టుకు ఇచ్చిన హామీని గానీ, కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో గానీ విఫలమయ్యారని రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్ అంబానీని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఆయన క్షమాపణ అఫిడవిట్‌ను తిరస్కరించింది. ఎరిక్సన్ సంస్థకు నాలుగు వారాల్లో రూ.453 కోట్ల బకాయిని చెల్లించాలని, లేకపోతే మూడు నెలల జైలుశిఓ పడుతుందని హెచ్చరించింది. 

Pay Rs 453 crore in 4 weeks or face 3 months' jail: SC to Anil Ambani
Author
New Delhi, First Published Feb 21, 2019, 10:26 AM IST

న్యూఢిల్లీ: స్వీడన్ టెక్నాలజీ మేజర్ ఎరిక్సన్ బకాయిల చెల్లింపు విషయంలో రిలయన్స్ కమ్యూనికేషన్ అధినేత అనిల్‌ అంబానీకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మరో ఇద్దరు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని నిర్థారించింది. వారు దూషులని పేర్కొంది.

ఎరిక్‌సన్‌కు రూ.550 కోట్ల బకాయిలను చెల్లించాలంటూ జారీ చేసిన ఆదేశాఅను అమలు చేయడంలో విఫలమయ్యారని, అది కోర్టు ఆదేశాల ఉల్లంఘనేనని న్యాయస్థానం తెలిపింది. నాలుగు వారాల్లోగా రూ.453 కోట్లు చెల్లించకపోతే మూడు నెలల పాటు జైలు శిక్ష విధించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు  హెచ్చరించింది.

కోర్టు ఆదేశాల ఉల్లంఘించిన కేసులో అనిల్‌ అంబానీతోపాటు రిలయన్స్‌ టెలికం ఛైర్మన్‌ సతీశ్‌ సేథ్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌ ఛైర్‌పర్సన్‌ ఛాయ విరానీ ఉన్నారని జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌. నారిమన్‌, జస్టిస్‌ వినీత్‌ సరన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కాగా, కోర్టు తీర్పు ప్రకటిస్తున్నప్పుడు అనిల్ అంబానీ, సేథ్‌, విరానీ కోర్టు హాలులోనే ఉండడం గమనార్హం. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గితో సంప్రదించిన అనిల్ అంబానీ మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. 

కోర్టు రిజిస్ట్రీకి నెలలోగా రూ.కోటి చెల్లించాలని రిలయన్స్‌ కమ్యూనికేషన్‌, రిలయన్స్‌ టెలికమ్యూనికేషన్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాటెల్‌లకు కోర్టు ఆదేశించింది. లేదంటే ఆయా కంపెనీల ఛైర్‌పర్సన్‌లు అదనంగా ఒక నెల జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

ఇప్పటికే రిలయన్స్‌ గ్రూప్‌ కోర్టు రిజిస్ట్రీలో డిపాజిట్‌ చేసిన రూ.118 కోట్లను ఒక వారంలోగా ఎరిక్‌సన్‌కు పంపాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కోర్టు ఆదేశాల ఉల్లంఘనతోపాటు.. ఆ మూడు రిలయన్స్‌ కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే రూ.550 కోట్లు, వడ్డీని కట్టడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.

ఎరిక్‌సన్‌కు రూ.550 కోట్లు చెల్లించడానికి తొలుత ఇచ్చిన నాలుగు నెలలు, తర్వాత అదనంగా ఇచ్చిన రెండు నెలల గడువును ఉపయోగించుకోలేకపోవడం, కోర్టు ఆదేశాల ధిక్కారానికి పాల్పడడమేనని న్యాయస్థానం పేర్కొన్నది. అన్నింటికీ మించి ‘నిర్లక్ష్య ధోరణి’ కారణంగా రిలయన్స్‌ ఇచ్చిన బేషరతు క్షమాపణలను తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.

సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తామని.. తీర్పు ప్రకారం ఎరిక్‌సన్‌కు బకాయిలు చెల్లించడంలో గ్రూప్‌ సఫలమవుతుందని అనిల్‌ అంబానీ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గి ధీమా వ్యక్తం చేశారు. 2014లో కుదిరిన ఏడేళ్ల ఒప్పందం ప్రకారం.. ఆర్‌కామ్‌కు చెందిన జాతీయ స్థాయి టెలికాం నెట్‌వర్క్‌ను ఎరిక్‌సన్‌ ఇండియా నిర్వహిస్తుంది. 

రిలయన్స్ కమ్యూనికేషన్స్ బకాయిలు చెల్లించకపోవడంతో 2017 మే ఏడో తేదీన ఎరిక్సన్ ఇండియా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. వాటికి సంబంధించిన బకాయిలను ఆర్‌కామ్‌ చెల్లించలేకపోవడంతో న్యాయ వివాదం మొదలైంది. 120 రోజుల్లో రూ.550 కోట్లతోపాటు ఎరిక్సన్ బకాయిలన్నీ చెల్లించేస్తామని రిలయన్స్ ప్రతినిధులు గతేడాది మే 30న న్యాయస్థానానికి హామీ ఇచ్చారు. 

గతేడాది సెప్టెంబర్ 30వ తేదీనాటికి బకాయి చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా విఫలమైంది రిలయన్స్ కమ్యూనికేషన్స్. తీరా మళ్లీ ఎరిక్సన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు డిసెంబర్ 15 లోగా చెల్లిస్తామని రిలయన్స్ నమ్మ బలికింది. అనిల్ అంబానీ అండర్ టేకింగ్ కూడా ఇచ్చారు. కానీ ఆచరణలో తన హామీని నిలుపుకోవడంలో విఫలమయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios