Asianet News TeluguAsianet News Telugu

జెట్‌ ఎయిర్వేస్‌ తాత్కాలిక సారథి పుర్వార్‌!


ఎట్టకేలకు ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నది. నరేశ్ గోయల్ నుంచి సంస్థను టేకోవర్ చేసుకున్న బ్యాంకుల కన్సార్టియం... జెట్ ఎయిర్వేస్ తాత్కాలిక మేనేజ్మెంట్ కమిటీ సారథిగా ఎస్బీఐ మాజీ చైర్మన్ ఏకే పుర్వార్, సలహా సంస్థగా ఎస్బీఐ క్యాపిటల్ ను నియమించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సమ్మె హెచ్చరిక చేసిన పైలట్లు కాస్త నెమ్మదించారు. సంస్థ యాజమాన్యం కూడా కాసింత ఓర్చుకోవాలని అభ్యర్థించింది.

A K Purwar likely to chair Jet Airways' interim management committee
Author
Hyderabad, First Published Apr 1, 2019, 11:03 AM IST

న్యూఢిల్లీ: భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) నేతృత్వంలోని బ్యాంకర్ల కన్సారియం ఆధీనంలోకి వెళ్లిన జెట్‌ ఎయిర్‌వేస్‌ తాత్కాలిక మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ ఏకే పుర్వార్‌ను నియమించడానికి బ్యాంకర్లు సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈయన 2002-06 మధ్య కాలంలో ఎస్‌బీఐ ఛైర్మన్‌గా పని చేశారు. 

సంస్థ రోజు వారీ కార్యకలాపాలు, నగదు ప్రవాహం వంటి వాటిని పర్యవేక్షించడంతోపాటు కొత్త పెట్టుబడిదారుడిని పుర్వార్ సారథ్యంలోని తాత్కాలిక మేనేజ్‌మెంట్‌ కమిటీ అన్వేషిస్తుంది. ఈ ప్రక్రియలో ఎస్బీఐ కేపిటల్‌ను సలహాసంస్థగా నియమించేందుకు బ్యాంకర్లు ప్రయత్నిస్తున్నట్లు ఎస్బీఐ అధికారి ఒకరు వెల్లడించారు.

గత నెల 25వ తేదీన సంస్థలోకి వెంటనే రూ.1,500 కోట్ల నిధులు చొప్పించేందుకు అనువుగా రుణ పరిష్కార ప్రణాళికను ఆమోదించిన సంగతి విదితమే. జెట్‌ ఎయిర్‌వేస్‌లో పెట్టుబడి పెట్టేందుకు  ఆసక్తి గల పెట్టుబడిదారుల నుంచి దరఖాస్తులను ఎస్‌బీఐ ఆహ్వానిస్తోంది. ఏప్రిల్‌ 9 నాటికి ఆసక్తిని తెలియజేయడంతోపాటు ఇదే నెల 30 నాటికి బిడ్లు వేసేందుకు గడువు విధించినట్లు ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ వెల్లడించారు.

మార్చి 31లోపు తమ వేతనాలు చెల్లించకపోతే, ఏప్రిల్‌ 1 నుంచి విమానాల్ని నడిపేది లేదని జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలెట్లు సుమారు 1100 మంది గతంలో హెచ్చరించిన సంగతి విదితమే. ఆదివారం మధ్యాహ్నం అటు ముంబై, ఇటు ఢిల్లీలో నేషనల్‌ ఏవియేటర్స్‌ గిల్డ్‌ సభ్యులు సమావేశం నిర్వహించి సమ్మె నిర్ణయాన్ని ఏప్రిల్‌ 15కి వాయిదా వేశారు.

పూర్తిగా వేతనాల చెల్లింపు విషయమై జెట్‌ ఎయిర్‌వేస్‌ యాజమాన్యం చేతులెత్తేసింది.  ఇంజనీర్లు, సీనియర్‌ సిబ్బంది సహా పైలట్లకు నాలుగు నెలల నుంచి వేతన చెల్లింపు నిలిచిపోయింది. డిసెంబర్‌ వేతనంలోనే 87.50 శాతం బకాయి చెల్లించేందుకు ముందుకు వచ్చిన సంస్థ ప్రస్తుతం ఇంతవరకే చెల్లిస్తామని సంస్థ సీఈఓ వినయ్ దూబే పేర్కొన్నారు.

సంస్థను గాడిలో పెట్టే ప్రక్రియ కొనసాగుతున్నందున సిబ్బంది డిమాండ్‌ను నెరవేర్చేందుకు ఆశించిన సమయం కంటే మరికొంత సమయం పడుతుందని జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో వినయ్‌ దూబే పేర్కొన్నారు. ఈ మేరకు సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి వినయ్‌ దూబే ఉద్యోగులకు ఈమెయిల్‌ ద్వారా లేఖ రాశారు. 

‘సంస్థ కార్యకలాపాల్లో వీలైనంత త్వరగా స్థిరత్వం సాధించడానికి భారత బ్యాంకుల కన్సార్టియంతో చర్చలు జరుపుతున్నాం. ఇందు కోసం సంస్థ యాజమాన్యం, డైరెక్టర్ల బోర్డు నిరంతరం పరిష్కార ప్రణాళికలు రూపొందించడంలో నిబద్ధతతో పనిచేస్తోంది. ఈ ప్రక్రియలో కొన్ని సంక్లిష్ట సమస్యలు తలెత్తినందున మేం అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతోంది’అని ఆ లేఖలో వినయ్ దూబె వివరించారు. 

‘కాబట్టి ప్రస్తుతానికి మేం గతేడాది డిసెంబర్ వేతన బకాయిలు మాత్రమే చెల్లించగలుగుతున్నాం. ఇది మీ ఆర్థిక ఇబ్బందులకు ఏమాత్రం ఉపశమనం కలిగించదని తెలుసు. సంస్థ పట్ల మీ నిబద్ధతను గుర్తించిన యాజమాన్యం త్వరలోనే మరిన్ని నిధులు సేకరించి తదుపరి బకాయిలు చెల్లిస్తామని తెలియజేస్తున్నాం’అని ఆ లేఖలో దూబే పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios