Asianet News TeluguAsianet News Telugu

పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం: ఫ్యాక్టరీ యాజమాన్యంపై కేసు

ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలోని  పరవాడ ఫార్మా సిటీలో  గల లారస్ యూనిట్ లో  జరిగి న ప్రమాదంపై  పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం  జరిగిన ప్రమాదంలో  నలుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే.

Visakhapatnam Police  Files  Case Against  Parawada  Pharma City  management
Author
First Published Dec 28, 2022, 10:02 AM IST

పరవాడ: ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా  పరవాడ  ఫార్మాసిటీలోని  లారస్  యూనిట్ 3 లో జరిగిన ప్రమాదంపై  పోలీసులు కేసు నమోదు చేశారు.  రెండు రోజుల క్రితం  లారస్  యూనిట్ -3 లో షార్ట్ సర్క్యూట్  తో మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో  ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.  వీరిలో  నలుగురు ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని  మృతుల కుటుంబ సభ్యులు  ఆందోళనకు దిగారు.  కేజీహెచ్  మార్చురీ వద్ద నిన్న  మృతుల బంధువులు  ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్  చేశారు.  

ఈ నెల  26వ తేదీన  లారస్  యూనిట్ -3 లో  షార్ట్ సర్క్యూట్ తో  మంటలు చెలరేగాయి. దీంతో  అక్కడే విధులు నిర్వహిస్తున్న ఐదుగురు  కార్మికులు  తీవ్రంగా  గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్  ఆరా తీశారు.  ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై  సీఎం జగన్  కు నివేదించారు.  ఈ ప్రమాదంలో మరణించిన  మృతుల కుటంబాలకు  రూ. 25 లక్షలను  పరిహారంగా  ప్రభుత్వం  ప్రకటించింది.  మరో వైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  క్షతగాత్రుడికి మెరుగైన వైద్య సహాయం అందించాలని సీఎం జగన్  అధికారులను ఆదేశించారు.

also read:విశాఖపట్టణం పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం: నలుగురు కార్మికులు మృతి

రెండు తెలుగు రాష్ట్రాల్లో  పరిశ్రమల్లో తరుచుగా  ప్రమాదాలు జరుగుతున్నాయి.  ప్రమాదాలు జరిగిన సమయంలోనే అధికారులు హడావుడి  చేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  ఫ్యాక్టరీల్లో  భద్రతా ప్రమాణాల  విషయంలో  ఎలాంటి చర్యలు తీసుకోని  కారణంగానే  ఈ రకమైన పరిస్థితులు  నెలకొంటున్నాయని  కార్మిక సంఘాల నేతలు  విమర్శలు గుప్పిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios