Asianet News TeluguAsianet News Telugu

వైసిపి,జనసేన విమర్శలకు చెక్: ఈ సీటు నుంచి లోకేష్ అసెంబ్లీ బరిలోకి...

ఈ ప్రశ్నలపై అధికార తెలుగుదేశం పార్టీలో జోరుగా చర్చసాగుతోంది. నిన్న మెున్నటి వరకు ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన లోకేష్ మాత్రం గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచే పోటీ చెయ్యాలని భావిస్తున్నారని తెలుస్తోంది. 
 

Nara Lokesh may contest from Pedakoorapadu in Assembly elections
Author
Amaravathi, First Published Feb 21, 2019, 12:12 PM IST

గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావిస్తున్నారా..?దొడ్డిదారిన మంత్రి అయ్యారు..ప్రత్యక్ష ఎన్నికల్లో పంచాయితీ సర్పంచ్ గా  కూడా లోకేష్ గెలవలేరంటూ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు లోకేష్ వ్యూహాలు రచిస్తున్నారా...? ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకే రాబోయే సాధారణ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని భావిస్తున్నారా....? గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారా..?

అక్కడ ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నారనడంలో వాస్తవమెంత..?పెదకూరపాడు నియోజకవర్గంలో నారా లోకేష్ గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి..?అసలు లోకేష్ అసెంబ్లీ బరిలో నిలిచేందుకు పెదకూరపాడు నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి..? 

ఈ ప్రశ్నలపై అధికార తెలుగుదేశం పార్టీలో జోరుగా చర్చసాగుతోంది. నిన్న మెున్నటి వరకు ఉత్తరాంధ్ర లేదా రాయలసీమ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగిన లోకేష్ మాత్రం గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచే పోటీ చెయ్యాలని భావిస్తున్నారని తెలుస్తోంది. 

తొలుత తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే నారా లోకేష్ అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవి పొందారు. ఆ తర్వాత జరిగిన కేబినేట్ విస్తరణలో ఏపీ సీఎం చంద్రబాబు లోకేష్ కు మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రస్తుతం లోకేష్ మంత్రిగా రెండో సంవత్సరం పూర్తి చేసుకోబోతున్నారు కూడా. 

గతంలో పార్టీ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించిన లోకేష్ మంత్రి పదవి పొందాక మంత్రిగా తన శాఖలపై పట్టు సాధించారని ప్రచారం. ప్రతిపక్ష పార్టీలు లోకేష్ పై ఘాటు విమర్శలు చేసినప్పటికీ వాటికి ధీటుగా సమాధానాలిస్తూ లోకేష్ ప్రభుత్వ పాలనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 

అయితే వైఎస్ఆరా్ కాంగ్రెస్ పార్టీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం లోకేష్ మంత్రి అవ్వడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పంచాయితీ ఎన్నికల్లో సర్పంచ్ గా కూడా గెలవలేని లోకేష్ పంచాయితీరాజ్ శాఖ మంత్రా అంటూ నిలదీశారు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి పొంది మంత్రి అయ్యారంటూ ఘాటుగా విమర్శించారు. ఈ విమర్శలకు చెక్ పెట్టాలంటే ఇక అసెంబ్లీ బరిలో నిలవాల్సిందేనని లోకేష్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. రాయలసీమ నుంచి పోటీ చేస్తారని కొందరు, కాదు కాదు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారంటూ మరికొందరు ప్రచారం చేశారు. ఈ ప్రచారం ఇలా ఉంటే కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి లోకేష్ కర్నూలు నుంచి పోటీ చేస్తే తాను సీటు వదులుకుంటానని ప్రకటించారు. 

కృష్ణా జిల్లాలో లోకేష్ ఎక్కడ నుంచి పోటీ చేసినా గెలుపొందుతారంటూ మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ మీడియా సాక్షిగా ప్రకటించేశారు. అయితే చంద్రబాబు, లోకేష్ సర్వేలలో గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే లోకేష్ గెలుపొందుతారని తేలిందని తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో పెదకూరపాడు నియోజకవర్గంపై లోకేష్  ప్రత్యేక దృష్టిసారించారని తెలుస్తోంది. పెదకూరపాడు నియోజకవర్గం అయితే సేఫ్ అని టీడీపీలో ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర రాజధానికి అందుబాటులో ఉండటంతోపాటు తెలుగుదేశం పార్టీకి పెద్ద పట్టు ఉన్న నియోజకవర్గం కావడంతో లోకేష్ గెలుపు నల్లేరుపై నడకేనని తెలుస్తోంది. 

ప్రస్తుతం పెదకూరపాడు ఎమ్మెల్యేగా టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు. కొమ్మాలపాటి శ్రీధర్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి లోకేష్ ను బరిలోకి దించుతారని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే లోకేష్ అభ్యర్థిత్వంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరోవైపు లోకేష్ రాజధాని సమీపంలోని నియోజకవర్గం నుంచి కాకుండా వెనుకబడిన ప్రాంతాల నుంచి పోటీ చేస్తే ఆ ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందని ప్రచారం కూడా జరుగుతుంది. మరి సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios