Asianet News TeluguAsianet News Telugu

వైసీపీలోకి కేంద్రమాజీమంత్రి కిల్లి కృపారాణి : రేపు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక పార్టీ మారకపోతే తమ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడే అవకాశం ఉందని కిల్లి కృపారాణి ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి మంగళవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. 

ex union minister killi kruparani likely joins ysr congress party tomorrow
Author
Srikakulam, First Published Feb 18, 2019, 8:14 PM IST

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటి వరకు స్తబ్ధుగా గోపీల్లా ఉన్న నేతలు ఆయా పార్టీలలోకి జంప్ అవుతున్నారు. అంతే స్థాయిలో అధికార పార్టీ తెలుగుదేశం నుంచి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం విశేషం. 

తాజాగా కేంద్రమాజీమంత్రి కాంగ్రెస్ పార్టీ జెయింట్ కిల్లర్ కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈనెల 19న లోటస్  పాండ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో భేటీ కానున్నారు. అనంతరం ఆమె పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది. 

ఇకపోతే ఏపీలో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పినప్పటి నుంచి ఉన్న నేతలు ఒక్కొక్కరూ ఆ పార్టీ వీడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తుపెట్టుకోవడాన్ని సహించలేని కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. 

ఆనాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వెంటిలేటర్ పై కొనఊపిరతో కొట్టుమిట్టాడుతోంది. అదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని అధిష్టానం ప్రకటించడంతో ఒక్కొక్కరూ పార్టీ వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 

అలాగే అరకు మాజీఎంపీ కేంద్రమాజీమంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈనెల 24న సైకిలెక్కేందుకు ముహూర్తం కుదుర్చుకున్నారు. తాజాగా అనంతపురం జిల్లా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా ఆ పార్టీ వీడి త్వరలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు.   

ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఓ వెలుగు వెలిగిన కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి కూడా కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ దయనీయ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఆమె పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కేంద్రమాజీ మంత్రి కిల్లి కృపారాణి 2014 నుంచే సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీలో చేరిన సమయంలో ఆమె కూడా చేరతారంటూ ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. 

ఆ తర్వాత  శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ముగింపు బహిరంగ సభలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఆరోజు కూడా ఆమె వైసీపీలో చేరలేదు. 

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక పార్టీ మారకపోతే తమ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడే అవకాశం ఉందని కిల్లి కృపారాణి ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి మంగళవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఉదయం 11గంటలకు జగన్ తో భేటీ అయి పార్టీలో చేరే అంశంపై చర్చించనున్నారు. అన్నీ కుదిరితే అప్పుడే పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇకపోతే ఏపీ రాజకీయాల్లో జెయింట్ కిల్లర్ గా కిల్లి కృపారాణికి పేరుంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడుని ఓడించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. టీడీపీలో నెంబర్ 2 స్థానంలో ఉంటూ, రాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో ఏలుతున్న ఎర్రన్నాయుడుని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టిలో పడ్డారు.  

అంతే ఆనాటి నుంచి ఆమెను జెయింట్ కిల్లర్ గా కాంగ్రెస్ పార్టీ పిలవడం మెుదలుపెట్టింది. అనంతరం మన్మోహన్ సింగ్ కేబినేట్లో మంత్రి పదవిని సైతం కొట్టేశారు. కేంద్ర సమాచార మరియు టెలీకమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు. 

అయితే రాష్ట్ర విభజన పుణ్యమా అంటూ జెయింట్ కిల్లర్ కాస్త బొక్క బోర్లా పడ్డారు. విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓటమి చెందారు. ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు చేతిలో డిపాజిట్ కోల్పోయారు. 

రాష్ట్ర విభజన అనంతరం ఒక్కొక్కరు పార్టీ మారుతున్నా కిల్లి కృపారాణి మాత్రం పార్టీ వీడలేదు. గతంలో తెలంగాణ ముందస్తు ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే కోలుకోవడం కష్టమని తేల్చి చెప్పారు. 

రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె పార్టీ వీడాలని నిర్ణయించుకున్నా టీడీపీతో పొత్తు ఉంటుందని లీకులు రావడంత మిన్నకుండిపోయారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలోనూ ప్రజాకూటమి అభ్యర్థుల తరుపున ప్రచారం కూడా నిర్వహించారు కిల్లి కృపారాణి.  

అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు వికటించినా ఏపీలో సక్సెస్ అవుతుందని ఆమె ఆశించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటే కొన్ని సీట్లు అయినా దక్కుతాయని అధికార పార్టీ తోడవ్వడంతో రాజకీయం తిప్పొచ్చని ఆశించారు. 

తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచిందన్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ఏపీలో పొత్తు లేదని తేల్చి చెప్పేసింది. దీంతో ఆమె తన రాజకీయ భవిష్యత్ కోసం వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో కార్యకర్తలతో సమావేశమై వైసీపీలో చేరే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.  

ఇప్పటికే వైఎస్ జగన్ పలువురి తటస్థులకు అన్న పిలుపు పేరుతో లేఖలు రాశారు. పార్టీకి సూచనలు సలహాలు ఇవ్వాలని కూడా కోరారు. పార్టీలో చేరే ఆసక్తి ఉంటే నేరుగా కలవాలని కూడా జనగ్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కండువాకప్పుకుంటే బాగుంటుందని కొంతమంది సన్నిహితులు ఆమెకు సూచిస్తున్నారట.

ఇకపోతే గతంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సంప్రదింపులు జరిపినప్పుడు జగన్ ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆమె చెప్పుకొస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అవకాశం ఇవ్వాలని కోరగా అక్కడ వైసీపీ నుంచే పోటీ ఉందని జగన్ చెప్పారని వేరే స్థానం చూసుకోవాలని చెప్పారట. 

అయితే కళింగ సామాజిక వర్గానికి చెందిన ఆమె తన సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న పలాస టిక్కెట్ ఇవ్వాలని కోరారు. ఆ సీటుపై కూడా జగన్ స్పష్టమైన హామీ ఇవ్వలేదట. ముందు పార్టీలో చేరాలని టిక్కెట్ విషయం తర్వాత చూస్తామని అయితే పార్టీ పరంగా మంచి గుర్తింపు మాత్రం ఇస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. 

జగన్ కనుక స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆమె కాంగ్రెస్ లో నే ఉండిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్యకర్తలు, అభిమానులు ఆమెపై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరడంతో ఆమె ఇక వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెసుకు మరో షాక్: జగన్ పార్టీలోకి కిల్లి కృపారాణి

వైసిపిలో చేరనున్న మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి

Follow Us:
Download App:
  • android
  • ios