Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ కి షాక్: సైకిలెక్కనున్న మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్న ఆయన ఆయన అడుగు జాడల్లో నడవాలనుకుంటున్నానని ప్రకటించారు. 

ex mla madhusudhan guptha likely joins tdp
Author
Ananthapuram, First Published Feb 18, 2019, 6:17 PM IST

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి మరోషాక్ తగిలింది. పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి సొంత జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా కాంగ్రెస్ కు హ్యాండిచ్చారు. త్వరలోనే సైకిలెక్కనున్నట్లు ప్రకటించారు. 

దివంగత సీఎం వైఎస్ రాజశేకర్ రెడ్డి హయాంలో 2009లో గుంతకల్లు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో స్థబ్ధుగా ఉన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగలడంతో ఆయన 2014లో పోటీ చేసేందుకు విముఖత చూపారు. 

ఆనాటి నుంచి రాజకీయాల్లో స్తబ్ధుగా ఉండిపోయారు. అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన్ను కలిశారు. జగన్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. వైఎస్ జగన్ తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అందువల్లే ఆయన చేపట్టిన పాదయాత్రకు సంఘీభావం ప్రకటించానని తెలిపారు. 

దీంతో మధుసూదన్ గుప్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా ఈ ఏడాది జనవరి 18న సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. పార్టీలో చేరే అంశంపై చర్చించారు. 

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయకత్వం చాలా అవసరమన్న ఆయన ఆయన అడుగు జాడల్లో నడవాలనుకుంటున్నానని ప్రకటించారు. 

రాష్ట్రం విభజన నేపథ్యంలో అనేక సమస్యలు తలెత్తినా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని కొనియాడారు. చంద్రబాబు లాంటి నేతలు రాష్ట్రానికి చాలా అవసరమని చెప్పుకొచ్చారు. త్వరలోనే చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు గుంతకల్ మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా స్పష్టం చేశారు. 

ఇకపోతే మధుసూదన్ గుప్తా తెలుగుదేశం పార్టీలో చేరడానికి తెరవెనుక చక్రం తిప్పింది ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అని ప్రచారం. కాంగ్రెస్ పార్టీ హయాంలో జేసీ దివాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు మధుసూదన్ గుప్తా. ఆ అనుబంధంతో ఆయనను తెలుగుదేశం పార్టీలోకి తీసుకురానున్నారు. ఇకపోతే గుంతకల్లు అసెంబ్లీ టికెట్ పై మాత్రం సందిగ్దత నెలకొంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios