Asianet News TeluguAsianet News Telugu

AP Politics: అధికారం కోసం ఇంత నీచానికి ఒడిగట్టాలా!? 

AP Politics: అధికారం కోసం ఎంతకైనా దిగ‌జార‌వచ్చని బాహాటంగానే నిరూపిస్తున్నారు. నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రచారం చేస్తున్న వైఎస్ జగన్ పై ఎవరో ఆగంతకుడు రాయి విసిరాడు.  దీంతో సీఎం జగన్ ఎడమ కంటి పైన  గాయమైంది. ఈ పరిణామంలో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. 

AP Politics CM Jagan Reddy Injured In Stone-Throwing While Campaigning KRJ
Author
First Published Apr 14, 2024, 9:48 AM IST

AP Politics: అధికారంలో కోసం..ఏదైనా చేయాలని, ఎంతగైనా తెగించాలి అనేది రాజకీయ నాయకులకు పరిపాటిగా మారిందా? అంటే.. నేటీ ఎన్నికల సిత్రాలను చూస్తే ..  నిజమేమో అనే సందేహం రాకమానదు. అధికారం కోసం.. పదవి కోసం.. సమ దాన దండోపాయాలను అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. ఈ అధికార దాహంలో మంచి, చేడు అనే విలువ‌లను త్యజిస్తున్నారు. అసలు వాళ్ల డిక్షనరీలో ’విలువలు’ పదం ఉంటుందా? అనే సందేహం కూడా రాకమానదు. ఎందుకంటే.. తమ అవ‌స‌రం కోసం ఎవ‌రైనా ఆకాశానికి ఎత్తేస్తారు. లేదంటే..అథ పాతాళానికి తొక్కేస్తారు. అలాగే.. తమపై ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆ నిందలను, ఆరోపణలను అందంగా స‌మ‌ర్థించుకుంటూ.. తమ నీఛ రాజ‌కీయాన్ని కొన‌సాగిస్తూనే ఉంటారు. నేడు ఏపీ పాలిటిక్స్ లోనూ ఇలాంటి చిత్రాలే తారసపడుతున్నాయి. 

ఎన్నికల ప్రచారం అనగానే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలడం కామనే. అదే సమయంలో ప్రచారంలో భాగంగా ప్రజా కేత్రంలోకి వెళ్లిన రాజకీయ నాయకులకు సత్కారాలతో పాటు ఛీత్కారాలు కూడా ఎదురవడం సాధారణమే. అలా ఎదురయ్యే అవమానాలు, అనుమానాలు దాటుతూ.. ముందుకు సాగుతుంటాయి. కానీ, ఈ సమయంలో వ్యక్తిగత దాడులకు, భౌతిక దాడులకు పాల్పడటం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సమంజసం కాదు. వాటిని ఎవరు కూడా సహించరు. నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రచారం చేస్తున్న వైఎస్ జగన్ కు ఊహించని పరిణామం ఎదురైంది. బస్సుయాత్రలో చేస్తున్న వైఎస్ జగన్ పై ఎవరో ఆగంతకుడు రాయి విసిరాడు. దీంతో సీఎం జగన్ నుదుట ఎడమ కంటి పైన  గాయమైంది. ఈ ఉహించని పరిణామంలో ఏపీ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. గల్లీ నుంచి ఢిల్లీ నేతల వరకు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు.
 
అదే సమయంలో..ఎన్నికల వేళ ఈ దాడి జరగడం పలు అనుమానాలకు, సందేహాలకు దారి తీస్తుంది. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందా? లేదా అనుకోకుండా జరిగిందా ? జగన్ పాలనపై నిరసన చర్యనా? అనే సందేహాలు వస్తున్నారు. ఈ సమయంలో వైఎస్ జగన్ హావాను తట్టుకోలేక, ఎన్నికల్లో తమ నేతను ఎదిరించలేక ప్రతిపక్ష కూటమే ఈ దాడికి పాల్పడిందని అధికార పక్షం వైసీపీ ఆరోపిస్తుంటే.. లేదు లేదు వైఎస్ జగన్ నే కత్తిపోటు తరహాలో మరో డ్రామాకు తెర తీశారని ప్రతిపక్ష కూటమి వాదిస్తుంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్యమాటల యుద్ధం జోరుగా సాగుతోంది. అదేసమయంలో సోషల్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. 

జగన్ పై దాడి జరిగితే.. సానుభూతి రావాలి గానీ, విమర్శలు, ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని భావిస్తున్నారా? అయితే.. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ మోహన్ రెడ్డిపై కోడి కత్తితో దాడి జరిగిన వైనం తెలిసిందే. నాటకీయ పరిణామాల తర్వాత వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టినప్పటికీ, ఈ కేసు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. ఈ కేసులో వైఎస్ జగన్ కోర్టు ఎదుట హాజరు కావాలంటూ పలుమార్లు న్యాయస్థానం నోటీసులు పంపినా.. జగన్ మాత్రం హాజరు కాకపోవడం ఇందులో ట్విస్ట్. 

ఇదిలా ఉంటే ..  సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముందు.. ఎన్నికల ప్రచారంలో అదే తరహాలో ఏపీ హాట్ పాలిటిక్స్ కు వేదికైనా విజయవాడలో జగన్ పై రాయి దాడి జరిగింది. అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారనేది ప్రాధమికంగా తెలియరాలేదు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేమిటంటే.. జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో పలుమార్లు పవర్ కట్స్ తో యాత్రలో అంతరాయం ఏర్పడినట్టు, ఈ సమయాన్ని అనువుగా భావించిన దుండగులు  రాయితో దాడి జరిగినట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. సరే ఏదిఏమైనా ఇలా భౌతిక దాడి పాల్పడటం సరికాదు. ఈ దాడికి ఎవరు పాల్పడిన ఖండించాల్సిందే.. వైసీపీ పాలనపై వ్యతిరేకత, నిరసన తెలియజేయాలంటే.. ప్రజాస్వామ్య యుతంగా, శాంతి మార్గంలో నిరసనలు వ్యక్తం చేయాలని, కానీ ఇలా భౌతిక దాడులకు దిగడం ఏ మాత్రం సమంజసం కాదు. 

అయితే ఈ దాడి జగన్ కు అనుకూలిస్తుందో? ప్రతికూలిస్తుందో? .. ఎందుకంటే.. ఇప్పటికే జగన్ ఖాతాలో కోడి కత్తి కేసు ఉంది. 2019లో జరిగిన ఈ దాడి.. ఇప్పటికీ అలానే పెండింగ్ లో ఉండటంతో .. ఈ ఘటనను కూడా  ‘పొలిటికల్ స్టంట్’గా భావిస్తున్నాయి ప్రతిపక్షాలు. అదే రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నాయి.  గతంలో మాదిరి సింపతీనే ప్రధాన అజెండాగా మార్చుకుని ప్రచారం చేస్తారో.. లేదా నిందితులను గుర్తించి. చట్టపరంగా చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఏదిఏమైనా.. ఎన్నికల ముందు రాజకీయ నాయకులపై జరిగే ఇలాంటి దాడులు జరుగుతుండడం సాధారణమైంది. గతంలో ఇలాగే ఎన్నికల ముందు మమతా బెనర్జీ వంటి బడా నేతలపై కూడా దాడులు జరిగాయి. ఆ దాడులను తమకు అనువుగా మార్చుకుని అధికారంలోకి వచ్చిన సంఘటనలు కూడా లేకపోలేవు. ఏదిఏమైనా.. ఈ దాడికి పాల్పడిందెవరనేది? సూత్రధారికే ఎరుక!

Follow Us:
Download App:
  • android
  • ios