Asianet News TeluguAsianet News Telugu

''ఫస్టొచ్చింది... పెన్షన్ రాలేదు : చంద్రబాబు కుట్రలకు అవ్వాతాతలు, వికలాంగులు బలి''

ఎన్నికలు రావడం ఏమిటోగానీ కొందరి స్వార్థ రాజకీయాలకు తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని అవ్వాతాతలు, వికలాంగులు భావిస్తున్నారట. తమ చేతికాడికి వచ్చే డబ్బులను రాకుండా చేసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇదీ ఆంధ్ర ప్రదేశ్ లో పెన్షనర్ల పరిస్థితి... 

Andhra Pradesh Pensioners Serious on TDP Chief Chandrababu Naidu AKP
Author
First Published May 1, 2024, 3:10 PM IST

అమరావతి : ప్రతి నెల ఫస్ట్ తారీఖున వచ్చే వాలంటీర్ ఈ నెల రాలేదు. నెలవారి ఖర్చుల కోసం చేతిలో పడే డబ్బులు పడలేదు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల గురించి తెలియని అవ్వాతాతలు వాలంటీర్ల కోసం ఇంకా ఎదురుచూస్తున్నారు. కాస్త ఆలస్యమైనా వస్తారు... పెన్షన్ డబ్బులు ఇస్తారని ఎంతో ఆశతో వున్నారు. కానీ వారికేం తెలుసు వాలంటీర్ల సేవలను ఈ రాజకీయాలు అడ్డుకున్నాయని... ఈ మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేసాయని. పెన్షన్ డబ్బులు చేతిలో పడక అవ్వాతాతలు ఉసూరుమంటున్న పరిస్థితి ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో వుంది. 

ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో వుండటంతో వాలంటీర్ సేవలకు అంతరాయం ఏర్పడింది.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాలను మరింత ఈజీగా ప్రజలచెంతకు చేర్చేందుకు తీసుకువచ్చిన వ్యవస్థలో భాగమే ఈ వాలంటీర్లు. ఇంటింటికి తిరిగి అర్హులైన ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తికి సహాయం చేస్తుంటారు వాలంటీర్లు. ఇలా వాలంటీర్ల ద్వారా జరుగుతున్న ప్రజాసేవను చూసి ప్రతిపక్షాల్లో గుబులు మొదలయ్యిందని... అందువల్లే ఎన్నికల వేళ వారి సేవలను అడ్డుకున్నారని వైసిపి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. ప్రజలకు కూడా టిడిపి, జనసేన, బిజెపి కూటమి కుట్రలు అర్థమయ్యాయని అంటున్నారు. 

బ్యాంకులకు వెళ్లి పెన్షన్ డబ్బులు తీసుకోలేరనే వాలంటీర్ల ద్వారా ఇంటివద్దకే పంపించేది ప్రభుత్వం. ఇలా ప్రతినెలా ఫస్ట్ తేదీనే పెన్షన్ డబ్బులు అందేవి. దీంతో ఆ నెలకు సరిపడా సరుకులు కొనుక్కోవడమో... వైద్య ఖర్చులకు ఉపయోగించడమో, మందులు కొనుక్కోవడమో చేసేవాళ్లు వృద్దులు. ఇంకా ఏమైనా డబ్బులు మిగిలితే మనవళ్లు, మనవరాళ్లకు ఇచ్చి ఆనందించేవారు. ఇలా ఎవరిపైనా ఆధారపడకుండా వుండే అవ్వాతాతలు, వికలాంగులు ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాలతో ఇబ్బంది పడాల్సి వస్తోందని వైసిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న వారు ఇప్పుడు ఎవరి సాయంతోనే బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. 

పెన్షన్ డబ్బులను వాలంటీర్ల ద్వారా కాకుండా నేరుగా పంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో అవ్వాతాతలు, వికలాంగులు బ్యాంకులకు వెళ్లి ఆ డబ్బులు తీసుకోవాల్సి వస్తోంది. ఈ ఎండల్లో బ్యాంకులకు వెళ్ళడం... ఎవరి సాయమో తీసుకుని విత్ డ్రా ఫారం నింపడం... ఆ క్యూలైన్లలో నిలబడి డబ్బుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇది తలచుకుంటేనే భయపడిపోతున్నారు ఆంధ్ర ప్రదేశ్ పెన్షనర్లు. 

ఇక బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బులు వేయడంలో మరో సమస్య వుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేనివాళ్లే పెన్షన్ డబ్బులపై ఆశలు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్లు బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటేన్ చేయడం కష్టం. దీంతో ఇప్పుడు పడే పెన్షన్ డబ్బుల్లో కొంత పెనాల్టీ రూపంలో వసూలు చేస్తాయి బ్యాంకులు. ఇలా ఎంతో కష్టపడి బ్యాంకులకు వెళ్లినా చేతికందే అరకొర డబ్బులు ఎందుకూ సరిపోవు. వాలంటీర్ ఇంటికి వచ్చి ఎలాంటి కటింగ్ లేకుండా మూడు వేల రూపాయలు చేతిలోపెడితే కలిగే ఆనందం ఇప్పుడు బ్యాంకులకు వెళ్లే కటింగ్ లతో కూడిన పెన్షన్ డబ్బులు తీసుకుంటున్న అవ్వాతాతలకు లేదు. 

వాలంటీర్ల వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు వస్తున్న మంచిపేరు చూసి ఓర్వలేకే చంద్రబాబు కుట్రలు పన్నారని అవ్వాతాతలు, వికలాంగులకు అర్థమయ్యిందట. ఇలా తమ చేతికాడి డబ్బులు లాక్కున్న చంద్రబాబుకు, ఆయనతో జతకట్టిన పార్టీలకు రేపు ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతామని అంటునట్లు వైసిపి నాయకులు చెబుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios