రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ అంశం నిన్న(గురువారం) దేశ పార్లమెంట్ ను కుదిపేసింది. అధికార, ప్రతిపక్ష ఎంపీల పోటాపోటీ నిరసనలతో పార్లమెంట్ దద్దరిల్లింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా డా. బిఆర్ అంబేద్కర్ ను అవమానించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లేదు లేదు కాంగ్రెస్ పార్టీయే అంబేద్కర్ కు తగిన గౌరవం ఇవ్వలేదని బిజెపి ఆరోపిస్తుంది.
అయితే ఈ మాటలయుద్దం ముదిరి గురువారం ఘర్షణ వాతావరణం నెలకొంది. పార్లమెంట్ ప్రాంగణంలో అధికార,ప్రతిపక్ష ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఇందులో బిజెపి ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి గాయపడ్డారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోయడంవల్లే తాను గాయపడినట్లు సారంగి చెబుతున్నారు. తన ముందున్న ఎంపీని రాహుల్ తోసారని... అతడు తనపై పడటంతో కిందపడి గాయమైనట్లు సారంగి వెల్లడించారు.
ఈ ఘటనలో ఇప్పటికే రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. తోపులాటలో సారంగి గాయపడ్డారని... తమ నాయకులనే బిజెపి ఎంపిలు తోసేసారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
ఇలా నిన్న పార్లమెంట్ ఘటన తర్వాత ప్రతాప్ చంద్ర సారంగి పేరు మారుమోగుతోంది. ఈ క్రమంలో ఇంతకు ఆయన ఎవరు? ఏ రాష్ట్రానికి చెందినవారు? అనేది తెలుసుకుందాం.
ప్రతాప్ చంద్ర సారంగి ఒడిషాకు చెందినవారు.ఆయన ప్రస్తుతం బాలాసోర్ ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలోనూ ఓసారి ఎంపీగా,రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసారు.
గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసారు.మోదీ 2.0 కేబినెట్ లో పశు సంవర్ధక, పాడి పరిశ్రమ,మత్స్య, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా పనిచేసారు.
డిగ్రీ చదివిన సారంగి సామాజిక కార్యక్రమాలతో పాటు రాజకీయలు చేస్తుంటారు. భజరంగదళ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ లలో పనిచేసిన ఆయన ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్నారు.