Asianet News TeluguAsianet News Telugu

RajyaSabha: కాంగ్రెస్‌, బీఆర్ఎస్ బలాలు ఏమిటీ? బీఆర్ఎస్ పార్టీ ముగ్గురిని బరిలోకి దింపితే..?

తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండు సీట్లను కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మూడు సీట్లకు ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్ ఒక్కటి, కాంగ్రెస్ రెండు సీట్లను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ బీఆర్ఎస్ ఒకరికి మించి అభ్యర్థులను నిలబెడితే మాత్రం ఓటింగ్ పై ఆసక్తి నెలకొంటుంది.
 

telangana rajyasabha elections, brs one seat, congress two seats likely to win unanimously kms
Author
First Published Jan 30, 2024, 6:58 PM IST

RajyaSabhaElections: కేంద్ర ఎన్నికల సంఘం 56 రాజ్యసభ సీట్లకు సోమవారం ఎన్నికలను ప్రకటించింది. 15 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 15వ తేదీలోగా నామినేషన్లు వేయాలి. 27వ తేదీన ఎన్నికలు, అదే రోజు ఫలితాలు వెలువడతాయి. తెలంగాణలోనూ ఈ ఎన్నికలు జరుగుతాయి. బీఆర్ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, బాడుగులు లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్రలు 2018లో పెద్దల సభలో అడుగుపెట్టారు. వారి పదవీ కాలం ముగుస్తుండటంతో ఈ మూడు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. రాజ్యసభ ఎంపీల ఎన్నికలు పరోక్షంగా జరుగుతాయని తెలిసిందే. పార్టీల ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తారు. 

ఈ నేపథ్యంలోనే పార్టీల బలాబలాలపై ఆసక్తి నెలకొంది. గతంలో ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలే ఉండగా.. ఈ సారి ఆ పార్టీ మళ్లీ మూడు స్థానాలను దక్కించుకోగలదా? లేక అధికారాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నది? వంటి వివరాలు తెలుసుకుందాం.

రాజ్యసభ ఎంపీగా గెలవాలంటే ఎన్ని ఎమ్మెల్యేల ఓట్లు పొందాలి? అనేది తెలుసుకోవడానికి ఓ ఫార్ములా ఉన్నది. ఓటు వేయనున్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను ఆ రాష్ట్రంలో ఖాళీగానున్న రాజ్యసభ సీట్ల సంఖ్యకు ఒకటి కలిపి వచ్చిన దానితో భాగించాలి. దానికి ఒకటి కలిపితే మెజార్టీ వచ్చినట్టుగా భావించాలి. ఈ లెక్కన తెలంగాణలో ఇప్పుడు రాజ్యసభ ఒక్క సీటు గెలవాలంటే 31 ఓట్లు రావాలి. అంటే 31 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి.

Also Read: రాజ్యసభ ఎన్నికలు: వైసీపీ, టీడీపీ బలాబలాలు.. ఆ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు పడితే పరిస్థితులు ఏమిటీ?

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నది. బీఆర్ఎస్‌కు 39 సీట్లు ఉన్నాయి. ఈ లెక్క కాంగ్రెస్ పార్టీ సునాయసంగా రెండు రాజ్యసభ సీట్లను, బీఆర్ఎస్ ఒక రాజ్యసభ సీటును గెలవొచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను, బీఆర్ఎస్ ఒక్క అభ్యర్థినే బరిలో నిలిపే ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికకావొచ్చు.

ఒక వేళ కాంగ్రెస్ పార్టీ ముగ్గురిని, బీఆర్ఎస్ పార్టీ కూడా ఇద్దరు లేదా ముగ్గురిని అభ్యర్థులుగా నిలబెడితే మాత్రం ఓటింగ్ రసవత్తరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే క్రాస్ వోటింగ్ జరిగే అవకాశాలను కొట్టిపారేయలేం.

Also Read: Imran Khan: పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు.. ఇంతకీ సైఫర్ కేసు ఏమిటీ?

బీజేపీకి ఎనిమిది, ఎంఐఎంకు ఏడు సీట్లు ఉన్నాయి. ఒక్క సీపీఐ ఎమ్మెల్యే ఉన్నారు. సీపీఐ కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తున్నారు. బీఆర్ఎస్‌కు మద్దతుగా ఎంఐఎం ఏడు ఓట్లు పడతాయి. ఒక వేళ బీజేపీ కూడా బీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చినా రెండో సీటును గెలుచుకోవడం కష్టమే. ఒక వేళ కాంగ్రెస్ నుంచీ క్రాస్ వోటింగ్‌గా బీఆర్ఎస్‌కు పడితే గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ, వాస్తవంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో చాలా వరకు బీఆర్ఎస్ రెండు రాజ్యసభ సీట్లను కోల్పోయే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ రెండు రాజ్యసభ సీట్లను గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

కనీసం పది మంది శాసన సభ్యులు ఉంటే ఒక రాజ్యసభ సీటుకు అభ్యర్థిని బరిలోకి దింపవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios