ఇష్టం లేని వాళ్లు బాధ్యతల నుండి తప్పుకోవచ్చు: కలెక్టర్లు, ఎస్పీల భేటీలో రేవంత్ రెడ్డి
కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అయ్యారు.
హైదరాబాద్: ఇష్టం లేని వాళ్లు బాధ్యతల నుండి తప్పుకోవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చెప్పారు
ఆదివారంనాడు తెలంగాణ సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల సమావేశం నిర్వహించారు.తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని తేల్చి చెప్పారు.
అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు.
డ్రగ్స్ వల్ల తెలంగాణకు పంజాబ్ గతే పట్టేలా ఉందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.డ్రగ్స్ , భూ కబ్జా అనే మాటలు వినపడకూడదన్నారు.
నకిలీ విత్తనాలపై అధికారులు ఉక్కుపాదం మోపాలని రేవంత్ రెడ్డి సూచించారు.నకిలీ విత్తనాలు టెర్రరిజం కంటే డేంజర్ అని సీఎం చెప్పారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వసనీయత పెరిగేలా చూడాలని అధికారులను కోరారు.భూకబ్జాదారులపై ఉక్కుపాదం మోపాలన్నారు.న్యూఇయర్ వేడుకలు, ఈవెంట్ల పేరుతో యువత పక్కదారి పడుతుందన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. వచ్చే ఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ నాటికా ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. 100 రోజుల్లో ఈ హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. లబ్దిదారుల ఎంపిక కోసం ఈ నెల 28 నుండి గ్రామ సభలు నిర్వహించనున్నారు.
also read:స్వేచ్ఛ హరిస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు: కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పలు హామీలు ఇచ్చింది. ఇందులో ఆరు గ్యారంటీలు కీలకమైనవి. ఈ హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టో లో కూడ పలు హమీలున్నాయి.ఈ హామీల అమలుపై కాంగ్రెస్ సర్కార్ కేంద్రీకరించింది.