Asianet News TeluguAsianet News Telugu

కొత్త ప్లాన్లు, ఆఫర్లతో ఆకట్టుకుంటున్న టెలికాం నెట్‌వర్క్‌లు !

 దేశీయ టెలికం సంస్థలు రూట్ మార్చేశాయి. ఎప్పటికప్పుడు ఆఫర్లు మార్చేస్తూ తమ సబ్ స్క్రైబర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఏజీఆర్‌పై సుప్రీంకోర్టు తీర్పు అమలు నేపథ్యంలో ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా దాదాపు 50 శాతం చార్జీలు పెంచాయి. వాటితోపాటు జియో కూడా సుమారు 40 శాతం రీచార్జీలు పెంచింది. దీంతోపాటు ఇంటర్ యూజర్ కనెక్ట్ (ఐయూసీ) కాల్స్ మీద పరిమితులు విధించింది. కానీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వ్యూహాత్మకంగా ఐయూసీపై చార్జీలు విధించబోమని ప్రకటించాయి.

telecom networks new recharge plans: Who offers the cheapest data, talktime
Author
Hyderabad, First Published Dec 22, 2019, 12:16 PM IST

న్యూఢిల్లీ: కాల్స్ అపరిమితం‌, రోజువారీ వినియోగానికి అవసరమైనంత డేటా.. తదితర ఆఫర్లతో టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు ఇప్పటివరకు ఖాతాదారులను ఆకర్షించాయి. ఇప్పుడు అపరిమిత కాల్స్‌పై ఆంక్షలు విధిస్తూ, డేటా వినియోగ ఛార్జీలను కూడా పెంచేస్తున్నాయి. ఇంతకుముందుతో పోలిస్తే చందాదార్లకు గతంతో పోలిస్తే ఆర్థిక భారం కలిగిస్తున్నాయి. ఇదేసమయంలో కొత్త చందాదార్లను ఆకర్షించడానికి సిమ్‌ కార్డు విక్రేతకు మాత్రం ఆఫర్లను పెంచుతున్నాయి.

మూడేళ్ల క్రితం రిలయన్స్‌ జియో సేవలు ఆరంభించినప్పటి నుంచి మొబైల్‌ వినియోగదార్లకు ‘స్వర్ణయుగం’ నడిచిందన్న మాటలు వినిపిస్తున్నాయి. కాల్స్‌కు ఛార్జీ లేకుండా అధికవేగం కలిగిన 4జీ డేటాకు మాత్రమే అదీ అతితక్కువ మొత్తాల్లో వసూలు చేయడంతో అతి తక్కువ కాలంలోనే 35 కోట్ల చందాదార్లను సాధించి, దేశంలో రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌గా జియో ఎదిగింది. 

also read టిక్ టాక్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా అంటే ?

జియోకు వెళ్లకుండా తమ చందాదార్లను కాపాడుకునేందుకు, కొత్త వారిని జతచేర్చుకునేందుకు.. ప్రైవేటురంగంలో మిగిలిన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కూడా దాదాపు జియో లాంటి పథకాలే అమల్లోకి తెచ్చాయి. ప్రభుత్వరంగ బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జీ స్పెక్ట్రమ్‌ లేకున్నా, 3జీ సేవల్లోనే ఇలాంటి పథకాలను ఆఫర్‌ చేసి, ధీటుగా నిలిచింది. 

గతంతో పోలిస్తే, మొబైల్‌ వినియోగదార్లకు ఈ మూడేళ్లలో ఆర్థిక భారం గణనీయంగా తగ్గడమే కానీ పెరగ లేదు. ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్‌ చేసుకోవడంతో పాటు రోజుకు 1.5 -2.0 జీబీ వరకు 4జీ డేటాను సామాన్యులు కూడా ‘బిల్లు భయం’ లేకుండా వినియోగించుకున్నారు. 2019 డిసెంబర్ నుంచి పరిస్థితి మారిపోయింది. అపరిమిత కాల్స్‌నెట్‌వర్క్‌ సంస్థల మధ్య అనుసంధాన ఛార్జీ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తున్నాయి.

గతంలో అనుకున్న మేర, వచ్చే జనవరి 1 నుంచి ఇది తొలగించాలి.ఇందుకు పాత సంస్థలు అంగీకరించకపోవడంతో, ఈ ఛార్జీ కొనసాగుతుందన్న నిర్ణయానికి వచ్చిన జియో గతనెల ఆరో తేదీ నుంచి తమ చందాదార్ల వద్ద ఆ సొమ్ము వసూలు చేస్తోంది. తమ నెట్‌వర్క్‌ పరిధిలో అపరిమిత కాల్స్‌ను అనుమతిస్తూనే, ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌పైనే ఈ ఛార్జీ వసూలు చేస్తున్నామని తెలిపింది. 

telecom networks new recharge plans: Who offers the cheapest data, talktime

సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌), స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీ, లైసెన్స్‌ రుసుము, వడ్డీ, జరిమానాలు.. అన్నీ కలిపి ప్రభుత్వానికి టెలికాం సంస్థలు రూ.1.47 లక్షల కోట్లు చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించడంతో.. గట్టెక్కేందుకు ఛార్జీలు పెంచుతున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా ప్రకటించాయి.

దీంతోపాటు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రోజుకు 1, 1.5, 2.0 జీబీ డేటా ఇచ్చే పథకాల కాల పరిమితి తగ్గించడంతోపాటు ఆయా పథకాల రేట్లను 40-50 శాతం వరకు పెంచాయి. వీటితోపాటే జియో కూడా తమ పథకాల ధరలు పెంచింది. ఇప్పుడు జియో నెట్‌వర్క్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కాల్స్‌ చేసుకునేందుకు ఆయా పథకాల కింద సగటున నెలకు 1,000 నిమిషాల వరకు అవకాశం ఇచ్చింది.

ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా మాత్రం ఇతర నెట్‌వర్క్‌లకు చేసుకునే కాల్స్‌కు తాము ఛార్జీ వసూలు చేయబోమంటూ తమ పథకాలను సవరించుకున్నాయి.మొత్తంమీద తమ చందాదార్లను కాపాడుకునేందుకు మూడు దిగ్గజ టెలికం సంస్థలు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. టారిఫ్‌లు తక్కువగా ఉన్నప్పుడు, చందాదార్లను ఆకర్షించడం సులభమే.

also read వొడాఫోన్ నుండి 4 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు

ధరలు పెరుగుతున్న వేళ మాత్రం రిటైలర్ల సహకారం అవసరమే. అందుకే సిమ్‌కార్డులు విక్రయించేవారిని ఆకట్టుకునేందుకు టెలికాం సంస్థలు ఆఫర్ల వల విసురుతున్నాయి.చందాదార్ల సంఖ్య పరంగా 2-3 స్థానాల్లో ఉన్న జియో, ఎయిర్‌టెల్‌ నడుమ కనెక్షన్ల యుద్ధం తీవ్రమైంది. దీంతో సిమ్‌కార్డులు విక్రయించే రిటైలర్లను ఆకట్టుకునేందుకు, ఒక్కో కొత్త కనెక్షన్‌పై ఇచ్చే ప్రోత్సాహకాన్ని దాదాపు మూడు రెట్లు చేసినట్లు సమాచారం.

ఒక కొత్త సిమ్‌కార్డుపై రూ.100-200 వరకు ప్రాంతాన్ని బట్టి రిటైలర్‌కు టెలికాం సంస్థలు ఆఫర్‌ చేస్తున్నాయి. వేరే సంస్థ నుంచి మొబైల్‌ నెంబరు పోర్టబులిటీ (ఎంఎన్‌పీ) ద్వారా చందాదారును ఆకర్షించగలిగితే మరింత అధికంగా చెల్లిస్తున్నాయి. సహజంగా నెంబర్‌పై ఆసక్తి ఉన్నవారు, విద్య-ఉద్యోగ-వ్యాపార-వినియోగ సంస్థలతో అనుసంధానమైన మొబైల్‌ నెంబర్‌ను కాపాడుకునేందుకు కనెక్షన్‌దారులు ఆసక్తి చూపుతారు. రీఛార్జి చేస్తేనే నిలుస్తుంది కనుక, ఈ నెంబర్ తప్పనిసరిగా పరిరక్షించుకుంటుంటారు.

సాధారణంగా ఈ నెంబరే రోజువారీ అవసరాలకూ వాడతారు. అందువల్ల అధిక ఆదాయం రావడంతో పాటు పోటీ సంస్థకు కనెక్షన్‌-ఆదాయం తగ్గుతుందనే భావనతో, ఎంఎన్‌పీకి సంస్థలు అధిక ప్రోత్సాహకాలు ఇస్తుంటాయి. రిటైలర్‌కు ఒక్కసారి నగదు ఇస్తే.. చందాదారు తమ దగ్గర ఉన్నంతకాలం ఆదాయం వస్తుంది కనుక, టెలికాం సంస్థలు ఈ రకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios