Asianet News TeluguAsianet News Telugu

జియో పోటీతో అతలాకుతలమైన టెలికాం నెట్వర్క్ లు

ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన, చౌకైన మార్కెట్‌కు నిలయమైన భారత టెలికం రంగం 2019 వరుస షాక్ లకు గురవుతున్నది. జియోతో అతలాకుతలమైన ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలకు ఏజీఆర్ పై సుప్రీంకోర్టు తీర్పు ఆశానిపాతమైంది. కేంద్రం ఉద్దీపనలు ప్రకటించకుంటే టెలికం సంస్థలు మూసేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సంస్థలో మరో సంస్థ ఎంటీఎన్ఎల్ విలీనం ప్రక్రియ మొదలైంది. అందునా సుమారు 90 వేల మంది ఉద్యోగులను వీఆర్ఎస్ కింద పంపి బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు కేంద్రం కసరత్తు చేస్తోంది.  

World's cheapest, biggest telecom market faces life-threatening crisis
Author
Hyderabad, First Published Dec 26, 2019, 10:47 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: దేశీయ టెలికం రంగానికి 2019 చేదు అనుభవాల్నే మిగిల్చింది. ధరల యుద్ధం, నష్టాలు, ఏజీఆర్‪పై సుప్రీం కోర్టు తీర్పు భారతీయ టెలికం సంస్థలను అత్యంత ప్రభావితం చేశాయి. ప్రపంచంలోనే అతి చౌక, వేగవంతమైన వృద్ధి కల భారత టెలికం మార్కెట్‌ మనుగడే ఈ ఏడాది ప్రశ్నార్థకమైందంటే అతిశయోక్తి కాదు. 

పెను సవాళ్ల మధ్య సంక్షోభంలోకి జారుకున్న పరిశ్రమ దిగ్గజ సంస్థలు భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఉద్దీపనల కోసం ప్రభుత్వాన్ని వేడుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 2016లో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ 4జీ టెలికం సంస్థ జియో రంగ ప్రవేశంతో దేశీయ టెలికం రంగ ముఖచిత్రమే మారిపోయిన విషయం తెలిసిందే. జియో రాక కారణంగా పుట్టిన ధరల యుద్ధం.. ఈ ఏడాది పరిశ్రమలో నష్టాల రూపంలో మరింతగా ప్రకంపనల్ని సృష్టించింది. 

పోటీ తారాస్థాయికి చేరడంతో అటు వొడాఫోన్‌ ఐడియా, ఇటు భారతీ ఎయిర్‌టెల్‌ తామిక కొనసాగలేమన్న సంకేతాలను ఇచ్చాయి. ఒక అడుగు ముందుకేసి వొడాఫోన్‌-ఐడియాను మూసేస్తామని సంస్థ చైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రకటించారు. అసలే ఆర్థిక మందగమనంతో సతమతమవుతున్న వేళ కుమార మంగళం బిర్లా ప్రకటన ప్రభుత్వాన్ని కలవరపాటుకు గురిచేయగా, ఉద్దీపనలతో ముందుకొచ్చింది. దీనిపై ఒంటరైన రిలయన్స్ జియో సైతం చివరకు ధరలను పెంచాల్సి వచ్చింది. 

also read  అతి తక్కువ ధరకే రియల్​ మీ కొత్త స్మార్ట్ ఫోన్...అదిరే ఫీచర్లతో...

ఫలితంగా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ కాస్తా.. పరిమిత ఉచిత కాల్స్‌గా మారిపోయాయి. డేటా ధరలూ పెరిగిపోగా, అప్పటిదాకా ఉన్న ప్లాన్లన్నీ భారమై సామాన్యులపై ఆ ప్రభావం పడింది.అయితే ప్రత్యర్థి సంస్థల మధ్య పోటీ వల్ల ఒకరిపై మరొకరు పట్టు సాధించేందుకు రీచార్జీ, పోస్ట్ పెయిడ్ చార్జీలపై రాయితీలు ప్రకటించాయి. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇంటర్ యూజర్ కనెక్ట్ (ఐయూసీ) కాల్స్ అపరిమితం అని ప్రకటిస్తే.. రిలయన్స్ జియో పరిమితులు ప్రకటించుకున్నది. 

చివరకు టెలికం సంస్థలు కనీస చార్జీలు వసూలు చేయాలన్న ప్రతిపాదనను టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ముందుకు తీసుకు వచ్చింది. ఇందుకోసం టెలికం రంగంలోని అన్ని వర్గాల వారితో సంప్రదింపులు కూడా ప్రారంభించింది. సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ మాట్లాడుతూ టెలికం సంస్థలు మనుగడ సాగించాలంటే వచ్చే మార్చి లోపు ‘అన్ని డేటా నెట్‌వర్క్‌లపై మేం సంప్రదాయంగా ’అన్ని (మొబైల్) వాయిస్ (కాలింగ్) నెట్‌వర్క్ నుంచి హైబ్రీడ్ నెట్‌వర్క్ (ఆఫ్ వాయిస్ అండ్ ఇంటర్నెట్ డేటా)కు వెళ్లక తప్పదు’ అని తెలిపారు. మార్చిలోపు ఫ్లోర్ ప్రైస్ ఖరారు చేయాల్సి ఉంటుందన్నారు.

భారతదేశంలో ఒక గిగా బైట్ (జీబీ) మొబైల్ డేటా పొందాలంటే కేవలం 0.26 డాలర్లు ఖర్చు చేస్తే చాలు. అదే అమెరికాలో 12.37 డాలర్లు, బ్రిటన్‌లో 6.66 డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే అంతర్జాతీయంగా కూడా చౌకైన అతిపెద్ద టెలికం నెట్ వర్క్ గల దేశం మనదే. 2019లో టెలికం రంగం శరవేగంగా అభివ్రుద్ధి చెందిన దేశం కూడా భారతే కావడం గమనార్హం. 

World's cheapest, biggest telecom market faces life-threatening crisis

స్థూల వార్షిక ఆదాయం (ఏజీఆర్‌)పై అక్టోబర్ 24వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు.. టెలికం సంస్థలను భారీగా కుదిపేసింది. స్పెక్ట్రం వినియోగ చార్జీలు, టెలికం లైసెన్సులకు సంబంధించి బకాయిలు, జరిమానాలు వడ్డీలతోసహా టెలికం శాఖకు చెల్లించాలన్న ఆదేశం.. భీకర నష్టాలకు దారితీసింది. 

టెలికం పరిశ్రమపై రూ.1.47 లక్షల కోట్ల భారం పడగా, వొడాఫోన్‌ ఐడియా మునుపెన్నడూ లేని విధంగా దేశీయ కార్పొరేట్‌ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక నష్టాలను ప్రకటించింది. జూలై - సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఏకంగా రూ.50,922 కోట్ల నష్టాలను వెల్లడించింది. భారతీ ఎయిర్‌టెల్‌ సైతం రూ.23,045 కోట్ల నష్టాలను ప్రకటించింది.

అంతేకాదు కేంద్రం ఉద్దీపన ప్రకటించకపోతే తాము కార్యకలాపాలు మూసేయక తప్పదని వొడాఫోన్ ఐడియా హెచ్చరికలు జారీ చేసిందంటే పరిస్థితి ఎంత తీవ్ర పరిణామాలకు దారి తీసిందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఏడెనిమిది సంస్థలకు నిలయమైన భారత టెలికం రంగం ఇప్పుడు మూడు సంస్థలకు దిగి వచ్చింది. వాటిల్లో రిలయన్స్ జియో మినహా మిగతా రెండు సంస్థల మనుగడే ప్రశ్నార్థకం అనే పరిస్థితి నెలకొంది. 

also read లేటెస్ట్ టెక్నాలజితో కొత్త మల్టీ ఫంక్షనల్ ఫ్యాన్...

భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా ఉద్దీపన ప్యాకేజీల కోసం కేంద్ర ప్రభుత్వం చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుల కోసం భారతీ ఎయిర్ టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ మూడు బిలియన్ డాలర్ల నిధుల సేకరణకు శ్రీకారం చుట్టారు.
 
చౌక చార్జీల పేరిట వినియోగదారుల్లోకి వేగంగా దూసుకెళ్లి సబ్ స్క్రైబర్ల రూపేణా అతిపెద్ద సంస్థగా రూపుదిద్దుకుంటున్నది రిలయన్స్ జియో. ఎడతెగని అభ్యర్థనలు, దేశంలో ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పెక్ట్రం చెల్లింపులపై రెండేళ్ల మారటోరియం విధించింది. టెలికం రంగంలో ఆధిపత్య ధోరణులకు తెర దించేందుకు కేంద్రం కూడా రంగంలోకి దిగింది. 

ప్రైవేట్ రంగ టెలికం సంస్థలు వినియోగదారులకు అద్భుతమైన సేవలందిస్తుండగా, ప్రభుత్వ రంగ టెలికం సంస్థలు బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ల విలీనానికి కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆమోదం తెలిపింది. రూ.69 వేల కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీని ప్రకటించగా, వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా తెచ్చిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ఇరు సంస్థల నుంచి సుమారు 92,700 మంది ఉపయోగించుకున్నారు. దీనివల్ల ఏటా దాదాపు రూ.8,800 కోట్ల వేతన భారం తగ్గుతుందని అంచనా.

Follow Us:
Download App:
  • android
  • ios