ఇది పాపులిస్ట్ చట్టం మాత్రమే కాదు...ఫాసిస్టు చట్టం...

కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై సాంకేతిక నిపుణులు నిరసన గళం వినిపించారు. సీఏఏ, ఎన్నార్సీ ముస్లింలకు వ్యతిరేకమని, దేశ సమస్యలను కప్పి పుచ్చడానికే తరుచూ ఇంటర్నెట్ నిలిపివేస్తున్నారని సాఫ్ట్ వేర్ నిపుణులు కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. వివిధ టెక్ సంస్థల యాజమాన్యాలను ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని అభ్యర్థించారు. 

Indian techies letter against Citizenship Amen dment Act

న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థల నిపుణులు, ఉద్యోగులు ఘాటుగా స్పందించారు. ఈ చట్టం ‘ఫాసిస్టు (నియంతృత్వ) చట్టం’గా అభివర్ణిస్తూ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. ‘మీడియం’ అనే సోషల్‌ మీడియా వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఈ లేఖలో ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ఉబర్‌ వంటి అగ్రశ్రేణి ఐటీ సంస్థల్లో పని చేస్తున్న భారతీయ, భారతీయ సంతతికి చెందిన దాదాపు 150 మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు సంతకాలు చేశారు. 

‘టెక్‌ అగెనెస్ట్‌ ఫాసిజం’ పేరుతో ఉన్న ఈ లేఖలో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ‘టెక్నాలజీ పరిశ్రమ ఇంజినీర్లు, డిజైనర్లు, పరిశోధకులు, విశ్లేషకులం అయిన మేము భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఫాసిస్టు చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరసనకారులపై ప్రభుత్వం జరుపుతున్న దమనకాండను తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

also read  ఐదు కెమెరాలతో హువావే నుంచి కొత్త స్మార్ట్ ఫోన్....

సీఏఏ, ఎన్నార్సీ ఒకదానితో ఒకటి ముడివడి ఉన్నాయి. ఈ పథకం ముస్లింలకు పూర్తిగా వ్యతిరేకం. ఇది ముస్లింలకు నిలువ నీడ లేకుండా చేయడంతోపాటు అసమానతలను సృష్టిస్తుంది’ అని పేర్కొన్నారు. దేశంలో రికార్డు స్థాయికి చేరిన నిరుద్యోగం, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ, పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు, ధ్వంసమవుతున్న పర్యావరణం వంటి తీవ్ర సమస్యలను కప్పిపుచ్చేందుకు, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేంద్రం ఈ వ్యూహాన్ని అమలుచేస్తున్నదని మండిపడ్డారు.

Indian techies letter against Citizenship Amen dment Act

ప్రభుత్వం ఇష్టానుసారం ఢిల్లీ, అసోం, కశ్మీర్‌ వంటి రాష్ట్రాల్లో ఇంటర్నెట్‌పై నిషేధం విధిస్తున్నదని టెకీ నిపుణులు ధ్వజమెత్తారు. ‘ఈ తిరోగమన ప్రభుత్వం ఓవైపు దేశాన్ని డిజిటల్‌ ఇండియాగా మారుస్తున్నామని, టెక్‌ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నది. మరోవైపు పౌరుల గొంతును అణచివేయడానికి ఇంటర్నెట్‌ను ఓ రాజకీయ సాధనంగా వాడుకుంటున్నది. అదేసమయంలో నకిలీవార్తల వ్యాప్తికి అన్ని నెట్‌వర్క్‌లను వినియోగించుకుంటున్నది’ అని తీవ్రంగా విమర్శించారు. 

also read ఇండియాలో ఎంతమంది ఇంటర్నెట్ వాడుతున్నారో తెలుసా....?

సుందర్‌ పిచాయ్‌ (ఆల్ఫాబెట్‌, గూగుల్‌), సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్‌), మార్క్‌ జుకర్‌బర్గ్‌ (ఫేస్‌బుక్‌), జాక్‌ డోర్సే (ట్విట్టర్‌), దారా ఖోస్రోషాహి (ఉబర్‌), ముఖేశ్‌ అంబానీ (జియో), గోపాల్‌ విఠల్‌ (ఎయిర్‌టెల్‌), కల్యాణ్‌ కృష్ణమూర్తి (ఫ్లిప్‌కార్ట్)‌, శంతను నారాయణ్‌ (అడోబ్‌) వంటి టెక్‌ కంపెనీల యజమానులు ఈ చట్టాన్ని బహిరంగంగా వ్యతిరేకించాలని కోరారు. 

ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని, వినియోగదారుల వివరాలను ప్రభుత్వాలకు వెల్లడించవద్దని, ఇంటర్నెట్‌ సేవలను ఇష్టానుసారం నిషేధించడాన్ని ఖండించాలని, టెక్నాలజీని మంచి కోసం ఒక సాధనంగా, ప్రజలను ఏకంచేసే మార్గంగా వినియోగించాలని వారికి విజ్ఞప్తి చేశారు. 

బెంగళూరుతోపాటు అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో, సియాటెల్‌, బ్రిటన్‌లోని లండన్‌, ఇజ్రాయెల్‌ తదితర దేశాలకు చెందిన టెకీలు ఈ లేఖ రాసిన వారిలో ఉన్నారు. ఇది తమ వ్యక్తిగత అభిప్రాయమని, తమ సంస్థలకు దీనితో సంబంధం లేదని స్పష్టం చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios