హిట్ అండ్ రన్ కొత్త చట్టం ఏమిటి? డ్రైవర్ల ఆందోళనకు కారణమేంటి? పెట్రోల్ బంకులకు దీనికి ఏం సంబంధం?
ఈ చట్టానికి పెట్రోల్ బంకులకు సంబంధం ఏంటి? ఎక్కడో ఢిల్లీలో చట్టం ప్రవేశపెడితే హైదరాబాద్ లో, మారుమూల గ్రామాల్లో పెట్రోల్ బంకులు ఎందుకు బందవుతున్నాయి? అసలు ఈ చట్టం ఏం చెబుతోంది?
ఢిల్లీ : హైదరాబాద్ లో చాలా చోట్లు పెట్రోల్ బంకులు సడెన్ గా క్లోజ్ చేశారు.. అనే వార్త మంగళవారం మద్యాహ్నం ఒక్కసారిగా వైరల్ అయ్యింది. దీంతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. హైదరాబాద్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి అని నెమ్మదిగా వెలుగులోకి వచ్చింది. దీంతో పెట్రోల్ బంకులు ఎందుకు మూసేస్తున్నారు? పెట్రోల్ కొరతకు కారణమేంటి? అనే అంశాలు తెరమీదికి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త హిట్ అండ్ రన్ చట్టం విషయం గురించి తెలిసింది.
ఈ చట్టానికి పెట్రోల్ బంకులకు సంబంధం ఏంటి? ఎక్కడో ఢిల్లీలో చట్టం ప్రవేశపెడితే హైదరాబాద్ లో, మారుమూల గ్రామాల్లో పెట్రోల్ బంకులు ఎందుకు బందవుతున్నాయి? అసలు ఈ చట్టం ఏం చెబుతోంది? అనే విషయాలు అర్థంకాక అయోమయం నెలకొంది.
కొత్త చట్టానికి వ్యతిరేకంగా లారీ, ట్రక్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రభావం పెట్రోల్, గ్యాస్ లాంటి అత్యవసరాలమీద ముందుగా ప్రభావం చూపింది. ఇంతకీ ఈ హిట్ అండ్ రన్ కొత్త చట్టం ఏంటి? ఎందుకు అంత వ్యతిరేకత వస్తుంది? అంటే..కొత్త చట్టం హిట్ అండ్ రన్ చట్టం ప్రకారం కేసులకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానాతో కఠినమైన జరిమానాలు విధిస్తుంది. ప్రైవేట్ వాహనాల యజమానులకు కూడా చట్టం వర్తిస్తుంది. కొత్త చట్టం దారుణంగా ఉందని, జరిమానాలు చాలా కఠినంగా ఉన్నాయని నిరసన తెలుపుతున్న ట్రక్ డ్రైవర్లు భావిస్తున్నారు.
మైనర్ సోదరుడితో గర్భం దాల్చిన 12 ఏళ్ల చిన్నారి.. అబార్షన్ కు కేరళ హైకోర్టు అనుమతి నిరాకరణ...
అసలు హిట్ అండ్ రన్ చట్టం ఏంటి?
భారతదేశంలోని కొత్త హిట్-అండ్-రన్ చట్టం ప్రకారం భారతీయ న్యాయ సంహిత కింద, ప్రమాద ప్రదేశాల నుండి పారిపోయే డ్రైవర్లకు కఠినమైన జరిమానాలు విధిస్తుంది. ఈ చట్టం ప్రకారం, యాక్సిడెంట్ తరువాత అక్కడినుంచి పారిపోయిన డ్రైవర్‌కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ. 7 లక్షల జరిమానా విధించబడుతుంది. ఈ చట్టం ప్రైవేట్ వాహనాల యజమానులకు కూడా వర్తిస్తుంది. దేశంలో యేటా దాదాపు 50,000 మంది ఈ హిట్-అండ్-రన్ కేసుల వల్లే మృత్యువాత పడుతున్నారు. ఈ సంఖ్యను తగ్గించడం కొత్త చట్టం లక్ష్యం.భారతీయ శిక్షాస్మృతి కింద గతంలో విధించిన జరిమానాలతో పోలిస్తే కొత్త చట్టం ప్రకారం హిట్-అండ్-రన్ కేసులకు జరిమానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి.
కొత్త హిట్ అండ్ రన్ చట్టం ఎందుకు ప్రవేశపెట్టారు?
దేశంలో నానాటికీ పెరుగుతున్న హిట్-అండ్-రన్ యాక్సిడెంట్లను తగ్గించడం, దానివల్ల ఏర్పడే సమస్యల పరిష్కారానికి కృషి చేయడం కోసం ప్రవేశపెట్టారు. కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణాలు ఇవి :
హిట్-అండ్-రన్ కేసుల సంఖ్యను తగ్గించడం : భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 50,000 మరణాలకు దారితీసే హిట్ అండ్ రన్ ప్రమాదాల సంఖ్యను తగ్గించడం కొత్త చట్టం లక్ష్యం.
జవాబుదారీతనాన్ని పెంపొందించడం: హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రమాదానికి కారణమైన డ్రైవర్ల జవాబుదారీతనాన్ని పెంచడానికి, హిట్ అండ్ రన్ కేసులకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు రూ. 7 లక్షల జరిమానాతో కూడిన కఠినమైన జరిమానాలను చట్టం విధిస్తుంది.
చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అప్‌డేట్ చేయడం : కొత్త చట్టం బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (IPC) స్థానంలో ఉంది. దీన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC), ఎవిడెన్స్ యాక్ట్‌లో మార్పులతో సహా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో సమగ్ర మార్పులను చేస్తుంది.
బాధితులకు మరిన్ని హక్కులను మంజూరు చేయడం : కొత్త చట్టం బాధితులకు ట్రయల్స్ సమయంలో మాట్లాడే హక్కును మంజూరు చేస్తుంది. హిట్-అండ్-రన్ ప్రమాదాల వల్ల ప్రభావితమైన వారికి న్యాయమైన, చట్టపరమైన సహాయాన్ని అందించడంలో సహాయపడుతుంది.
రహదారి భద్రతను ప్రోత్సహించడం : హిట్-అండ్-రన్ కేసులకు కఠినమైన జరిమానాలు విధించడం ద్వారా, కొత్త చట్టం రహదారి భద్రతను ప్రోత్సహించడం, ప్రమాదకరమైన డ్రైవింగ్ కు చెక్ పెట్టే దిశగా పనిచేస్తుంది.
డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత
కఠినమైన జరిమానాల కారణంగా కొత్త హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా భారతదేశం అంతటా ట్రక్ డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు.వేచట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ పిలుపునిస్తోంది.
చట్టం కఠినంగా ఉందని, జరిమానాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇది తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న డ్రైవర్లను నిరుత్సాహపరుస్తుందని, వృత్తిలోకి కొత్తగా ప్రవేశించేవారిని రాకుండా చేస్తుందని భయపడుతున్నారు. తప్పుడు ఆరోపణలు, డ్రైవర్ల నియంత్రణకు మించిన ప్రమాదాలు అన్యాయంగా 10 సంవత్సరాల శిక్షలకు దారితీయవచ్చంటున్నారు.
నిరసనల ప్రభావం
డ్రైవర్ల నిరసనతో రవాణా, సరఫరాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబయిలో 1.20 లక్షల ట్రక్కులు, టెంపోలు, కంటైనర్లలో 70% పైగా ఇంధనం, నిత్యావసర వస్తువుల పంపిణీని ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనా. మూడు రోజుల సమ్మె ఇంధనం, నిత్యావసర వస్తువుల పంపిణీపై ప్రభావం చూపే అవకాశం ఉంది.దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి నిరసనలు జరుగుతున్నాయి.కొత్త చట్టం కారణంగా ట్రక్ డ్రైవర్ల జీవనోపాధి, పరిశ్రమ భవిష్యత్తు ప్రమాదంలో పడింది.
కొత్త చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందా?
దేశవ్యాప్తంగా మంగళవారం అనేక రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితి దృష్ట్యా ఏఐఎంటీసీ సభ్యులు హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో సమావేశమయ్యారు. తమ సమస్యలను ప్రభుత్వం ముందు పెట్టారు. ఈ చట్టం అమలుకు ముందు డ్రైవర్ల ఆదోళనను, సమస్యలను పరిగణలోకి తీసుకుంటామని, మరోసారి సమీక్షిద్దామని ప్రకటించారు దీంతో ప్రస్తుతానికి మూడు రోజుల నిరసనను డ్రైవర్లు విరమించుకున్నారు.