ప్రైవేట్ పార్టులకు గాయాలుంటేనే రేప్ జరిగినట్టా? లేకుంటే కాదా?: ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రైవేట్ పార్టులకు గాయాల ఆనవాళ్లు ఉంటేనే రేప్ జరిగినట్టు అని చెప్పడానికి లేదని ఢిల్లీ హైకోర్టు వివరించింది. ప్రైవేట్ పార్టులకు గాయాలు ఏర్పడటానికి కొన్ని అంశాలు పాత్రపోషిస్తాయని తెలిపింది. కాబట్టి, అక్కడ గాయాలు లేనంతమాత్రానా రేప్ జరగలేదని చెప్పలేమని స్పష్టం చేస్తూ దోషికి పడిన శిక్షను సమర్థించింది.
న్యూఢిల్లీ: మైనర్ బాలిక రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేట్ పార్టులకు గాయాలు ఉంటేనే రేప్ జరిగినట్టా? గాయాలు లేకుంటే రేప్ జరగనట్టేనా? అని ప్రశ్నించింది. ప్రైవేట్ పార్టులకు గాయాలు లేనంతమాత్రానా లైంగిక దాడి జరగలేదని చెప్పలేం అని వివరించింది. 2017 జూన్‌లో నాలుగున్నర బాలికపై రేప్ జరిగిన కేసులో దోషి నేర నిర్దారణను సమర్థించింది. ట్రయల్ కోర్టు సరిగ్గానే తీర్పు ఇచ్చిందని స్పష్టం చేసింది. ఈ కేసులో దోషి అతడే అని ఎలాంటి సంశయాలు లేకుండా కోర్టులో నిరూపణ జరగిందని వివరించింది.
లైంగిక దాడి జరిగినట్టు ప్రైవేట్ పార్టులకు గాయాలు చోటుచేసుకోవడం అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు వివరించింది. కాబట్టి, గాయాలు లేనంతమాత్రానా అసలు లైంగిక దాడే జరగలేదని చెప్పలేమని పేర్కొంది. పోక్సో చట్టం కింద లేవనెత్తిన ఆరోపణలు, ఆధారాలను ఆ వ్యక్తి తిప్పికొట్టలేకపోయాడని వివరించింది. 2021 సెప్టెంబ్ర 18న కోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన దోషి పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
పోక్సో చట్టం కింద 12 ఏళ్ల కఠిన జైలు, ఐపీసీలోని సెక్షన్ 363 కింద మూడేళ్లు, సెక్షన్ 342 కింద ఆరు నెలల కఠిన ఖైదు శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది.
Also Read: వీ ఐ పీ సంస్కృతికి స్వస్తి.. నేతల వాహనాల్లోని సైరన్ల తొలగింపు.. అసలు కారణం ఏమిటంటే?
ఈ కేసులో మైనర్ బాలిక చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. దోషి తనను ఆయన ఇంటిలోకి తీసుకెళ్లి లోదుస్తులు తొలగించాడని ఆమె పేర్కొన్నది. ఆమె ప్రైవేట్ పార్టుల్లో వేళ్లు చొప్పించాడని, ఆమెకు విపరీతమైన నొప్పి పుట్టిందని వివరించింది. ఆ నేరం చేసిన వ్యక్తినీ బాలిక కోర్టులో గుర్తించిందని తెలిపింది. ఇతర అన్ని స్టేట్‌మెంట్లలోనూ బాధితురాలు తన వాదనలకు లోబడే వ్యాఖ్యల చేశారని, కాబట్టి, ఆమె వాదన లను కాదని కొట్టేయలేమని వివరించింది.