ఆర్ధిక వ్యవస్థ కాదు.. ప్రాణాలే ముఖ్యం: లాక్‌డౌన్ పెట్టాల్సిందే, కేంద్రానికి ఐఎంఏ ఘాటు లేఖ

ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) లాక్‌డౌన్‌‌ను విధించాలని కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్‌ చైన్‌ను బ్రేక్‌ చేయడంతో పాటు కొవిడ్‌ రోగులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న మెడికల్‌ సిబ్బందికి కొంతమేర ఉపశమనం చేకూర్చినట్లు అవుతుందని అభిప్రాయపడింది

Indian Medical Association demands nationwide lockdown ksp

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పెట్టాలనే డిమాండ్లు సర్వత్రా వస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు ఆన్‌లైన్ సర్వేల్లో సైతం లక్షలాది మంది ప్రజలు లాక్‌డౌన్ పెట్టండి మహో ప్రభో అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

అయితే ఈసారి లాక్‌డౌన్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రులకే అప్పగించారు ప్రధాని మోడీ. చివరి అస్త్రంగానే లాక్‌డౌన్‌‌ను ప్రయోగించాలని సూచించారు. ఈ క్రమంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) లాక్‌డౌన్‌‌ను విధించాలని కేంద్రాన్ని కోరింది.

దీనివల్ల వైరస్‌ చైన్‌ను బ్రేక్‌ చేయడంతో పాటు కొవిడ్‌ రోగులకు నిరంతరాయంగా సేవలు అందిస్తున్న మెడికల్‌ సిబ్బందికి కొంతమేర ఉపశమనం చేకూర్చినట్లు అవుతుందని అభిప్రాయపడింది. కొవిడ్‌-19 సెకండ్‌ వేవ్‌ కారణంగా తలెత్తిన సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పటికైనా మేల్కోవాలంటూ ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు ఐఎంఏ ఘాటు లేఖ రాసింది.

సెకండ్‌వేవ్‌ వేళ ఆ శాఖ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే తమకు ఆశ్చర్యమేస్తోందని దుయ్యబట్టింది. తమ అసోసియేషన్‌ నుంచి కేంద్రానికి ఇచ్చిన సలహాలు, సూచనలు పలుమార్లు బుట్టదాఖలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది.  

Also Read:పాజిటివ్ రిపోర్ట్ లేకున్నా.. నాన్ లోకల్ అయినా చేర్చుకోవాల్సిందే: ఆసుపత్రులకు కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న వైరస్‌ను అదుపులోకి తేవాలంటే ప్రణాళికతో కూడిన లాక్‌డౌన్‌ను విధించాలని లేఖలో ఐఎంఏ కోరింది. రాష్ట్రాలు అమలు చేస్తున్న 10-15 రోజుల లాక్‌డౌన్‌ కాకుండా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అవసరమని అభిప్రాయపడింది. అలాగే, నైట్‌కర్ఫ్యూలు విధించడం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేదని స్పష్టం చేసింది.

ఆర్థికం కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని అభిప్రాయపడింది. కేంద్రం చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రణాళికనూ తప్పుబట్టింది. ముందుచూపు లేకపోవడం వల్లే ఇప్పటికీ చాలా చోట్ల 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందించలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

పోలియో, మశూచి వంటి వ్యాధులకు సార్వత్రిక టీకా విధానాన్ని అవలంబించిన కేంద్రం.. ఇప్పుడెందుకు వేర్వేరు ధరలకు టీకాలు అందజేస్తోందని ప్రశ్నించింది. ఆక్సిజన్‌ కొరత, వైద్యులు వైరస్‌ బారిన పడడం వంటి సంఘటనలపై ఆందోళన వ్యక్తంచేసింది. ప్రజా వైద్యానికి జీడీపీలో 8 శాతం మేర కేటాయింపులు జరపాలని తన లేఖలో సూచించింది.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios