ఇండియన్ ఆర్మీ యూనిఫామ్ డిజైన్, ప్యాటర్న్‌పై పేటెంట్ రైట్స్ నమోదు
భారత ఆర్మీ కొత్త యూనిఫామ్ పై పేటెంట్ హక్కులను ఇండియన్ ఆర్మీ రిజిస్టర్ చేసుకుంది. కొల్‌కతాలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్ వద్ద రిజిస్టర్ చేసుకుంది. ఇందుకు సంబంధిన పేటెంట్ కార్యాలయ అధికారిక పత్రికలో గత నెల 21వ తేదీన కథనం ప్రచురితమైంది.
న్యూఢిల్లీ: భారత ఆర్మీ యూనిఫామ్ డిజైన్, ప్యాటర్న్ పై పేటెంట్ హక్కులు కోల్‌కతాలోని కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్ వద్ద నమోదు చేశారు. దీనిపై యాజమాన్య హక్కులను ఇండియన్ ఆర్మీ రిజిస్టర్ చేసుకుంది. ఈ రిజిస్ట్రేషన్‌ను పేటెంట్ ఆఫీస్ అధికారిక జర్నల్‌లో అక్టోబర్ 21వ తేదీన ప్రచురించినట్టు ఇండియన్ ఆర్మీ అధికారులు వెల్లడించారు.
జనవరి 15వ తేదీన ఆర్మీ డే పరేడ్ పురస్కరించుకుని ఆర్మీ యూనిఫామ్ కొత్త డిజైన్, ప్యాటర్న్ డిజిటల్‌గా వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఆర్మీ కొత్త యూనిఫామ్:
ఈ కొత్త యూనిఫామ్ నేటి కాలానికి సరిపడేలా సరికొత్త డిజైన్, ఫంక్షనల్ డిజైన్‌తో రూపొందించారు. ఈ ఫ్యాబ్రిక్ లైటర్ వెయిట్‌తో పటిష్టంగా ఉంటుందని, శ్వాస తీసుకునేలా, వెంటనే ఆరిపోయేలా, సులువుగా మెయింటెయిన్ చేసేలా ఉంటుందని అధికారులు తెలిపారు. కదనరంగంలో మహిళలనూ దృష్టిలో పెట్టుకుని ఈ యూనిఫామ్ రూపొందించినట్టు వివరించారు.
ఈ రిజిస్ట్రేషన్ ప్రయోజనం ఏమిటీ?
ఈ రిజిస్ట్రేషన్‌తో ఆర్మీ యూనిఫామ్ డిజైన్, ప్యాటర్న్‌పై పూర్తి మేధోపరమైన హక్కులను ఆర్మీనే కలిగి ఉంటుంది. కాబట్టి, ఈ యూనిఫామ్‌ను ఎవరూ తయారు చేయాలన్న ఇండియన్ ఆర్మీ అనుమతితోనే సాధ్యపడుతుంది. లేదంటే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వారిపై ఇండియన్ ఆర్మీ న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించవచ్చు. కోర్టులను ఆశ్రయించి సివిల్ యాక్షన్ తీసుకోవచ్చు.
Also Read: Indian Army Day 2022: మీ త్యాగాలు మరువలేనివి.... ఆర్మీడేపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
ఈ కొత్త యూనిఫామ్‌ను ప్రవేశపెట్టే క్రమంలో ఇప్పటి వరకు క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ ద్వారా 50 వేల సెట్లను ఇప్పటికే కొనుగోలు చేశారు. వాటిని 15 సీఎస్డీ డిపోలకు పంపించారు. ఢిల్లీ, లేహ్, బీడీ బరి, శ్రీనగర్, ఉదంపూర్, అండమాన్ నికోబార్, జబల్‌పూర్, మాసింపూర్, నారంగి, దీమాపూర్, బాగడోగ్రా, లక్నో, అంబాలా, ముంబయి, ఖాడ్కిల్లోని డిపోలకు పంపించారు.
సివిల్, మిలిటరీ టైలర్లకు వీటిని కుట్టడానికి ట్రైనింగ్ కోసం వర్క్‌షాపులను నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి చెందిన ఇన్‌స్ట్రక్టర్ల సమన్వయంతో ఈ వర్క్ షాపులు నిర్వహిస్తున్నట్టు వివరించారు.