హిమాచల్ లో భారీ హిమపాతం.. చీనాబ్ నది ప్రవాహానికి అంతరాయం.. 650 రోడ్లు క్లోజ్
హిమాచల్ ప్రదేశ్ లో గత రెండు మూడు రోజులుగా భారీగా హిమపాతం (Heavy snowfall in Himachal Pradesh) సంభవిస్తోంది. దీని వల్ల జన జీవనం అస్థవ్యస్థంగా మారింది. రాష్ట్రంలోని దాదాపు 650 రోడ్లను మూసివేశారు. రవాణా సౌకర్యం నిలిచిపోవడంతో నిత్యవసర వస్తువులకు కొరత ఏర్పడుతోంది. ఈ హిమపాతం వల్ల చీనాబ్ నది ప్రవాహానికి కూడా అంతరాయం (Disruption of flow to Chenab river) కలిగింది.
హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్, స్పితి జిల్లాల్లో భారీ హిమపాతం సంభవించింది. దీని వల్ల చీనాబ్ నది ప్రవాహానికి అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అలెర్ట్ చేశారు. అప్రమత్తంగా ఉండాలనిసూచించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ మంచు, వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ లో అరడజనుకు పైగా హిమపాతం, కొండచరియలు విరిగిపడటంతో ఐదు జాతీయ రహదారులతో సహా 650కి పైగా రహదారులు మూసుకుపోయాయి.
నరేంద్ర మోడీ హిందువు కాదు - లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
కాగా.. హిమపాతం వల్ల ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. లాహౌల్ స్పితిలోని జస్రత్ గ్రామ సమీపంలోని దారా జలపాతం వద్ద హిమపాతం సంభవించడంతో చీనాబ్ ప్రవాహానికి అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఈ జిల్లాలో గత 24 గంటల్లో భారీగా మంచు కురవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
లాహౌల్ సబ్ డివిజన్ లోని తాండి వంతెన వద్ద మంచు చరియలు విరిగిపడటంతో కొన్ని దుకాణాలు నేలమట్టమయ్యాయి. కిన్నౌర్ జిల్లాలోని సంగ్లాలోని కర్చమ్ హెలిప్యాడ్ సమీపంలో హిమపాతం సంభవించింది. రాష్ట్రంలో ఐదు జాతీయ రహదారులు సహా మొత్తం 652 రహదారులను వాహనాల రాకపోకలకు మూసివేశారు. లాహౌల్, స్పితిలో గరిష్టంగా 290, సిమ్లాలో 149, చంబాలో 100, కిన్నౌర్లో 75, కులులో 32, మండీలో 5, కాంగ్రాలో ఒక రహదారిని మూసివేసినట్లు స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలిపింది.
భారీ హిమపాతం కారణంగా లాహౌల్, స్పితి, కిన్నౌర్, చంబా ప్రాంతాల్లో విద్యుత్, కమ్యూనికేషన్లకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలో 1,749 ట్రాన్స్ ఫార్మర్లు పనిచేయడం లేదని, 78 నీటి సరఫరా పథకాలకు అంతరాయం ఏర్పడిందని ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ పేర్కొంది. మంచు, వర్షం, పిడుగుల కారణంగా లాహౌల్, స్పితి, సోలన్, సిర్మౌర్లలో ఒక్కొక్కటి చొప్పున మూడు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎగువ సిమ్లా ప్రాంతంలో పాలు, రొట్టెలు, కూరగాయలు, వార్తాపత్రిక వంటి నిత్యావసర సరుకుల సరఫరాపై ప్రభావం పడింది.