నాగాలాండ్‌లో వివాదాస్పద చట్టం ఆఫ్‌స్పా రద్దు చేయడంపై ప్రత్యేక కమిటీ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ 45 రోజుల్లో నివేదిక ఇస్తుందని తెలిపింది. ఈ నివేదిక ఆధారంగా ఆఫ్‌స్పా చట్టాన్ని నాగాలాండ్‌లో రద్దు చేసే నిర్ణయం ఉంటుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. నాగాలాండ్ సీఎం, అసోం సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 23న సమావేశం అయ్యారు. అందులో ఈ నిర్ణయం తీసుకున్నారు.

గువహతి: ఈశాన్య రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్(ఆఫ్‌స్పా/AFSPA) చట్టంపై ఉపసంహరించాలని కొన్నేళ్లుగా డిమాండ్ ఉన్నది. కానీ, ఇటీవలే భద్రతా బలగాలు(Military Forces) ఉగ్రవాదులుగా పొరబడి పౌరులను కాల్చి చంపిన ఘటన తర్వాత ఈ డిమాండ్ బలంగా మారింది. మోన్ జిల్లాలలో పౌరులపై భద్రతా బలగాలు కాల్పులు జరపడం.. ఆ తర్వాత పౌరులు ఆర్మీపై దాడికి దిగడం.. మళ్లీ ఆర్మీ కాల్పులు జరపడం వంటి ఘటనలతో 14 మంది మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆఫ్‌స్పా చట్టం ఆవశ్యకతపైనా చర్చ రేగింది. ఇటీవలే ఈ చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా నాగాలాండ్‌(Nagaland)లో ఉపసంహరించాలని(Repeal) నాగాలాండ్ అసెంబ్లీ తీర్మానించింది.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 23న కేంద్ర మంత్రి అమిత్ షా.. నాగాలాండ్ సీఎంతో సమావేశం అయ్యారు. ఆఫ్‌స్పా చట్టం తొలగించాలనే డిమాండ్‌పై ఓ కమిటీన ఏర్పాటు చేసే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ సమావేశానికి నాగాలాండ్ సీఎం, అసోం సీఎం, ఇతరులు అమిత్ షాతో చర్చలు జరిపారు. నాగాలాండ్‌లో ఆఫ్‌స్పా చట్టాన్ని ఉపసంహరించే డిమాండ్‌ను ఈ కమిటీ పరిశీలించనుంది. కమిటీ ఏర్పడిన 45 రోజుల్లో ఈ డిమాండ్‌కు సానుకూల, ప్రతికూల అంశాలు, క్షేత్రస్థాయి విషయాలు, డిమాండ్ తొలగింపుపై నివేదికను అందించాల్సి ఉంటుంది. ఈ కమిటీ కేంద్ర హోం శాఖ ఈశాన్య రాష్ట్రాలను చూసే అదనపు కార్యదర్శి సారథ్యం వహిస్తారు. అలాగే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఐజీఏఆర్(ఎన్), సీఆర్‌పీఎఫ్ ప్రతినిధులు కమిటీలో ఉండనున్నారు. ఈ కమిటీ 45 రోజుల్లో తమ రిపోర్టును కేంద్రానికి సమర్పించనుంది. నాగాలాండ్ నుంచి ఆఫ్‌స్పా తొలగింపు నిర్ణయం ఈ కమిటీ ప్రతిపాదన ఆధారంగానే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.

Also Read: Nagaland Firing: పొరపాటు జరిగింది.. ఉగ్రవాదులనే అనుమానంతోనే ఫైరింగ్.. లోక్‌సభలో అమిత్ షా

గతవారం నాగాలాండ్ అసెంబ్లీ ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ప్రత్యేక సమావేశంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు నాగాలాండ్ సీఎం రియో మాట్లాడుతూ, నాగాలాండ్, నాగా ప్రజలు ఎల్లప్పుడ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారని అన్నారు. ఇది కచ్చితంగా ఉపసంహరించి తీరాల్సిందేనని తెలిపారు. నాగాలాండ్‌లో పౌరులపై ఆర్మీ కాల్పులు జరిపిన ఘటన తర్వాత ఆఫ్‌స్పా చట్టాన్ని నల్లచట్టంగా సీఎం పేర్కొన్నారు. 

Also Read: Nagaland Firing: ఆర్మీ యూనిట్‌పై కేసు.. ‘హత్య చేయాలనే ఉద్దేశంతోనే..’ ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు..

ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ (AFSP Act) ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాలకు పౌరులపై అపారమైన విచక్షణాధికారాలను కట్టబెడుతుంది. క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో జారీ అయిన 1942 నాటి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) ఆర్డినెన్స్ ఆధారంగా ఈ చట్టాన్ని రూపొందించారు. సెప్టెంబరు 11, 1958న AFSP చట్టాన్ని భారత పార్లమెంటు ఆమోదించింది. AFSP చట్టం సమస్యాత్మక, అల్లర్ల, కల్లోల ప్రాంతాలను నియంత్రించడానికి సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలను ఇస్తుంది. ఏదైనా ఓ ప్రాంతం ప్రమాదకరమైన స్థితిలో ఉందని అభిప్రాయపడినప్పుడు.. ఆ ప్రాంత పౌరులకు సహాయంగా సాయుధ బలగాలను రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉప‌యోగిస్తుంది. బలగాలకు కాల్పులు జరపడానికి, వారెంట్ లేకుండా ప్రవేశించడానికి, శోధించడానికి, నేరానికి పాల్పడిన ఏ వ్యక్తినైనా అరెస్టు చేయడానికి అధికారం కల్పిస్తుంది. ఈ చర్యలన్నింటినీ చేసే సాయుధ బలగాలకు ప్రాసిక్యూట్ నుంచి మినహాయింపు లభిస్తుంది. Armed Forces Special Powers Act అందించే ప్రత్యేకమైన అధికారాలతో చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను నుంచి వీలు క‌ల్పిస్తుంది.