Asianet News TeluguAsianet News Telugu

రాయచూరు-తెలంగాణ సరిహద్దులో 11వ శతాబ్దం నాటి పురాతన విష్ణు, శివలింగాలు లభ్యం..

వంతెన కోసం నదిలో తవ్వకాలు కొనసాగిస్తుండగా కొన్ని విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని చూసిన కార్మికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. 

Ancient Vishnu, Shivling came to light in Raichur- Telangana border - bsb
Author
First Published Feb 7, 2024, 12:56 PM IST

రాయచూరు : రాయచూరు-తెలంగాణ సరిహద్దులో అతి పురాతన కాలంనాటి అవశేషాలు వెలుగు చూశాయి. ఇక్కడ వంతెన నిర్మాణ సమయంలో కొన్ని విగ్రహాలు బయటపడ్డాయి. వీటిలో ఒకటి విష్ణు విగ్రహం కాగా, మరొకటి శివుని విగ్రహం. ఇవి  కర్నాటకలోని రాయచూర్ లోని శక్తి నగర్ సమీపంలోని కృష్ణా నదీలో బయటపడ్డాయి. ఇవి 11వ శతాబ్దానికి చెందిన కళ్యాణి చాళుక్య వంశానికి సంబంధం ఉన్నవాటిగా భావిస్తున్నారు. ఈ విగ్రహాలు రాయచూరు-తెలంగాణ సరిహద్దులో వంతెన నిర్మాణ సమయంలో బయటపడ్డాయి.

తవ్వకాల్లో ఈ విగ్రహాలను వెలికితీసిన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. విష్ణు మూర్తి విగ్రహం ఆయన వెనకున్న ఆర్చ్ మీద దశావతారాలు చెక్కి ఉన్నాయి. మరొకటి శివలింగం. వంతెన కోసం తవ్వకాలు చేపట్టగా ఈ విగ్రహాలు బయటపడ్డాయి. నదీ గర్భంలో కనిపించిన ఈ విగ్రహాలను బైటికి తీయడానికి అధికారులకు సమాచారం అందించి, చర్యలు చేపట్టారు. విషయం తెలియడంతో పురావస్తు శాఖకు వీటి సంరక్షణ, అధ్యయన బాధ్యతలు అప్పగించారు. 

ఒకసారి రిజర్వేషన్లు పొందినవారు.. జనరల్ కేటగిరీలో పోటీపడాలి. : సుప్రీంకోర్టు

రాయచూర్‌లోని ప్రసిద్ద చరిత్రకారురాలు పద్మజ దేశాయ్, ఈ విగ్రహాలకు ఉన్న చారిత్రక ప్రాముఖ్యాన్ని తెలిపారు. ఆమె చెప్పినదాని ప్రకారం.. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని వివిధ రాజకుటుంబాలు పాలించాయి. వారి మధ్య జరిగిన యుద్ధాల సమయంలో.. మతపరమైన దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. అలా ఈ విగ్రహాలు నదీగర్భంలో కనుమరుగై ఉండొచ్చని తెలిపారు. 

రాయచూర్ చరిత్ర యుద్దాలతో కల్లోలితమై ఉంది. ఇక్కడ దాదాపు 163 యుద్ధాలు జరిగినట్టు చరిత్ర చెబుతోంది. బహుమనీ సుల్తానులు, ఆదిల్ షాహీల హయాంలో దేవాలయాలను ధ్వంసం చేయడంతో సహా, అక్కడి పురాతన ఆనవాళ్లు, విగ్రహాలు ఎలా ధ్వంసం అయ్యాయో చరిత్ర చెబుతోంది. ఈ విగ్రహాలు ఆ విషయాన్ని నొక్కి చెబుతున్నాయన్నారు పద్మజ. ఆనాటిసంఘర్షణలు, తిరుగుబాట్లకు ప్రతీకే కృష్ణా నదిలో ఈ పవిత్ర కళాఖండాలు మునిగిపోవడం అని అన్నారు. 

కల్యాణి చాళుక్యుల కాలం నాటివని చెప్పడానికి కారణం.. వారి కాలంలో తయారు చేసిన విగ్రహాలు ఓ ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఆకుపచ్చ మిశ్రమ రాయితో తయారు చేసిన విగ్రహాలు వీరి హయాంలోనే ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు దొరికిన విగ్రహాలు ఇదే రాతితో ఉండడంతో వీటికున్న చారిత్రక ప్రాముఖ్యతను మరింత బలపరుస్తుంది.

ఈ పురాతన విగ్రహాలను చూసేందుకు భక్తులు ఇక్కడికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. విగ్రహాలకు పూజలు చేసి, పూలు సమర్పించి, ప్రార్థనలు చేస్తున్నారు. తరువాత పురావస్తు శాఖ అధికారులు ఇక్కడినుంచి విగ్రహాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ శతాబ్దాల నాటి కళాఖండాల చరిత్రను మరింత పరిశోధించే పనిలో పడింది పురావస్తు శాఖ. 

ఈ విగ్రహాలు వెలుగుచూడడం కర్ణాటక సాంస్కృతిక, మతపరమైన వారసత్వాన్ని నొక్కిచెబుతోంది. కర్ణాకట చారిత్రక ఆనవాళ్లను గుర్తించేలా చేస్తోంది. ఈ విగ్రమాలు ఈ ప్రాంతపు పురాతన నాగరికతల శాశ్వత వారసత్వానికి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు నిదర్శనం. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios