Asianet News TeluguAsianet News Telugu

ఒకసారి రిజర్వేషన్లు పొందినవారు.. జనరల్ కేటగిరీలో పోటీపడాలి. : సుప్రీంకోర్టు

రిజర్వేషన్లతో లబ్ది పొందిన వెనకబడిన కులాలకు చెందినవారు వాటిని వదులుకుని మరింత వెనకబడిన వారికి అవకాశం ఇవ్వాలని సుప్రీం దర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. 

Once reserved candidates should compete in general category. : Supreme Court - bsb
Author
First Published Feb 7, 2024, 11:28 AM IST | Last Updated Feb 7, 2024, 11:28 AM IST

ఢిల్లీ : ఓ కేసు సందర్బంగా సుప్రీంకోర్టు వెనుకబడిన కులాలకు చెందిన వారు రిజర్వేషన్‌కు అర్హులు అని చెబుతూనే ఇప్పటివరకు ఈ రిజర్వేషన్ల నుంచి లాభం పొందినవారు.. రిజర్వ్‌డ్ కేటగిరీ నుండి వైదొలగాలని.. వారిలో మరింత వెనుకబడిన వారికి అవకాశం ఇవ్వాలని...మంగళవారం పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి డి వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనంలో న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, బేల ఎం త్రివేది, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ ఉన్నారు.

ఏడు మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండ్ ఇతరులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందా లేదా అనే దానిపై వచ్చిన సూచనను విచారించడం ప్రారంభించింది. 2004లో వెలువడిన ఈ తీర్పు ప్రకారం షెడ్యూల్డ్ కులాలు (SCలు) అన్నీ ఒక్కటే. వీటిలో ఉపకులాలకు మినహాయింపు ఉండకూడదు అన్నారు. 

వీటి మీద జస్టిస్ విక్రమ్ నాథ్, పంజాబ్ అడ్వకేట్ జనరల్ గుర్మీందర్ సింగ్ వాదనలను ఊటంకిస్తూ... “ఎందుకు మినహాయింపు ఉండకూడదు? మీ అభిప్రాయం ప్రకారం, ఒక నిర్దిష్ట వర్గంలో, కొన్ని ఉపకులాలు మెరుగ్గా ఉన్నాయి. ఆ కేటగిరీలో వారే ఫార్వర్డ్‌ గా ఉన్నారు. అలాంటప్పుడు వారు రిజర్వేషన్ల కోటా నుంచి బైటికి వచ్చి జనరల్‌తో పోటీ పడాలి. రిజర్వేషన్ కేటగిరీలోనే ఎందుకు ఉంటున్నారు? వెనుకబడిన వారిలో ఇంకా వెనుకబడిన వారిని రిజర్వేషన్ పొందనివ్వాలి’ అన్నారు. 

పంజాబ్ షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల చట్టం, 2006 చెల్లుబాటును కూడా ఇది పరిశీలిస్తోంది. ఇది షెడ్యూల్డ్ కులాల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలలో వాల్మీకులు, మజాబీ సిక్కులకు 50 శాతం కోటా, మొదటి ప్రాధాన్యతను అందించింది. 2010లో, పంజాబ్, హర్యానా హైకోర్టు పంజాబ్ చట్టంలోని సెక్షన్ 4(5)ని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఇది చిన్నయ్య కేసులో తీర్పును ఉల్లంఘించడానికి ఒక కారణం.

జస్టిస్ నాథ్ వ్యాఖ్యలపై జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ.. రిజర్వ్‌డ్ కేటగిరీ ఐఏఎస్, ఐపీఎస్ లేదా ఐఎఫ్ఎస్ అధికారుల పిల్లలు రిజర్వేషన్ ప్రయోజనాలను పొందడం గురించి  ప్రశ్న వేశారు. ‘ఒక వెనుకబడిన తరగతుల కులాల్లో కొన్ని కులాలు వీటినుంచి ఫలాలు పొంది.. అభివృద్ధి చెందిన తరువాత అంటే..షెడ్యూల్డ్ కులం లేదా షెడ్యూల్డ్ తెగకు చెందిన వ్యక్తి ఐసీఎస్ లేదా ఐఏఎస్ అయ్యాడు. ఆ తరువాత అతని పిల్లలకు, గ్రామాల్లో నివసించే వర్గానికి చెందిన వ్యక్తులు అనుభవించే ప్రతికూలతలు ఉండవు. కానీ, రిజర్వేషన్లు ఇలా ఒకటో తరంతో ముగియకుండా రెండో, మూడో తరానికి కూడా కొనసాగుతుంటాయి’ అని ఆయన అన్నారు.

జర్నైల్ సింగ్ వర్సెస్ లచ్చి నారాయణ్ గుప్తా కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ, ఎస్టీలకు కూడా క్రీమీలేయర్ కాన్సెప్ట్ వర్తిస్తుందని అడ్వకేట్ జనరల్ బదులిచ్చారు. ఆ 2018 తీర్పులో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లను సుప్రీంకోర్టు సమర్థించింది. వెనుకబడిన వారిలో మరింత వెనుకబడిన వారి కోసం ప్రత్యేక కేటాయింపులు చేయకపోవడం ఒక నిర్దిష్ట తరగతిలో "ప్రయోజనాల సమ్మేళనానికి" దారి తీస్తుందని గుర్మీందర్ సింగ్ అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios