వసుధారాణి తెలుగు కథ: మెరుపు, బొగ్గు,వజ్రం

నవ్వులు ఏమాత్రం లేని నైరాస్యపు గడ్డ ఆవూరు. ఆ ఊరేమి దాదాపు చుట్టుపక్కల అంతా అంతే ,ఆకాశం వైపు నోళ్లు తెరుచుకుని నీటిచుక్కకై ఎదురు చూసే నెర్రెలు విచ్చిన నేలలు. వసుధారాణి కథ చదవండి

Telugu literature: Telugu short story by Vasudha rani

అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఒక కుగ్రామం జొన్నగిరి .ఉదయం 9 గంటలకి జగ్  జుగ్ మని ఒక డీజిల్ ఇంజిన్ ఆటో వచ్చి ఆవూరి బయట పొలాల దగ్గర ఆగింది.ఆటోలో నించి అన్నం క్యారియర్లు పుచ్చుకుని బిల బిలమంటూ ఓ ఏడేనిమిందిమంది ఆడవాళ్లు దిగారు. చూడమే వచ్చారు ఆశపోతు ఆడంగులు ! అంటూ నోట్లో బీడీ తీసి తుపుక్కున ఉమ్మేశాడు మాణిక్యం తన పొలంకేసి వస్తున్న వాళ్ళని చూస్తూ. 

తెల్లటి టవల్ ఒకటి కప్పుకుని చేని గట్టుమీద అతని పక్కన కూర్చున్న లచ్చుమమ్మ సరేలే నువ్వు నాకాడ వాళ్ళని యాదోకటి అంటమే గానీ వాళ్ళొచ్చే పల్లికిలిస్తా పిలుచ్చావు "రాండీమే! మాచెన్లో ఏరుకోండి" ,అని నవ్వుతూ  భర్తని వేళాకోళం ఆడింది ఆమె. 

నవ్వులు ఏమాత్రం లేని నైరాస్యపు గడ్డ ఆవూరు. ఆ ఊరేమి దాదాపు చుట్టుపక్కల అంతా అంతే ,ఆకాశం వైపు నోళ్లు తెరుచుకుని నీటిచుక్కకై ఎదురు చూసే నెర్రెలు విచ్చిన నేలలు.

మండే గుండెల తో దీనంగా మధ్యమధ్య కళ్ళ పై ఎత్తున  చేతులు పెట్టుకుని ఆకాశం వైపు  చూసుకుంటూ ఉండే రైతులు.ఇది అక్కడి చిత్రం.మరీ నాలుగేళ్లుగా ఒక్క మంచి వాన కురవక కరువు ఘోరంగా పరుచుకుని ఉంది ఆ ప్రాంతమంతా.

సరిగ్గా రెండేళ్ళక్రితం మాణిక్యం కూడా కరువులో కూరుకుపోయి ఊపిరాడనట్లు  ఉండేవాడు.ప్రతి ఏరువాక ముందరా పగిలిన పొలాన్ని ఆశగా దున్నటం , తొలకరి చినుకుకై ఎదురుచూడటం.వాన లేక దున్నిన   పొలం అలాగే పిల్లలకి అన్నం పెట్టలేని తల్లిలా బాధతో అణగారి పోవటం ఇదే వరస.
     
ఈ సమచ్చరం అన్నా ఆ కొండ్రాయుడి బిడ్డకి మనమ్మిని ఇచ్చి లగ్గం సేయ గలమా ?
 
చుట్టూ ఎటుచూసినా ఒక పచ్చని చెట్టు కూడా లేని చేలని  తమ చేను గట్టు పైనించి చూస్తూ దిగులుగా అడిగింది లచ్చుమమ్మ. "ఏమో మూడు లచ్చలు గావాల లగ్గం మాటలు కాదు!" నిర్లిప్తంగా సమాధానం ఇచ్చాడు మాణిక్యం. మూడు లచ్చలూ  యాం పళ్ళా ?

అంత ఎందుకు అవుతాది, ఒకలాంటి ఆశ్చర్యం తో అడిగింది ఆమె.

 "కొండ్రాయుడు బిడ్డ గవుర్ణమెంటు ఉద్యోగం సేత్తన్నాడు కదా అందుకు రెండు లచ్చలు రొక్కం  అడిగిఉండాడు ,మనమ్మికి లచ్చ కి బంగారం పెట్టాలని పిలగాడి తల్లి అడిగినాది".గొంతు కూర్చుని ఒక చెయ్యిఎత్తి కొంచెం పక్కకి తిప్పుతూ వేదాంత ధోరణిలో చెప్పాడు అతడు.

Also Read: డా|| ఎం దేవేంద్ర తెలుగు కథ: పునీత

 ఒక్కగానొక్క కూతురి పెళ్లి  రెండేళ్ల నుంచి పంట లేక వాయిదా పడుతోంది.మూడేళ్ళక్రితం పంటపండిన సంవత్సరం సంబరం గుర్తు కొచ్చింది లచ్చుమమ్మకి ,ఆయేడు కొంచెం మంచి వానలు పడి దేవుని దయవలన విత్తిన విత్తులు మొలకెత్తి కాలాన పంట చేతికి వచ్చింది.తమకి ఉన్న పది ఎకరాల పొలంలో ఐదు ఎకరాలు కంది, ఐదు ఎకరాలు వేరుశనగ వేస్తే.రెండూ ఎర్రని ఎత్తైన కుప్పలుగా చేలో .కష్ట పడి పనిచేసిన రైతుకి అత్యంత ఆనంద సమయం.పంట వచ్చిన సమయంలో భోజరాజే మాణిక్యం.కావలి వాళ్ళకి,గొడ్లు కాచే పిల్లలకి చేతికి ఎముకలేకుండా  వేరుశెనగ ఇత్తులు,కందులు దోసిళ్ళతో ధారగా పోసేవాడు. 

దూరం నుంచి దగ్గరదాకా వస్తూ  వినిపినిపించిన ట్రాక్టర్ శబ్దానికి లచ్చుమమ్మ ఆలోచనలలో నించి బయటికి వచ్చి ట్రాక్టర్ కేసి చూసింది ఆసక్తిగా. నలుగురు ఆడవాళ్లు  ఓ నలుగురు మగవాళ్ళు  ట్రాక్టర్ దిగి తలా ఒక డబ్బా పట్టుకుని వీరి ఎదురు పొలాల్లోకి ఉత్సాహం గా పరుగు లాంటి నడకతో వెళ్ళసాగారు ఎవరికి వారే. వాళ్ళని చూస్తూ ఏరువాక ఐనాదో లేదో, మొదలు కదుమే ఈళ్ల సంత అన్నాడు మాణిక్యం చికాకుగాముఖం పెట్టి . "సరేలే నీకు పళ్ళా అని  ఎవురూ  ఆశ పడక ఉంటారా? మడుసులన్నాక ! ఎవరి అదృష్టం ఏతాన ఉందొ మనకి తెలుచ్చాదా,అంది వంగి పొలాల్లో ఏవో ఎరుకుంటున్న వాళ్ళని చూస్తూ ఆమె.
     
 "నేను కష్టం మాత్రమే నమ్ముతానమ్మే ఈ రాళ్ళల్లో, రప్పల్లో ఏమీ లే ,తేరగా వచ్చే ఆమె లచ్చిమీ దేవే గాదుపొమ్మే."అంటూ మళ్ళీ తన తీరని దిగులు లోకి దూరిపోయాడు. తన పెనిమిటి ఏనాడూ ఇట్లాటి దానికి ఆశపడక పోవటం కేవలం కష్టాన్ని, వానదేవుడిని నమ్ముకోవటం ఆమెకి గర్వంగానే ఉన్నా ప్రస్తుత పరిస్థితికి మనమూ ఎందుకు ప్రయత్నం చేయకూడదు అన్న ధోరణి లోకి వెళ్ళింది.అవసరం ఎంతటి  స్థిరమైన సుగుణాలను కూడా అస్థిర పరిచి చంచలం కలిగిస్తుంది.
     
 "సర్లే ఇంటికి పోదాం పా ఈడ కూసుని మొక్కమొలిపిచ్చేది ఏముంది?"

యెనుముకి ఏడన్నా ఎండుగడ్డి సూడాల, అంది లేచి చీర దులుపుకుంటూ.చేత్తో ఎండిన నేలను నిమురుతూ "నువ్వు బో నేను రొవ్వంత ఆగి వస్తా."అని భార్యని పంపేసి .చేలలో రంగు రాళ్ళని ఏరుకునే వాళ్ళని చూడసాగాడు. 

వజ్రకరూర్లో ఒకప్పుడు వజ్రాలు దొరికెవట ఇప్పుడు లేవు.ఈ జొన్నగిరి ప్రాంతాల్లో మాత్రం,ఏరువాక ఐనాక  దుక్కి దున్ని వర్షం కోసం వదిలేసిన పొలాలలో ,మబ్బుపట్టి మెరుపు వచ్చిన సమయంలో భూమి అడుగున ఉన్న బాగా గట్టిపడిన కర్బన పదార్ధం పిడుగు తీవ్రతని పట్టి బయటకి వస్తుంది ఏదో ఒక రంగు రాయిలా.

ఒక నెల రోజుల పాటు చుట్టుపక్కల ఊళ్లలో తమ అదృష్టం పరీక్షించు కోవలనుకునే వాళ్లంతా ఉదయం అన్నం క్యారియర్లు కట్టుకుని వచ్చి సాయంత్రం దాకా వాళ్ళకిదొరికిన రాళ్ళని ఏరుకుని ఊరి సెంటరుకు పోతే.అక్కడ వీళ్లనుంచి ఆరంగుర్రాళ్ళు రాయి స్థాయిని పట్టి కొనుక్కునే వ్యాపారులు ఉంటారు.చాలా వరకు తక్కువ విలువ ఉన్న రాళ్లే దొరుకుతాయి.ఒక్కోసారి ఒక్కొక్కళ్ళ అదృష్టం 10 నుంచి 20 లక్షల రూపాయల విలువైనవి కూడా దొరుకుతాయి.

 మనుషులు అదృష్టాన్ని నమ్ముకోవటం మాణిక్యానికి  ఇష్టం లేదు అలా అని మిగిలిన రైతులలాగే తనుకూడా తన చేలోకి వచ్చిన వాళ్ళని వద్దని ఏమీ అనడు కానీ .వృధా ప్రయత్నాలు అన్నట్టు చూస్తాడు అడిగిన వాళ్లకేసి.ఇంట్లో వాళ్ళ నాయన గుర్తుగా వాళ్ళ అమ్మ దాచిపెట్టిన పనికిరాని రంగురాళ్ళ డబ్బా గుర్తు చేసు కుంటూ. అక్కడ ప్రతి ఇంట్లో ఒక  రాళ్లు నిండిన డబ్బా ఉంటుంది.

బాగా ఎండకాసిన ఆకాశాన  నెమ్మదిగా మబ్బుపట్టటం మొదలు పెట్టింది. కూర్చున్న వాడల్లా లేచి చేను మధ్య నుంచి అడ్డదారిన ఇంటికి నడవ సాగాడు.చిన్నగా ఒకటి కంటి రెప్పమీద ఒకటి పాదం మీద రెండు సన్నని చల్లని నీటి చుక్కలు పడ్డాయి .ఒక్కసారి ఒళ్ళు ఝల్లు మంది.దూరంగా ఖాళీ పొలాల్లో ఒకమెరుపు తరవాత పిడుగు శబ్దం విని .ఈ హడావిడి తప్పితే చుక్క రాలదు .అనుకుంటూ ఇంకో అడుగు వేసాడు.అంతే కళ్ళు పోయేంతటి మెరుపు 20 అడుగుల ముందు కాళ్లకింద నించి నది పారినట్లు భూమిలోపల పిడుగు గలగలా కదిలిపోయింది లోపల. 
      
రెండు నిమిషాలు అలాగే ఆగిపోయి ముందుకు వెళితే మెరుపు దిగిన చోట లేత పచ్చని గోళి కాయంత రంగురాయి నేల తల్లికి  చేయి మొలిచి ఇచ్చినట్లు గా కొంచెం పైకి వచ్చిన మట్టి గడ్డపై కనపడింది.వణికె చేతులతో వంగి రాయిని అందుకున్న మాణిక్యం కళ్ళ వెంట కాళ్ళ మీద పడేఅంత కన్నీటి ధార.
     
ఉదయం 9 గంటలప్పుడదు కూతురు పెళ్లి తమ జీవితం ఎలా అనుకున్న మాణిక్యం .మధ్యాన్నం 3 గంటలకల్లా దిగుళ్లన్నీ తీరి జీవితం ఆటలో గెలిచి పోయాడు.తనకి దొరికిన రంగురాయికి ఇరవై లక్షలు రాగా ,అప్పటి కప్పుడే కొండ్రాయుడికి, కూతురి కట్నం పెళ్లి ఖర్చు కింద 5 లక్షలు ఇచ్చేసాడు.బాకీలు 5లక్షలు తీర్చేసి .లచుమ్మమ్మకి తనకి బ్యాంకులో చెరి 5 లక్షలువేసేసాడు.ఆనందంతో అన్నం మాటకూడా మరిచి చేనుకు పోయాడు.
       
ఇంకా చేలల్లో  వజ్రాలు  వేటాడుతూ తిరుగుతున్న వాళ్ళని చూసి ఇదివరకులా కోపం , విసుగు రాలేదు మాణిక్యానికి .చెమ్మగిల్లిన కళ్ళతో కూడిన  చిన్న నవ్వు వచ్చింది.

"ఏమెతుకు ఎవరికి చెందాలో రాసి ఉన్నట్టు.ఏరాయి ఎవరిదో ఎవరికి ఇవ్వాలో వాళ్ళు వచ్చినప్పుడుమెరుపు బొగ్గు ఒకటయి వజ్ర మవుతుంది."
మనం ఆపలేం, మనం ఇవ్వలేం .అనుకుని నేల తల్లిని చూసి మురిసిపోయాడు.

ఆప్పటి నుంచి ఇలా చేలోకి ఎవరు రాళ్లకు వచ్చినా నవ్వుతూ ఎరుకోండిమే అని పంపుతాడు. లచ్చుమమ్మ మాత్రం మాణిక్యంను చూస్తూ పంట పండినప్పుడు దోసిళ్ళతో తీసి సెనగ విత్తులను ధారపోసినట్లు.వజ్రాలు పండినా ధారపోసేత్తాడు  మహారాజు అనుకుంటుంది.నిజమే రైతుకు వజ్రాలు పండాలే కానీ రాసిపోసి దోసిళ్ళతో ధారపోయడూ మనకు. అతనే కాదు అక్కడి రైతులు అందరూ అంతే .

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios