డా|| ఎం దేవేంద్ర తెలుగు కథ: వసుధ

కుటుంబ సభ్యుల్లో కొరవడిన అవగాహన మానసిక ఘర్షణకు ఎలా దారి తీస్తుందో ఎం. దేవేంద్ర తన 'వసుధ' కథలో ఎలా వివరించారో చదవండి

Dr M devendra Telugu short story Puneetha

నేను కాలేజి నుండి ఇంటికి వచ్చేసరికి సాయంత్రమైంది. సూర్యుడు కొద్ది కొద్దిగా అంతస్థులను దాటుకుంటూ సుదూరంగా వెళ్తున్నాడు. స్కూలు నుండి పిల్లలందరు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. స్పూర్తి  కూడా వచ్చేసింది. ‘‘అమ్మా! వచ్చేశావా! నేను వచ్చాను’’ . ‘‘వచ్చాను తల్లీ స్కూల్ డ్రెస్సులో ఎంత ముద్దుగా ఉన్నావో!’’ అంటూ ముద్దు పెట్టేశాను. స్నానం చేయించి, స్నాక్స్ చేసిపెట్టి, టీవి ఆన్ చేసి అలా సోఫాలో  కూర్చున్నాను. అక్కడంతా గేటెడ్ కమ్యూనిటి కావడంతో పిల్లలు సాయంత్రమైతే ఆడుకోవడానికి అందరూ ఒక దగ్గర చేరుతారు. 

స్పూర్తి ఆడుకోడానికి వెళదామని గోలపెట్టడంతో టీవీ ఆఫ్  చేసి ఆటస్థలానికి తీసుకెళ్ళాను. పాపకు పక్కింటి సింధూతో స్నేహం ఎక్కువ. ఇద్దరు కలిసి చాలాసేపు ఆడుకున్నారు.  తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ‘అమ్మా సింధువాళ్ళ నాన్నలాగా మననాన్న కూడా  ఎప్పుడు మనతోనే ఎందుకు ఉండరు’ అని స్పూర్తి  అడిగిన ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో నాకర్థం కాలేదు. గుండెల్లో ముల్లుగుచ్చుకున్నట్లు అనిపించింది. ఆ మాటను దాటేసి ‘‘అవునూ నీకు బొమ్మ కొని తెచ్చాను, అది నీకు ఇవ్వడం మరిచేపోయాను’’ అని మాటమార్చాను. స్పూర్తి "హేయ్ హేయ్ " అని గెంతుకుంటూ ఇంటికి చేరింది. బ్యాగులోని బొమ్మ తీసి చేతిలో పెట్టాను. స్పూర్తి  ఆటలో మునిగిపోయింది. నేను వంటచేసి, పాపకు తినిపించడం, పడుకోబెట్టడం పూర్తిచేశాను. నాకు మాత్రం తినాలనిపించడం లేదు. అట్లాగే పడుకున్నాను. నిద్రరావడం లేదు. మనస్సు గత జ్ఞాపకాలలోకి వెళ్ళింది. జీవితం ఎంత పరిపూర్ణంగా ఉండాలని భావించానో అంత అసంపూర్ణంగా మిగిలింది. రేపు రేపు స్పూర్తికి  బుద్ధి తెలిస్తే  ఇంకెన్ని ప్రశ్నలడుగుతుందోనన్న సంఘర్షణ నాలో ఎక్కువైంది. ఆలోచనల్లో పడ్డాను.                 
మా నాన్న లాయరు కావడంతో జెండర్ తేడా లేకుండా పెంచాడు. ఆదర్శభావాలు కలిగిన నాన్న ఆడపిల్లలు ఎదగాల్సిన స్థితి గురించి, ఆడపిల్లల హక్కుల గురించి పదేపదే నాకు చెప్పేవాడు. అమ్మ గృహిణి ఆమె చిన్నప్పుడు, వాళ్ళనాన్న అంతగా చదివించలేదు. తనలాగా నా జీవితం ఇంటికి పరిమితం కావొద్దని పదిమందికి మేలుచేస్తూ ఒక సామాజిక హోదాలో నేనుండాలని అమ్మ ఎప్పుడు నాకు చెప్తూ ఉండేది. అమ్మనాన్న ఏ లోటు లేకుండా పెంచారు. అడిగిందల్లా కాదనకుండా ఇచ్చారు. వారి ఆశను నేను నిజం చెయ్యాలని ఆరాటమే తప్ప, మనసులో మరో ఆలోచనే రానివ్వలేదు. షోషల్ సైన్స్ లో  పిజి చేశాను. వెంటనే పి.హెచ్.డి చేశాను. మహిళ ఆర్థికస్థితిని సామాజిక కోణంలో ప్రపంచవ్యాప్తంగా తీసుకొని ఆరు, ఏడు సంవత్సరాల పాటు పరిశోధన పూర్తి చేశాను. 

మహిళలు వెనకబడటానికి గల కారణాలను అన్వేషించాను. ముఖ్యంగా భారతీయమహిళలపై ప్రత్యేక దృష్టిపెట్టాను. తరువాత లెక్చరర్ గా  ప్రభుత్వ ఉద్యోగం సంపాదించగలిగాను. ఉద్యోగం చేస్తున్నాను. నాకప్పటికే 35 సంవత్సరాలు. పెండ్లికి ఆస్యమైందన్నారందరు. కానీ, నా తల్లిదండ్రులు మాత్రం ఏకాగ్రతను చూసి పెండ్లికి ఒత్తిడి చేసే ప్రయత్నం చేయలేదు. ఆలస్యంగా పెండ్లి ప్రయత్నాలు మొదలుపెట్టడంతో సంబంధాలు దొరకలేదు. ఒకవేళ దొరికిన పెండ్లికొడుకు విషయంలో ఒకటుంటే మరొకటి లోపం కనిపిస్తుంది. ఆ రోజు తెలుగు మ్యాట్రిమోనికి వెళ్ళివచ్చి నాన్న ఒక సంబంధం బాగానే ఉందనిపిస్తుందని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం పైగా  జీతం కూడా బాగానే ఉంది అన్నారు. అట్లా పెండ్లిచూపుల్లో మొదటిసారి చూశాను రవిని. అబ్బాయితో ఒకసారి మాట్లాడాలని నాన్నకు చెప్పాను. ‘సరే అన్నారు’ నాన్న. పెళ్ళిచూపుల తంతు ముగిసింది. నేను తనకు నచ్చానని అబ్బాయి చెప్పాడట. ఇంకోరోజు నాన్న రవితో మాట్లాడే ఏర్పాటు చేయించారు. ‘‘నన్ను చేసుకోవడం మీకు ఇష్టమేనా!’’ అన్నాను నేను. ‘ఇష్టమే మరి నేను నీకు నచ్చానా!’ రవి‘నచ్చారు. కానీ, నా జీవితం పట్ల నాకు కొన్ని ప్రత్యేకమైన కోరికలున్నాయి. నేను సమాజానికి చేయాల్సిన బాధ్యతలున్నాయి’ అన్నాను నేను. ‘నీవు చేసే పనులన్నీ మంచివే అనిపిస్తే నేను తప్పక సహకారం అందిస్తాను. నలుగురు చెల్లెల పెండ్లిలు చేయడం ద్వారా నా పెండ్లి చాలా ఆలస్యమైంది’ అని రవి తన కుటుంబ నేపధ్యం చెప్పుకొచ్చాడు. మీకు సొంత ఇల్లు లేదని నేను ఏ మాత్రం చింతించడం లేదు. కాకపోతే నాకు ఉన్న కోరిక ఏంటంటే పుట్టబోయే సంతానాన్ని మంచి హోదాలో పెంచాలని, పిల్లలు పుట్టేనాటికే గేటెడ్ కమ్యూనిటిలో ఇల్లు కొనాలని, కారు కొనాలని అందుకోసం నా జీతం డబ్బు కేటాయిస్తాను. నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఈ పెండ్లి అంగీకారమే అన్నాను. ‘నేను ఏ పనిచేసినా అమ్మను అడగకుండా నిర్ణయం తీసుకోలేను’ అన్నాడు రవి. ‘సరే మీ ఇష్టం’ అన్నాన్నేను. పెళ్ళిచూపుల్లో వాళ్ళమ్మను చూస్తే చాలా చాదస్తంగా అనిపించింది. రవి చెళ్ళెళ్లందరు పెద్దగా చదువుకోలేదు. రవికి తండ్రి లేడు. తన తల్లి నిర్ణయమే తుదినిర్ణయం అనుకుంటా. ఈ సంబంధం కూడా కుదరకపోవచ్చు అనుకున్నాను. వారం రోజుల తర్వాత రవి నుండి ఫోన్ వచ్చింది. నాన్న నా పెళ్ళి కుదిరినందుకు సంతోషపడ్డారు. తాహత్తుకు తగ్గట్టుగా పెళ్ళిచేసి పంపాడు. అందరు ఈడుజోడు బాగుందన్నారు.
 
నా దాంపత్యం జీవితం చాలా ఆలస్యంగా మొదలైంది. నా అడ్రసు కూడా న్యూసిటీ నుండి ఓల్డ్ సిటికీ మారింది. నా ఇంటిపేరు మారింది. అయితేనేం ప్రేమ అనే నందనవనంలో ప్రతిరోజు తాజా పువ్వులు పూయించాలని, వినీలాకాశంలో ప్రేమపక్షులమై విహరించాని కలలుగన్నాం. రవినన్ను బాగానే అర్థం చేసుకున్నాడు. వారాంతపు రోజుల్లో సినిమాలు, షికారులకు వెళ్ళేవాళ్లము.

అత్తమ్మ సుగుణ మాత్రం నా పట్ల అంతప్రేమను కనబరిచేదికాదు. ఇంట్లో పెత్తనం అంతా అత్తమ్మదే. ఒకటవ తేది వచ్చిందంటే రవి దగ్గర ఉన్న జీతం డబ్బు లెక్క చేసి మరీ తీసుకునేది. నాకు మాత్రం అత్తమ్మ మీద ఏ మాత్రం అసూయ లేదు. చదువుకోకపోయిన సంసారం నడిపే తెలివితేటలు ఆమెకు ఉన్నాయని సంతోషపడ్డాను. కానీ ఆమెకున్న మూఢనమ్మకాలను చూస్తే నాకు కోపం. నా పెళ్ళై ఆరునెలు గడిచాక నన్ను కూడా జీతం ఇవ్వమని అడిగింది. రవి ఇంకా ఆఫీసు నుండి రాలేదు.

‘మౌనంగా ఉండిపోయాను’ ‘ఏంటి మౌనంగా ఉన్నావు. పెద్దదాన్ని అడుగుతున్నా కదా!’ సుగుణమ్మ. ‘అది అది ` ఇల్లు కొనడానికి అడ్వాన్సు ఇచ్చాను అత్తమ్మ’ అన్నానేను‘అయ్యయ్యో ... నా పెద్దరికం ఏం ఏడ్చింది. ఒక్క మాట నాతో చెప్పలేదు. మా కాలంలో ఆడవాళ్ళం ఇట్లా లేము. నేను పెంచిన నా ఆడపిల్లలు కూడా ఇట్లాగా లేరు’ సుగుణత్తమ్మ.‘లేదత్తమ్మ రవికి పెళ్ళికి ముందే చెప్పాను. మీకు తెలిసికూడా ఇలా మాట్లాడుతున్నారు. అయినా ఇద్దరి డబ్బు ఖర్చుపెట్టడం ఎందుకు. ఇల్లు నా ఒకదానికోసం కొంటున్నానా! మనందరి కోసం కదా!’ అన్నానేను.‘నిన్ను అనడం కాదు. నిన్ను ఇట్లా పెంచిన నీ తల్లిని అనాలి. నిన్ను నెత్తిమీద పెట్టుకొని ఊరేగుతున్న మా వాడిని అనాలి’ సుగుణత్తమ్మ. ‘వచ్చే సంవత్సరం ఇల్లు కొనేవాళ్ళం, ఇన్ని రోజులులేంది ఇప్పుడు తొందరేమి వచ్చింది, చిన్నదానికి  శ్రీలక్ష్మి శ్రీమంతం చెయ్యాలి, మొదటికాన్పు కాబట్టి పుట్టింటివాళ్ళే డెలివరీ చేయాలి. రెండో కూతురు గృహప్రవేశానికి  ఒడిబియ్యం పొయ్యాలి. మూడోదాని కొడుకు పుట్టువెంట్రుకలు తిరుపతిలో తీయించాలి. అందరికి ఒక్కగానొక్క సోదరుడు రవి. ఎన్ని బాధ్యతలు. ఇప్పుడు నిన్ను పోషించాలి’ సుగుణత్తమ్మ. 

తలుపు చప్పుడైంది. రవి వచ్చినట్టున్నాడు. నేను వెళ్ళి తలుపు తీశాను. అత్తమ్మ మాటలతూటాలు అట్లాగే ముందుకు సాగుతున్నాయి.‘అమ్మ వసుధ  చేసేదాంట్లో తప్పేముంది. పెండ్లికి ముందే తను కొన్ని శరతులు పెట్టింది. ఈ సంబంధం కూడా ఎక్కడ ఎత్తిపోతుందోనని నేను ఈ విషయాన్ని నీకు వివరంగా చెప్పలేదు’ అన్నాడు రవి. నేను వాళ్ళిద్దరిని గమనిస్తూ మాటలు వింటున్నాను.‘అదిప్పుడు నీ భార్య, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వినాలి. ముఖ్యంగా నా మాటకు ఎదురు చెప్పవద్దు’. అంది సుగుణమ్మ.‘అమ్మా! సంసారం సాఫీగా పోతుంటే మధ్యలో ఈ పంతాలు ఎందుకు’ అన్నాడు రవి.‘దాన్నే పంతాలకు పోవద్దని చెప్పు. ఇచ్చిన అడ్వాన్సు తెచ్చి ఇవ్వమని చెప్పు’ అంది సుగుణత్తమ్మ. ఏమి అనకుండా ఆయన గదిలోకి వెళ్ళాడు. నేను వెనకాలే వెళ్ళాను. 
మేమిద్దరమే ఉన్నాము. నేనేమి భయపడకుండా నా నిర్ణయం మారదు. నేను పెండ్లికి ముందే  చెప్పానని నొక్కివక్కానించాను.
రవి నాకేవోసర్ధిచెప్పాలని చూశాడు. రెండు మూడు నెలలపాటు అత్తమ్మ చూపించిన విశ్వరూపానికి నేనొక పరిణతి చెందిన వ్యక్తిగా మౌనవ్రతం స్వీకరించాను. ఆ తరువాత ఐదారునెలల్లో ఆడపడుచు డెలివరీ, ఇరవై ఒక్కరోజు, పుట్టువెంట్రుకలు చాలా ఘనంగా దావతులు జరిగాయి. ఈ లోపల నేను నెలతప్పానన్న విషయం తెలుసుకున్నాను. రవి నన్ను మరింత అపురూపంగా చూడటం మొదలుపెట్టాడు. హంగు ఆర్భాటాలతో వరుస దావతులతో అసలేన్ని డబ్బులు వృధాగా ఖర్చైపోతున్నాయనిపించింది నాకు. అన్నితెలిసినదానిగా నేను ఆలోచించినప్పుడు నా శ్రీమంతానికి ఇంత ఆర్భాటం వద్దనిపించింది. అమ్మనాన్నతో కూడా అదేమాట చెప్పాను. శ్రీమంతం తర్వాత ఒక రోజు ఇంట్లో సుగుణత్తమ్మ తిట్ల దండకం మొదలుపెట్టింది. ‘మీ వాళ్ళు ఇంత సింపుల్గా చేస్తారా! అదే నేనెలా చేశాను దావతులన్ని’ అని ఎత్తిపొడిసింది. ఎట్లాగో సర్దుకుంటూ పోయాను. ఎనిమిది నెలలు నిండాయి. కాలేజీకి పోయిరావడంతోనే అలసిపోతున్నాను. తిన్నది సరిగా అరగడం లేదు. ఆడజన్మ పరమార్థం నాకు బోధపదిండి. ఒక బిడ్డకు జన్మనివ్వడానికి ఎన్నెన్ని అవస్థలు, ఎన్నెన్ని త్యాగాలు చేయాలి. రవి తెచ్చిన పండ్లను చూసి అత్తయ్య ఒకటే గోల. నా బిడ్డలు ఇట్లానే చేశారా! మరీ చాదస్తం! విడ్డూరంగా మాట్లాడింది. నాకూ అత్తమ్మకు మధ్య ఉన్న అంతరాన్ని నేను అర్థం చేసుకోగలను. ఇది నా ఒక్కరి సమస్యకాదు. రెండు తరాలమధ్య ఉన్న సమస్య కూడా. ఈ బంధం మధ్య ఉన్న వైరుధ్యం అలాంటిది. తనకు విశేష అనుభవజ్ఞానం ఉండొచ్చుగాక. నాకు సంబంధించిన ప్రతి విషయంలో ఆమె జోక్యం అవసరం లేదనిపించింది.
ఆషాఢమాసం కావడంతో బోనాలపండుగ సమీపించింది. అత్తమ్మకు వారం ముందునుండి ఒకటే హడావుడి. ఆడపడుచులందరికి రమ్మని ఫోన్ చేసింది. పిండివంటలు చేసింది. ఇల్లంతా దులిపి చక్కదిద్దింది. ఆమె ఓపికకు దండం పెట్టాలనిపించింది. రవి రెండు,మూడు రోజుల ముందే మేకపిల్లను  మాట్లాడిపెట్టాడు. తాగడానికి కావసిన సరుకులను ముందే తెచ్చిపెట్టాడు. నాకు ఎనిమిది నెలలు కావడంతో నీరసంగా ఉంది. అందుకని కాలేజీలో మెటర్నటీ లీవ్ ఎప్పుడు అప్లైచేయాలో ఆలోచిస్తున్నాను. మధ్యమధ్యలో సిక్లీవ్స్ వాడుకుంటూనే ఉన్నాను. ఆడవాళ్ళకు అడుగడుగునా పరీక్షలే అనిపించింది. కాలేజీకి అంతపెద్ద కడుపు వేసుకొని వెళ్ళాలంటే తోటి అధ్యాపకుల ముందు, ముఖ్యంగా మగవాళ్ళముందు, మరిముఖ్యంగా విద్యార్థుల ముందు ఇబ్బందిగా అనిపించింది. కానీ తప్పదు. అయినా నేను చేస్తున్నది తప్పుపని కాదు కదా! ఈ సృష్టిచలనం అంతా ఆడవాళ్ళ సహనం మీద, త్యాగం మీద ఆధారపడిందనిపిస్తుంది. అందుకేనేమో మహిళలను భూమితో పోలుస్తారు. 

ఆ రోజు బోనాల పండుగ ఆడపడుచులందరూ అమ్మవారిలా తయారు అయ్యారు. కాళ్ళకు పసుపు, చేతుల నిండా గాజులు, తల్లో పువ్వులు, మెడనిండా నగలు, చెవులకు పెద్దకమ్మలు, చంపస్వరాలు, వాళ్ళపిల్లల్ని కూడా అందంగా అలంకరించారు. బోనం తయారుచేశారు. సాంప్రదాయంగా గుడికి బోనం తీసుకుని వెళ్ళారు. నాకు ఓపిక లేక నేను గుడికి వెళ్ళలేదు. నేనైతే పెండ్లిలో తప్ప ఎప్పుడు ఇంతలా తయారవలేదు. కాలేజీకి వెళ్తే హోదాకు తగ్గట్టుగా వెళ్తాను. జడలో పూలుపెట్టుకోను, చేతునిండా గాజులు వేసుకోను, ఈ విషయంలో అత్తమ్మ నన్ను మొట్టికాయు వేస్తుంటుంది. ముత్తైదవంటే కాళ్ళకు పసుపు, చేతినిండా గాజులు, మెడలో నల్లపూసలు, కుంకుమబొట్టు అని పదేపదే చెప్తుంటుంది. ఉద్యోగవాతావరణం ఎలా ఉంటుందో ఆమెకు ఏం తెలుసు! అని మనసులో అనుకొని ఊరుకునేదాన్ని. లక్ష్మి అంటే సంతోషం, లక్ష్మి అంటే డబ్బు అంటుంది అత్తమ్మ. నేనేమో లక్ష్మి అంటే జ్ఞానం అని వాదిస్తుంటాను.

గుడికి వెళ్ళివచ్చాక మగవాళ్ళందరు ఇంటి వెనుక ఖాళీస్థలంలో మేకను హలాల్ చేయించారు. అత్తమ్మ తన కూతుర్లతో కలిసి వంటింట్లోకి వెళ్ళింది. మటన్, చికెన్, బగారా, కాళ్ళు తలకాయ కూర, బోఠిబబ్బెర్లు, పూరీ, అమ్మో ఎన్నెన్ని వంటకాలో, వాడవాడంతా కుడా ఇట్లాగే వంటల్లో నిమగ్నమైయ్యారు. ఎక్కడ చూసిన మసాల గుమగుమ వాసనలే. వంటలు పూర్తయ్యాయి. మగవాళ్ళ బ్యాచంతా ఇంటిపైన వేసిన టెంట్ కింద ఏర్పాటు చేసిన కుర్చీల్లో ముందు టేబుల్స్ వేసుకొని కూర్చున్నారు. పిల్లలు, ఆడవాళ్ళందరము హాలులో కూర్చొని తిన్నాము. తిన్నాక కాసేపు నడుము వాల్చాను. మొగవాళ్ళు ఎప్పుడు తిన్నారో తెలియలేదు. ముందు హాలంతా పిల్లలతో సందడి సందడిగా ఉంది. కాసేపు అత్తమ్మవాళ్ళందరు పోచమ్మ ఊరేగింపు చూడటానికి వెళ్ళారు. పోతరాజుల ఆటను చూడటానికి పిల్లలు కూడా వెళ్ళారు. రాత్రిపూట అరగదని నేను తొందరగానే తినడం కానిచ్చేశాను. ఎవరి హడావుడిలో వాళ్ళున్నారు. నాకైతే తొందరగానే నిద్రపట్టింది. ఆయిల్ పుడ్ తినడం వల్లనేమో దాహం వేసినట్టయ్యింది. టైం చూస్తే రాత్రి పదకొండవుతుంది. గది బయటకు నడిచాను. లైట్లన్ని వేసే ఉన్నాయి. వంటింట్లోకి మెల్లగా నడిచాను. మగవాళ్ళెవ్వరు బంగ్లా పైనుండి కిందకు దిగలేదు. పిల్లలందరూ ముందుగదిలో ఆడుకుంటున్నారు. ఆడపడుచులు వంటగగదికి ఆనుకొని ఉన్న అత్తమ్మ గదిలో ముచ్చట్లలో మునిగిపోయారు. నేను అక్కడున్న సంగతినివాళ్ళు గమనించనే లేదు. ఆ మాటలు నా గురించే అని మరింత శ్రద్ధగా చెవిపెట్టాను.

‘వసుధ మీ రవన్నను తన కొంగుకు ముడివేసుకుంది’ సుగుణత్తమ్మ. ‘నీ కైతే  అన్నను దూరం చేయలేదు కదమ్మా’ అన్నది చిన్నకూతురు శ్రీలక్ష్మి. ‘మా ఇద్దరిని విడదీసే శక్తి ఆ దేవుడికి కూడా లేదు. కానీ పెళ్ళైనప్పటి నుండి తన జీతం డబ్బు ఒక్కపైసా కూడా ఇవ్వడం లేదు. నాకు చెప్పకుండా ఇంటికి అడ్వాన్సు ఇచ్చింది. తర్వాత  నన్ను కూడా తీసుకెళ్ళి చూపించారు’ సుగుణత్తమ్మ.

‘అమ్మ మీ అల్లుడి ఒక్కరి సంపాదనతో మేము పెళ్ళై పదేళ్ళయిన సిటీలో ఇల్లు కొనలేకపోయాము. నువ్వు మమ్మల్ని వదిన లాగా చదివించి ఉంటే మేము ఉద్యోగాలు చేసేవాళ్ళం’ అంది శ్రీనిధి. ‘మీ నాన్న ఉంటే ఆలోచించేదాన్నేమో నాకు ఎంతసేపు మీ పెళ్ళిళ్లు చేసి ఒకింటి వాళ్ళను చేసే బాధ్యత గురించి తప్ప ఇంకేమి ఆలోచించలేదు’ సుగుణమ్మ.

‘వదినమ్మ మీద ఏంటి కంప్లైంటు’ శ్రీనిధి ‘ఉద్యోగం చేస్తే అయిపోతుందా, ఎన్నిచేస్తే సంసారం!’ సుగుణత్తమ్మ ‘నువ్వు ఉన్నావు కదమ్మా చూసుకోవడానికి’ శ్రీనిధి ‘ఇగ నాకు కూర్చొని తినే భాగ్యం లేనట్టుంది, అదే ఉద్యోగం లేని కోడల్ని చేసుకుంటే నా చెప్పు చేతల్లో ఉండేది. అయినా ఒకటి చెప్పలా! ఉద్యోగం లేదనుకో, ఎప్పుడంటే అప్పుడు పుట్టింటికి రావొచ్చు. ఆడజన్మ అన్నాక కూర్చొని తినాలి కానీ, లేనిపోని తలనొప్పులెందుకు. వసుధకు చేయించుకోవడం తప్ప చేయడం తెలియదు’ సుగుణత్తమ్మ.

‘అమ్మా సిటీలో ఉండేవాళ్ళు ఉద్యోగాలు చేయకపోతే ఈ రోజుల్లో నడవట్లేదు. ఖర్చు విపరీతంగా పెరిగిపోయాయి. అయినా ఎంతమంది భార్యభర్తలు ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళు లేరు! వదిన పనిముట్టడం లేదా అయితే’ శ్రీలక్ష్మి ‘ఎవరైనా పిల్లల్ని కన్నారో లేదో సుకుమారం చేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం ఉందని నెలకు యాభై వేలు సంపాదిస్తుందని వసుధకు పొగరు. ఆగు ముందు ముందు నా తడాకా ఏంటో చూపిస్తా’ సుగుణత్తమ్మ. ఈ మాటల పరంపర ఇట్లాగే కొనసాగుతుంది.

నాకు చెమటలు పట్టాయి. అమ్మో! ముందు ముందు ఇంకెన్ని సవాళ్లను ఎదుర్కొవల్సి వస్తుందో అనుకుంటూ నా గదికి వెళ్ళిపడుకొన్నాను. నిద్ర రాలేదు. అట్లాగో ఇట్లాగో పదిరోజులు గడిచిపోయాయి. నాకు తొమ్మిదో నెల వచ్చేసింది.  ఇప్పుడు పుట్టింటికి వెళ్ళిపోవచ్చని అమ్మకు ఫోన్ చేశాను.  అమ్మానాన్న వచ్చి నన్ను పుట్టింటికి తీసుకెళ్ళారు. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయాను. అమ్మవాళ్ళింట్లో నాకు నచ్చినట్లుండొచ్చు. ప్రశ్నించేవాళ్ళు చాటుగా నా గురించి మాట్లాడేవారు ఎవరూ లేరన్న ఆత్మవిశ్వాసంతో నిద్రపోయాను. నిజంగా అమ్మాయిలకు పుట్టింటి నుండి అత్తారింటికి వెళ్ళడమనేది ఒక పెద్దపరీక్ష లాంటిది. తర్వాత డెలవరీ టైమ్ వచ్చేసింది. పాప పుట్టింది. నేను కొంచెం ఛామనఛాయ. కానీ, పాప తెల్లగా పుట్టింది. వాళ్ళ నానమ్మ పోలిక అనుకుంటా. నేను అత్తమ్మ గురించి ఆలోచించి ఆలోచించి కడుపులో ఉన్న రూపం అట్లాగే వచ్చినట్టుంది. తరువాత పురుడు చేశారు. ఆ విషయంలో అత్తమ్మకు మర్యాదు తక్కువయ్యాయని ముఖం మీదే అనేసి పోయింది. ఇరవైఒకటవ రోజు రానే వచ్చేసింది. పాపపేరు మామయ్య పేరు కలిసివచ్చేటట్టు చంద్రకళ పెట్టని ఆ రోజు అత్తమ్మ డిక్లేర్ చేసింది. మామయ్య పేరు చంద్రమౌళి. ఈ విషయంలో రవి మౌనంగా ఉన్నారు. నాకెందుకో ఆ పేరు నచ్చలేదు. పైగా పాతపేరు. నాకు నచ్చలేదని ఆమె ముఖం మీదే చెప్పేశాను. చంద్రకళ అని పేరు పెట్టకపోతే ఇంటిగడప తొక్కొద్దని సుగుణత్తమ్మ తెగేసి చెప్పేసింది. రవి వాళ్ళ అమ్మను సమాధానపరిచే ప్రయత్నం చేశాడు. కానీ ఫలితం లేదు. ఆ రోజు అత్తమ్మ వెళుతూ మళ్ళీమళ్ళీ అదే మాట చెప్పి వెళ్ళింది. నేను పాపను స్కూల్లో వేసేటప్పుడు కదా! పేరు గురించి ఆలోచించాలి. దాని గురించి ఆలోచించలేదు. ఆ సంగతి పక్కన పెట్టేశాను. డెలివరీ అయిన తరువాత ఒళ్ళు మామూలు స్థితికి రావటానికి ఐదు నెలు పడుతుందని అమ్మ చెప్పింది. నడుముకు బలమని ఏవో చెట్ల మందులతో తయారుచేసిన మాత్రలు నెలరోజుల పాటు ఇచ్చింది. పాపకు పాలు సరిపోవడానికి ప్రత్యేకమైన ఆకుకూరను చేసి పెట్టేది అమ్మ. అమ్మకు ఈ ట్రైనింగ్ అంతా వాళ్ళమ్మ నుండి వచ్చింది.
 
అనుకోకుండా పాపకు మూడు నెలలప్పుడు బాగా జ్వరం వచ్చింది. ఒకటే ఏడుపు. రాత్రంతా నిద్రపోలేదు. నేనింకా మెటర్నటీ లీవ్లోనే ఉన్నాను. ఏదో పెద్దప్రాబ్లమే అనుకొని యశోదాకు తీసుకెళ్ళాను. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నప్పుడు పాప పేరు అడిగారు. నేను స్పూర్తి అని చెప్పేశాను. తండ్రి సంతకం కావాని అడిగారు. ఫోన్ చేస్తే రవి వచ్చి సంతకం చేశాడు. పాప కిడ్నీకి ఆనుకొని ఉన్న ముఖ్యమైన నరం చాలా సన్నగా ఉందట. దానికి ఆపరేషన్ చేసి సరిచేయాలంటా! రవికి డబ్బుల విలువ అప్పుడు తెలిసివచ్చింది. నేను పొదుపు చేసిన డబ్బులు పాప ఆపరేషన్ కు అయ్యాయి. తెల్లవారి అత్తమ్మను తీసుకొని రవి వచ్చాడు. అదే టైమ్ లో  పాపకు బ్లెడ్ సాంపుల్స్ తీసుకోవడానికి నర్స్ వచ్చింది. ఫైల్ నెంబర్, పేషంట్ నేమ్ చెప్పమని అడిగింది. నేను స్పూర్తి  అనిచెప్పాను. నా మాట విన్న అత్తమ్మ ముఖం అదోలా మారిపోయింది. ఆమెకు పాప ఆరోగ్యం కన్న తాను చెప్పిన పేరు పెట్టలేదనే కోపం కనిపించింది.తరువాత ఇంటికి వచ్చేశాము. అత్తమ్మ ఫోన్ చేయడం మానేసింది. పాపను తిరిగి చూడటానికి కూడా రాలేదు. మా ఇద్దరి మధ్య దూరం మరింతగా పెరిగిపోయింది.

ఈ లోపల కొన్న ఇల్లు పూర్తయ్యింది. ముహుర్తం చూసి గృహప్రవేశం తేది నిర్ణయించాం. అత్తమ్మని, ఆడపడుచులందరినీ పిలిచాను. రవి వాళ్ళమ్మకు ఎంతో నచ్చజెప్పాడు. అత్తమ్మ పంతం మరింత ఎక్కువైంది కానీ తగ్గలేదు. ఆడపడుచులను, రవిని కూడా గృహప్రవేశానికి రానివ్వకుండా చేసింది. అట్లా మొదలైన మా ఎడబాటు పాపకు ఆరు సంవత్సరాలు వచ్చినా కూడా అలాగే ఉంది. ఎవరి పంతం వారిదే అన్నట్టుంది. రవి మాత్రం అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి పాపను, నన్ను చూసి వెళతాడు. ఎందుకో జీవితంలో ఏదో వెలితి కనిపిస్తుంది. కాలం ఆగదు. ఆ ప్రయాణంలో ఆ తరువాత పొదుపు చేసిన డబ్బుతో కారు కూడా కొనగలిగాను. డ్రైవింగ్ నేర్చుకున్నాను. నా వరకు నేను జీవితంలో సమర్థవంతంగా ముందుకు వెళుతున్నాను. కానీ, నా అనుకున్న వాళ్ళ విషయంలోనే నేను స్థానం సంపాదించకోలేకపోయాను. రవి అటు తల్లిని కాదనలేడు, ఇటు నన్ను పాపను వదుకోలేడు. కానీ రవి వాళ్ళ అమ్మదగ్గరే ఉంటున్నాడు. ఎందుకంటే తనను అర్థంచేసుకొనే పరిణతి నా దగ్గర ఉందని భావిస్తాడు. వాళ్ళ అమ్మను ఒప్పించేంత శక్తి ఆయనకు లేదు. నేను అత్తమ్మ మాత్రం ఉత్తర, దక్షిణ ధ్రువాల్లాగా మారిపోయాము. రవి మధ్యలో నలిగి పోతున్నాడు. మేము కలిసేదెప్పుడో? ఎలాగైనా కలవాలి. లేకపోతే స్పూర్తి హృదయం గాయపడ్డప్పుడల్లా నేను నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది.

ఆలోచనలో ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. తెల్లవారితే ఆదివారం కాబట్టి అలారం మోగదు. కాలింగ్ బెల్ శబ్దంతో నిద్రలేచాను. ఎవరని తలుపు తీసాను. నా కళ్ళలో ఒక్కసారిగా ఆశ్చర్యం! రవి, సుగుణత్తమ్మ వచ్చారు. సంతోషంగా వారిని ఇంట్లోకి ఆహ్వానించాను.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios