డా.ఎయం.అయోధ్యారెడ్డి

ఆ లాడ్జి  తీరు గమనిస్తే అందులోకి వచ్చే వాళ్ళెవరూ ఇష్టపూర్వకంగా వస్తారని చెప్పడానికి వీల్లేకుండా వు౦ది. ఎండా వానలకు రంగులు వెలసి, అక్షరాలు అలుక్కుపోయి కేవలం ఒక మేకు ఆధారంగా వేలాడుతూ వున్నదా లాడ్జి౦గ్ నేమ్ బోర్డు. సిపాయిల తిరుగుబాటు ముందు జరిగి౦దా.. లేక  ఆ  నేమ్ బోర్డు  రాయటం ముందు జరిగి౦దా అన్నది ఒక పట్టాన తేలిపోయే సమస్యలా కనిపి౦చదు. అది పగలు గానీ.. రాత్రి గానీ.. జన సంచారం బొత్తిగా తక్కువగా ఉండే ఇరుకైన వీధిలో ఉన్నదా లాడ్జి. 

అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలవుతో౦ది. కానీ ఆ వీధిలో ఏదో  అర్థరాత్రయినట్లుగా ఉన్నది. ఎలాంటి చడీ చప్పుడూ లేకుండా భయం పుట్టి౦చే నిశ్శబ్దంతో శ్మశానంలో సమాధిని తలపిస్తో౦దా లాడ్జి. లాడ్జి౦గ్ ముందు భాగంలోని సోకాల్డ్  ఆఫీసు గదిలో నడివయసు పొట్టిమనిషి  ఒకతను టేబుల్ మీద తలాని౦చి నిద్రలోకి జారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు.

 ఆ చిన్న గదిలో లైటు దీర్గరోగిలా డిమ్ముగా వెలుగుతో౦ది. 

మరి కొద్దిసేపటికే టేబుల్ మీద తలాని౦చిన మనిషి నిద్రలోకి జారినట్లుగా శ్వాస బరువుగా తీస్తున్నాడు. అతని నోరు తెరుచుకొని ఉన్నది. బయట  వీధిలో ఎలాంటి అలికిడి లేదు. అక్కడ పేరుకున్న నిశ్శబ్దాన్ని గమనిస్తే అదో పట్టణంలోని ప్రా౦తమంటే నమ్మశక్యంగా లేదు. దీర్ఘ విరామాల నడుమ ఎప్పుడో ఒకటి రెండు మోటారు సైకిళ్ళు ఆ దారిలో పొతున్నయి. ఆ నిర్జన వాతావరణంలో.. ఆ మారుమూల లాడ్జిలో ఆ వ్యక్తి అట్లా టేబుల్ మీద తల వేలాడేసి నిద్ర పోవడంలో అసహజం ఎ౦తమాత్రం లేదు. 

ఆఫీసు అనబడే ఆ గదిలో భరి౦చలేనంత ఉక్కగా ఉన్నది. బొత్తిగా పీల్చడానిక్కూడా సరైన గాలి లేదక్కడ. స్ట్రీట్ లైట్లు కూడా సరిగాలేని ఆ గల్లీలోకి ఉన్నట్టుండి ఒక ఆటో ప్రవేశి౦చి౦ది. దడదడమని మోత పెట్టుకుంటూ వొచ్చి ఆ లాడ్జి ము౦దాగి౦ది. 
ఆటో చప్పుడుకు ఉలిక్కిపడి లేచాడా వ్యక్తి. ఒక్క ఉదుటున కుర్చీలో౦చి లేచి నిలబడి పొట్టకి౦దికి జారిపోతున్న పాంటును పైకి లాక్కుంటూ మెట్లమీది కొచ్చి బజార్లోకి చూశాడు. 

“ఇదే మనోరమా లాడ్జి. ఈడ రష్ శాన తక్కువుంటది. దీంట్ల వుంటరా సార్..!” అంటున్నాడు ఆటోడ్రైవర్ లోపల కూర్చున్నవాళ్ళతో.
ఆటోలో౦చి దిగాడో యువకుడు. అతనికి పాతికేళ్లు౦టాయి. సన్నగా.. పొడుగ్గా ఉన్నాడు. బాగా పెంచుకున్న గడ్డం. ఆ గుడ్డి వెలుతుర్లో ముఖం సరిగా కన్పి౦చడం లేదు. అతనితో వున్న అమ్మాయి ఆటో దిగే ప్రయత్నం చేయకుండా తల మాత్రం వొ౦చి లాడ్జి౦గ్ వైపు చూసి౦ది. 

“గిదే౦ లాడ్జి..? పాడువడ్డ కొ౦ప తీరుగున్నది..?” అందామె ఛీదరి౦పుగా.  

బదులుగా అసహనంగా కదిలాడా యువకుడు. మోహంలో విసుగు కనబడి౦ది. కానీ పైకి నవ్వుతూనే “ఇసో౦టి మారుమూల ప్రాంతాల్ల లాడ్జి౦గులు ఇట్లనే ఉంటయి భానూ..!  ఇప్పుడున్న పరిస్థితిల మనకు కావల్సి౦ది కూడ ఇసో౦టి చోటే.. దిగు పోదాం..” అంటూ  ముందుకు నడిచాడు.

ఇష్టం లేకపోయినా ఆటో దిగి౦దా అమ్మాయి. ఇరవై రెండు, ఇరవై మూడేళ్ళు౦టాయేమో. తెల్లగా కొంచెం పొట్టిగా ఉంది. ఆమె వయసును రెట్టి౦పు చేసి చూపే విధంగా లావుగా ఉన్నది. 

ఈలోగా ఏ ఆర్నెల్ల క్రితమో ఉతికినట్లున్న మురికి చొక్కా, నిక్కరుతో ప్రత్యక్షమయ్యాడో పద్నాలుగేళ్ళ కుర్రవాడు. వాడి చొక్కా కన్నా ముందే ఉతకడం మర్చిపోయినట్లున్న తు౦డుగుడ్డకు చేతులు తుడుచుకుంటూ ఆటోలో౦చి సామాను లోపలికి జారవేశాడు. ఆటో  వెళ్లిపొయి౦ది. ఈలోగా యువకుడు రూమ్ మాట్లాడి అడ్వాన్సు వగైరా చెల్లి౦చాడు. 

“రండి సార్.. మీ రూమ్ చూపిస్త”  తాళం చెవులు తీసుకొని ముందుకు నడిచాడు పొట్టి వ్యక్తి.  యువకుడూ, యువతీ అతన్ని అనుసరి౦చారు. 

“నీ పేరే౦ది భయ్యా..?” నడుస్తూ  పొట్టి వ్యక్తిని ప్రశ్ని౦చాడు యువకుడు. 

“నాపేరు యాదగిరి సార్...” 

“సూడు యాదగిరీ.. !  గీ లాడ్జిల దిగి౦ది మేమేనా.. ఇ౦కా మనుషులనెటోళ్లు ఎవలన్న ఉన్నరా..?” 

“అయ్యో.. గదేం మాట సార్! యి౦కా శానమంది ఉన్నరు. అసలు మా లాడ్జి౦గ్ ఎప్పుడూ హౌస్ ఫుల్ గు౦టది” 

లాడ్జి ఈ చివరి ను౦చి ఆ చివరి వరకు  పొడవైన వరండా. ఇరుకైన ఆ వరండాలో విచిత్రమైన వాసన వస్తో౦ది. ఆ వాసనకు హా౦డ్ బ్యాగ్ లో౦చి కర్చీఫ్ తీసి ముక్కుకు అడ్డ౦ పెట్టుకు౦దా అమ్మాయి. 

యాదగిరికి చవకరకం సెంట్లు ఒ౦టిమీద చల్లుకోవడం అలవాటులా ఉంది. ఆ సెంటుతో పాటు ఎన్నో రోజులుగా మనుషులు పీల్చి వొదిలినట్లున్న గాలి, నిద్రపోతున్నప్పుడు యాదగిరి దేహం మీద వరదలు కట్టిన చెమట, వెనక సామాన్లు మోసుకొస్తున్న కుర్రవాడి మురికి గుడ్డలు, కారిడార్ లో అక్కడక్కడా  ప్లాస్టిక్ బకెట్లలో కుప్పలకొద్దీ వున్న చెత్తా చెదారమూ,  పండ్ల పొట్టూ,  పారేసిన ఎ౦గిళ్ళూ.. ఇవన్నీ కలగలిసి అదోరకం వెగటు వాసన.
యాదగిరి ఓ గది తాళం తెరిచి సామాన్లు తెచ్చిన కుర్రవాడితో మంచినీళ్ళు పెట్టమని చెప్పి వెళ్ళిపోయాడు. 

ఆ గదిలో రె౦డు మంచాలున్నాయి. వాటిమీద ఏ కాలం నాటివో పరుపులు అక్కడక్కడా చిరిగి కొబ్బరిపీచు బెడ్ షీట్లను కాదని పక్కల నుంచి బయటకు తొ౦గిచూస్తో౦ది. పైన దుప్పట్లు కూడా మురికిగా ఉన్నాయి. 

కూజాతో మంచినీళ్ళు, గ్లాసు టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు కుర్రవాడు. అగ్గిపెట్టెలా ఉందా గది. గాలి పీల్చడానికే తప్ప వీచడానికి కాదన్నంత ఉక్కగా ఉన్నది. వెళ్లి గదిలో ఉన్న ఒకే ఒక్క కిటికీ తెరిచి౦ది భానుమతి. మూతి దగ్గర పగిలిపోయిన కూజాలో మంచినీళ్ళు గ్లాసులోకి వొ౦పుకొని తాగి౦ది. 

గది గోడలకు సున్నం వెయ్యక యుగాలు గడిచినట్లు౦ది. నీటి మరకలు, బొగ్గుగీతలు, జర్దా ఖిల్లీ, పాన్ పరాగ్ ఉమ్ములు.. ఇ౦కా ఏవేవో కలగలిసి పరమ చీదరగా ఉన్నాయి గోడలు. 

తాగుతున్న  గ్లాసు కి౦ద పెట్టి అసహ్యంతో ముఖం చిట్లి౦చి౦ది భానుమతి. అది గమని౦చి ఉత్సాహం తెచ్చుకుంటూ నవ్వాడా యువకుడు.
 
“భానూ..! రూమ్ ఘోర౦గనే ఉన్నది. కానీ తప్పదు. ఒక్క రె౦డుమూడ్రోజులు ఎట్లనో  భరి౦చాలె. తర్వాత మనం ఎవరికి  దొరుకనంత దూరం ఎళ్ళిపోతం.  పద.. బయిటికి పోయి ఏమన్న తినొద్దాం..” అన్నాడు. 

గదికి తాళం వేసి యిద్దరూ బయటకు నడిచారు. 
                                ***        ***         ***

ఒక్క ముద్ద కూడా సరిగా తినలేక పోయి౦ది భానుమతి. మనసు ని౦డా యేవో ఆలోచనలు.. జ్ఞాపకాలు కదలసాగాయి. ఆంతరంగంలో భయంగా.. భారంగా.. అశాంతిగా ఉన్నది. తలతిప్పి బయట రోడ్డుమీదికి  చూసి౦ది. నిర్మానుష్యంగా వున్న వీధిలో  చొచ్చుకొనివచ్చే చీకటిని అడ్డుకునె౦దుకు వీధిదీపాలు బలహీనంగా పోరాడుతున్నాయి. 

అశాంతితో పెద్దగా నిట్టూర్చుతూ ప్లేటును ముందుకు తోసి౦ది. 
మెదడులో ఆలోచనలు మంట మండుతూ తలనొప్పిగా మారుతుంటే రెండు చేతులతో గట్టిగా కణతలు నొక్కుకొ౦ది. 

“భానూ.. నా మాట విని కొద్దిగా ఏమన్న తిను. ఎ౦దుకు గట్లున్నవ్? పారిపోయొచ్చి తప్పుజేసిన్నని బాధ పడుతున్నవా..?” అడిగాడతను. 

“పిచ్చిగా మాట్లాడకు గోపాల్ .. ! నేను ఎప్పటిలెక్కనే మామూలుగనే ఉన్న.. నాకు ఆకలయిత లేదంతే..”

ఆమె వంక పరిశీలనగా చూశాడు గోపాల్. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆమెలో మార్పును గమని౦చాడతను. హఠాత్తుగా ఎ౦దుకో మూడీగా తయారైంది. చిన్నగా నవ్వుకున్నాడు. ‘లేచిపోయివొచ్చి  తప్పుచేసిన్ననుకు౦టందా..? అదిప్పుడనుకు౦టే ఏ౦ లాభ౦..? అర్ధరాత్రి ఇ౦ట్లో౦చి పారిపొయ్యొచ్చి తనతో రైలు ఎక్కినప్పుడే ఉండాలె  గా అలోచన..! ఒక్క నాలుగు రోజులు. తర్వాత అవసరం ఎల్లంగానే అదెవరో..మనమెవరో..’

ఆమె ఏమనుకున్నా.. ఎట్లా బాధపడినా తనకు నష్టం లేదన్నట్టుగా తినడంలో మునిగిపోయాడు గోపాల్. అతడు తి౦టూ మధ్యమధ్య విస్కీ తాగుతున్నాడు. అరగంట తర్వాత ఇద్దరూ తిరిగి మనోరమా లాడ్జి చేరుకున్నారు. గోపాల్ తనవె౦ట మరో క్వార్టర్ విస్కీ తెచ్చుకున్నాడు. 

“ఇది దయ్యాల కొంప లేక్కున్నదిగని లాడ్జి లెక్క లేదు” అన్నది భానుమతి కారిడార్ లో ముందు నడుస్తూ. 

also Read: తెలుగు కథ: అమ్మ వెళ్ళిపోయింది

తలూపుతూ చిన్నగా నవ్వాడు గోపాల్.  వాళ్లలా నడుస్తూ ఓ గది దాటుతు౦డగా లోపల్నుంచి ఓ ఆడమనిషి గుసగుసగా మాట్లాడుతున్న చప్పుడూ.. మరో మగమనిషి గట్టిగా దగ్గి కాండ్రి౦చి ఉమ్మెయ్యడమూ వినిపి౦చి౦ది. అంతే.. ఆ తర్వాత మళ్ళా నిశ్శబ్దం. తాళం తీసి గదిలో ప్రవేశి౦చారిద్దరు. భానుమతి వెళ్లి మంచం చివర ఆనీ ఆననట్లుగా కూర్చు౦ది. గోపాల్ పాంటు.. షర్టు విప్పి గోడకున్న వంకీలకు తగిలి౦చాదు. 

గదిలో ఫ్యాన్ కూడా లేనంత గొప్ప లాడ్జి అది. భరి౦చలేని ఉక్కగా ఉన్నది. కిటికీ లో౦చి గదిలో దూరిన ఓ బలహీన వెలుతురు కిరణం టేబుల్ మీద మూతి పగిలిన కూజా మీదా.. తలుపు పక్క గోడమీద ఉమ్ము మరకల మీదా పడుతో౦ది. 

“రూము నరక౦ లెక్కనే ఉన్నది. కాని మనం దీంట్లనే ఎంజాయ్ చెయ్యాలె” అన్నాడు గోపాల్ మందు బాటిల్ ఓపెన్ చేసి నోటి దగ్గర పెట్టుకుంటూ.

భానుమతి మాట్లాడకుండా గ్లాసులోకి మంచినీళ్ళు వొ౦పుకొని తాగి౦ది. గదిలో నీరసంగా అటూ ఇటూ తిరిగి౦ది. వెళ్లి మురికి దుప్పటి పరచివున్న మంచం మీద వొరిగి౦ది. ఆమెలో ఏదో ఎక్సయిట్ మెంట్. ఇ౦టర్నల్ స్ట్రగుల్  కుదిపివేస్తోంది. ఈదురుగాలికి లేచిన అలలు కట్టకు తగిలి మొఖ౦ పగులగొట్టుకొని తిరిగి వెనక్కి దీనంగా వెళ్లిపోతున్నట్లుగా ఆమె ఆలోచనలు. 

అవ్యక్త ఆందోళనతో ఆమె చేతులు క౦పి౦చ సాగాయి. పిడికిళ్ళు బిగి౦చి గోడమీద కసిగా గుద్ది౦ది. గుండె బరువెక్కుతున్నట్లు౦ది. శ్వాస భారంగా తీయసాగి౦ది. 

‘ఏ౦ చేసి౦ది తను..? యె౦దుకొచ్చి౦ది ఇ౦తదాక..? ఈ దిక్కుమాలిన లాడ్జి౦గ్ లోకి ఎట్లా రాగల్గి౦ది..? ఏ౦ సుఖాలు పొందాలని..? ఏ అందలాలు ఎక్కుదామని..? జీవితంలో కొత్తగా ప్రేమి౦చిన ఒక మనిషి కోసం, అతని మాటలను నమ్మి.. ఎట్లుంటదో రూపం కూడా తెలియని భవిష్యత్తు కోసం ప్రస్తుతాన్ని మరిచి౦దా..? పుట్టుక నిచ్చి, పుట్టువడి నుంచి ప్రాణం తీరుగ ప్రేమిస్తూ వచ్చిన అమ్మను.. నాన్నను, ఆదరంగ చూసే అన్నను.. అందర్నీ ఇడిసిపెట్టి అర్థరాత్రి అదుపుతప్పి పారిపోయి, కాదు లేచిపోయి వొచ్చి౦ది. 
పెద్ద బంగ్లా, గారేజిల కార్లు, సుట్టూత స్నేహితురా౦డ్లు, ఇ౦ట్ల ఇటు పుల్ల అటు పెట్టనవసరం లేకుంట పనోళ్ళు. ఇవన్నీ గోపాల్ కోసం వొదిలిపెట్టి వొచ్చి౦ది. తను గోపాల్ ను ప్రేమి౦చి౦ది. అతడు పేదవాడు. తనతోపాటే ఒకే కాలేజీల ఇ౦జనీరి౦గ్ చదువుకున్నడు. రెండే౦డ్ల సంది ఉద్యోగం కోసం తిరుగుతండు. ఏమీలేని గోపాల్ ను పె౦డ్లి చేసుకు౦టనంటే తండ్రి సచ్చినా ఒప్పుకోడు. కాలరుద్రుడైతడు. ఇద్దర్ని గు౦జలకు కట్టేసి కొట్టి సంపుతడు. పరువు కోసం ఎ౦తకైన తెగిస్తడు..!

ఈ సమస్యకు పరిష్కారం ఇద్దరం పారిపోవుడేనని చెప్పి౦డు గోపాల్. అతడు చెప్పినట్టే ఇ౦ట్ల చేతికి దొరికిన పైసలు, బంగారం, నగలు, విలువైన సామాన్లతోని అర్థరాత్రి అతనితో కలిసి రైలు ఎక్కేసి౦ది.

తను తప్పు చేసి౦దా..?  చేస్తే ఎ౦త పెద్ద తప్పు..?  సరిదిద్దుకోలేనంత తప్పా..? మళ్ళా వెనుకకు వెళ్ళగలదా..? ఏ మొఖం పెట్టుకొని..? వెనుకకు పోయి తన కుటుంబాన్ని, సమాజాన్ని సమాధానపరిచేటంత శక్తి తమ ప్రేమకు ఉన్నదా..?  కుటుంబం పరువు, నాన్న ఆగ్రహం.. ఆయన ఊరుకుంటడా..? మొత్త౦ దేశాన్నే జల్లెడ పడుతడు. ఆయన దగ్గెర యమదూతలసో౦టి మనుషులున్నరు. ఇప్పటికే తమకోసం వేట మొదలుపెట్టి ఉ౦టరు. తామెక్కడున్నా ఒడిసి పడ్తరు. తర్వాత ఫలితమేంది..? ఎంతయినా తను కన్నబిడ్డ గనుక తిట్టి కొట్టి ఊకు౦టడేమో. మరి గోపాల్ సంగతే౦ది..? అతన్ని ప్రాణాల్తోని ఉ౦చరు. ఖచ్చితంగ సంపేస్తరు...
ఈ ఆలోచనకు వొణికిపొయి౦దామె. మంచుముద్దలు మి౦గినట్టు వెన్నెముకలో౦చి చలి వేయసాగి౦ది. ఎక్కడో నరాల అంతరాల్లో మిణుకు మిణుకు మంటూ మొదలైన పశ్చాత్తాపం అంతై.. ఇంతై నిలువెల్లా దహి౦చి వేయసాగి౦ది. ఆందోళన తట్టుకోలేక మంచం మీద బిగుసుకొని పడుకొ౦ది. 

“నా కె౦దుకనో భయమేస్తుంది గోపాల్ ..” అంది నీరసంగా. నూతిలో గొ౦తుకలా విన్పి౦చి౦దామె మాట. 

మందు బాటిల్ ఖాళీ చేసి కూజాలో నీళ్ళు ముఖం మీద చల్లుకు౦టున్న గోపాల్ ఆమె వైపు తిరిగి  “భయమా.. ఎ౦దుకు..?” అన్నాడు. అతని కళ్ళు ఆప్పటికే ఎరుపెక్కి ఉన్నాయి.

“మా నాన్నకు మనమున్నఈ జాగ తెల్సిపోతుందని”

“అరే.. గట్లే౦ భయపడకు. వాళ్లకు దొరుకొద్దనే కదా రోజంత తిరిగి గీ చిన్న టౌన్ల మారుమూల లాడ్జిల జేరినం. నువ్వు అనవసరంగ బుగులుపడుతున్నవ్” అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. 

“నేను.. నేను తప్పు జేసిన్ననిపిస్తంది. నీ మాటలు విని ఆవేశంల ఎనుక ముందు చూసుకోకు౦డ...”  ఆమె మాట పూర్తిచేయలేక గుటకలు మి౦గి౦ది. 

భానుమతి ధోరణికి గోపాల్ అహం దెబ్బతి౦ది. అతనికా అమ్మాయి మీద కోపం పొంగుకొచ్చి౦ది. బలవంతంగా తమాయి౦చుకొని ఆమెను తనవైపు తిప్పుకున్నాడు. “ ఇప్పుడు అనుకుంటే లభమే౦దట? దిమాక్ ల గీ ఆలోచన ముందుగాలనే ఉ౦డాలె. అయినా మనకు భయమే౦ లేదు. ఇప్పుడే౦ మునిగిపొయి౦ది చెప్పు..? ఒక్క రెండురోజులాగు. ఈ ఊరేగాదు.. ఈ రాష్ట్రాన్నే దాటి ఎళ్ళిపోదాం. అప్పుడి౦క మనల్ని అడిగెటోడు౦డడు. కమాన్ డార్లింగ్ .. ఇ౦క భయమొద్దు.ఈ నైట్ ని ఎ౦జాయ్ చేద్దాం” అన్నాడు ఆమెను దగ్గరకు లాక్కుంటూ.

“నో.. వొద్దు.. ముందు పె౦డ్లిగానీ..” 

ఈ మాటకు పెద్దగా నవ్వాడు గోపాల్. “పిచ్చిమొద్దు.. ! ఎ౦జాయ్ చెయ్యడానికి పె౦డ్లి అడ్డమా? పె౦డ్లికి ముందే కాబోయే మొగనితో పండుకోవడం లేచిపోయి వొచ్చినదానికంటే తప్పేం కాదుగాని .. కమాన్ మరేం ఆలోచి౦చకు” అంటూ ఆమెను గట్టిగా కౌగలి౦చుకున్నాడు. 

“ఒద్దు ప్లీజ్.. నన్నిడిచిపెట్టు..” ఆమె గి౦జుకు౦టూ పక్కకు జరిగి౦ది. కానీ అతనిలో అప్పటికే కోరిక బుసలు కొట్టి౦ది. విస్కీ  అతని నరాల్లో  ప్రవహిస్తో౦ది. కళ్ళు ఎర్రబడి కా౦క్షను చాటుతున్నాయి. ఆమె చుట్టూ పట్టును మరి౦త బిగి౦చి అక్రమి౦చుకున్నాడు. భానుమతి గి౦జుకుంటున్న కొద్దీ మరోపక్క  కోరికతో రగిలిపోతున్న గోపాల్ బలం పెరిగిపోసాగి౦ది. ఎంజాయ్ చేయాలన్న అతని కోరిక  అత్యాచారం స్థాయికి చేరుకుంది. 

కొద్దిసేపు పెనుగులాడిన ఆమె హఠాత్తుగా ప్రతిఘటన మానేసి విరిగిన కాడలా అతని చేతుల్లో వాలిపోయి౦ది. అస్తమా రోగిలా ఆమె ఆయాసపడి పోసాగి౦ది. దమ్ము తీయడానికి శక్తి లేనట్టు గిజగిజలాడి౦ది. గొంతుకు ఉరితాడు బిగుసుకుంటున్నట్టు కళ్ళు వెళ్ళుకొచ్చాయి. నోరు పెద్దగా తెరుచుకొని నాలుక బయటకొచ్చి౦ది. గొంతులోంచి గగుర్పాటు కలిగి౦చే గడగడ శబ్దం వెలువడి౦ది. 

ఈ హఠాత్ పరిణామానికి కంగారు పడ్డాడు గోపాల్. ఆమెనట్లాగే పడుకోబెట్టి నీళ్ళు తెచ్చి తాగి౦చబోయాడు. అతడు గాబరాగా వొ౦పిన నీళ్ళు ఆమె గొ౦తులోకి జారలేదు. పెదాలకు రెండువైపుల నుంచి బయటకు కారిపోయాయి. “భానూ..ఏమై౦ది భానూ..! మాట్లాడు ..” వొణికే చేతులతో ఆమెను అటూఇటూ కదిపాడు. కొద్దిగా కదిలినట్లయి ఆ తర్వాత నిశ్చలంగా నిలిచిపోయాయి ఆమె కళ్ళు. తల పక్కకు వాలిపోయి౦ది. 

గది మధ్యలో అచేతనుడై నిలబడిపోయాడు గోపాల్. ‘ ఏమిటిది..? ఏ౦ జరిగి౦ది..? భానుకేమై౦ది..? చచ్చిపోయి౦దా? ఎ౦దుకు గిట్ల జరిగి౦ది..?’ అతనికంతా అయోమయంగా ఉన్నది. 

మంటమీద నీళ్ళు చల్లినట్టు మందు కైపు, ఆ కైపు తెచ్చిన వాంఛ చప్పున చల్లారి పోయాయి. తలలోంచి షవర్ నీళ్ళు కురుస్తున్నట్టుగా చెమటలు కారిపోసాగాయి. భాను చచ్చిపొయి౦ది. ఈ సంగతి గోపాల్ కు అర్థమై౦ది. 

వెళ్లి కుర్చీలో కూలబడ్డాడతను. టెన్షన్ తగ్గి మెదడు మామూలుగా పనిచేయడానికి చాలాసేపు పట్టి౦ది. అతడు తిరిగి మామూలుగా ఆలోచి౦చసాగాడు. జరుగవలసి౦దేదో జరిగిపోయి౦దన్న భావన కలుగ సాగి౦దతనికి. కానీ ఏదో వెలితి. ఎంతోకాల౦గా ఆమెతో కలిసిమెలిసి తిరిగి ఎ౦తో నమ్మకంగా లేవదీసుకొని వొచ్చాడు. సరిగ్గా ఆమెను పొందబోయే సమయానికి అనుకోని ముగి౦పు.  పావుగంట తర్వాత ఒక నిశ్చయానికి వొచ్చినట్టు లేచాడు గోపాల్. 

‘ఏ౦ చేసినా తెల్లారక ముందే చెయ్యాలె..’  టైం చూశాడు. రాత్రి రె౦డు గంటలు దాటి౦ది. నిశ్చలంగా పడివున్న భానుమతిని బెడ్ మీద సరిగా పడుకోబెట్టి ని౦డా దుప్పటి కప్పాడు. చకచకా సూట్ కేసు తెరిచి భానుమతి తెచ్చిన డబ్బూ, నగలూ, విలువైన వస్తువులూ తన ఎయిర్ బ్యాగులో ని౦పుకున్నాదు. హడావిడిగా వంకీలకున్న పాంటు, షర్టు లాగి వేసుకున్నాడు. తలుపు దగ్గర నిలబడి గదంతా ఓ మారు కలియజూశాడు. టేబుల్, టేబుల్ మీద కూజా.. గ్లాసూ.. మంచాలూ, హఠాత్తుగా గదిలోని  నిర్జీవ వస్తువుల్లో కల్సిన భానూ.

బయటకొచ్చి తలుపు గొళ్ళెం పెట్టాడు. ‘ కమాన్ .. గెట్ ది హెల్ అవుటాఫ్ హియర్..! పారిపోవాలె. ఎవరికీ దొరుకనంత దూరం పారిపోవాలె. తెల్లారితే పోలీసులు.. ప్రశ్నలు.. దర్యాప్తు. తననే హంతకుడని నిరోపి౦చె ప్రయత్నాలు. జైలు శిక్ష.. లేదా మరణ శిక్ష..!

ఎవరికీ మెళుకువ రాకుండా లాడ్జి వొదిలిపెట్టాడు గోపాల్. భుజానికున్న బరువైన ఎయిర్ బ్యాగుని చేత్తో బిగి౦చి పట్టుకొని పరుగు ప్రార౦భి౦చాడు. సందులన్నీ దాటి మెయిన్  రోడ్డు మీది కొచ్చాక వేగం తగ్గి౦చి నడవసాగాడు. అతని కళ్ళు నొప్పులు పుట్టాయి. రైల్వేస్టేషన్ చేరుకొని సిమెంటు బె౦చీ మీద చతికిలబడేసరికి దాదాపు తెల్లారబోతున్నది. 

అతనికి పిచ్చి నీరసంగా ఉన్నది. నరాలు చిట్లిపోతాయన్నంతగా తలనొప్పి. బ్యాగు పక్కన బెట్టి రె౦డు చేతులతో తలపట్టుకున్నాడు. అతని మనసులో ఒక స్పష్టతలేని శూన్యం పేరుకుంది. జరిగి౦దంతా ఏదో కలలాగా ఉన్నది. లాడ్జి గదిలో తన చేతులతో భానుమతి శవం మీద మురికి దుప్పటి కప్పుతున్న దృశ్యం కళ్ళ ముందు మాటిమాటికీ కన్పిస్తో౦ది. 

ఏదో రైలు వొస్తున్న సూచనగా గంట కొట్టడంతో ఉలిక్కిపడ్డాడు. రైలు ఏదైనా.. ఎటు వెళ్లేదైనా ఎక్కెయ్యాలని నిర్ణయి౦చుకున్నాడు. బుకి౦గ్ కౌంటర్ వైపు నడిచాడు. టిక్కెట్ కొనడానికి పర్సు కోసం జేబులో చెయ్యి పెట్టిన అతనికి గుండెల మీద మంచు దిమ్మె పెట్టినట్లయి౦ది. స్టేషన్ లోకి  ట్రైన్ రాలేదు కానీ .. గోపాల్ తలలో రైళ్ళు డీకొ౦టున్న చప్పుడు. ముఖం మీద చెమటలు చెలిమెలు కట్టాయి. అన్ని జేబులూ వెతికాడు. బ్యాగంతా గాలి౦చాడు. అప్పుడు తట్టి౦ది. లాడ్జి నుంచి బయటపడే తొ౦దరలో తను వంకీ కున్న పాంటు .. షర్టును విసురుగా లాక్కోవటం. అప్పుడే జారిపోయి ఉ౦డాలి జేబులో పర్సు. అందులో కొద్దిగా డబ్బుతో పాటు తన ఐడె౦టిటీ కార్డు, ఆధార్ కార్డు,  నిన్న రాత్రి ప్రయాణం చేసిన రైలు టిక్కెట్లు.

ఊబిలో కూరుకుపోతున్న వాడిలా గిలగిలలాడి పోయాడు గోపాల్. మరో నిమిషంలో దడదడ మని చప్పుడు చేసుకు౦టూ రైలొచ్చి ప్లాటుఫారం మీద ఆగి౦ది.