తెలుగు కథ: అమ్మ వెళ్ళిపోయింది

తెలుగు రచయిత్రి మృదువిరి అమ్మ వెళ్లిపోయింది అనే కథానిక రాశారు. ఆ కథానికలో ఆమె సున్నితమైన విషయాలను తడిమారు. అది చదివి మీ అభిప్రాయాలు పంచుకోండి.

Telugu Literature: Short story by Mruduviri

మృదువిరి

అమ్మా...అమ్మా...ఎక్కడున్నావ్ .. అంటూ చిన్నపిల్లాడిలా ఇల్లంతా కలియతిరుగుతూ అమ్మను పిలుస్తున్నాడు రాజేష్ 

అమ్మ ఇంట్లో లేదు..బయట కూడా గడియ పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిందబ్బా... అనుకుంటూ ఇంటి వెనుక పెరట్లోకి వెళ్ళాడు రాజేష్ 

అక్కడా అలికిడి లేదు...సాధారణంగా  అమ్మ రోజూ ఈ సమయానికి తోటపని చేస్తూ ఉంటుంది..

చెట్లకు నీళ్ళు సాయంత్రం పూట పెడితేనే రాత్రంతా చాలా సేపు తేమగా ఉండి మొక్కలూ చెట్లూ ఆరోగ్యంగా ఉంటాయి...అంతేగాక సాయంత్రాలే పూసే పూల మొక్కలు చాలా ఉన్నాయి తోటలో..రుద్రాక్షలు ,మల్లెలు సాయంత్రాలే తమకు స్వేచ్ఛ వచ్చినట్టుగా పరిమళాలు వెదజల్లుతూ విచ్చుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి...

అంతేగాక అమ్మ రోజూ వాటిని తెంపి మాలలుగా అల్లి ఇదివరకు తన తలలో తురుముకోవడంతో పాటు ఇంటి చుట్టుపక్కల మహిళలకు కూడా ఇచ్చేది..

.ఎప్పుడైతే నాన్నగారు కాలం చేసారో తన చేతితో ఎవరికి పూలను ఇచ్చేది కాదు...ఎవరేమనుకుంటారోనని జంకేది....తన దేవుని దరి చేర్చుకున్నట్టుగానే తననూ త్వరగా భవబంధవిముక్తురాలిని చేయమంటూ  దేవునికి వేస్తుంది..రోజూ సాయంత్రాలు దేవుని పటం నాన్నగారి పటాల ముందు దీపాలు వెలుగుతూ పూలమాలలతో అలంకరించబడుతుంటాయి

అమ్మనువెతుకుతూ ఆలోచనల నుండి తేరుకుంటూ ..అమ్మా....అమ్మా...ఎక్కడమ్మా....నలభైఐదేళ్ళ రాజేష్ స్వరం నాలుగైదేళ్ళ బాలునిలా అమ్మకోసం తపిస్తూ స్వరం జీరబోతోందిమల్లెచెట్టుదగ్గర కూడా అమ్మ కనిపించలేదువెనుదిరిగి ఇంటి పక్కన వాళ్ళని అడుగుదామనుకుంటూ బయటకువస్తూ ఆలోచిస్తున్నాడు.

అమ్మ ఎంతగా ప్రేమను పంచుతుందో అంత ఆత్మాభిమానం గలది..పెద్దనోట ఒకటి అని చిన్ననోట ఒకటి పడటం ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు..అందరిని ప్రేమగా చూస్తుంది..తనకు ఏదైనా నచ్చకపోతే అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతుందే గాని గొడవకు దిగడం గాని వాదించడం గాని చేయదు..

అసలు తానెంత తప్పు చేసాడు..అమ్మను అసలేం జరిగిందో తన ఇంట్లో ఉండగానే అడిగి నయానో బయానో బుజ్జగించి అక్కడే ఉంచుకుని ఉండాల్సింది..తన భార్య  తను లేనపుడు అమ్మను సూటిపోటి మాటలందని,ఉదయం లేవగానే అమ్మ మొహం చూడటం ఇష్టం లేదన్నదని తనకు తెలియదు..

అమ్మ తనింటి నుండి మన ఇంటికి వెళ్తానురా అన్నప్పుడు ఇప్పుడెందుకులే అమ్మా అన్నాడు గాని ఇక్కడే ఉండిపోమ్మా అనలేదు తాను..

వెళ్తున్నా బాబూ అని చెప్పినపుడు అమ్మకు ఈ ఇంటిలొ ఎన్నో అనుభూతులు ఉంటాయి ,అనిర్వచనీయమైన అనుబంధం ఉంటుంది అందుకే వెళ్తానంటుందని అనుకుని బస్సెక్కించి జాగ్రత్తలు చెప్పి ఈ ఇంటికి పంపించాడు గాని ఏమి జరిగిందని ఒక్కటంటే ఒక్కమాట అడగలేకపోయాడు.

అమ్మ వెళ్ళిపోయాక రెండునెలలకు గాని తనకు ఆ విషయం తెలియలేదు..అత్తగారి విలువ తనున్నప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలుస్తుందంటూ తన భార్య తనంత తానుగా జరిగిన విషయాలు చెప్పేంత వరకు అమ్మ తెలియనీయలేదు..

రెండువారాలకు ఒకసారి తాను ఓ రెండుమూడు గంటలైనా అమ్మతో గడిపి అమ్మ చేతిముద్ద తిని వెళ్తున్నప్పుడైనా అమ్మ ఎన్నడూ నోరుజారలేదు..కోడలి తప్పును కూడా కడుపులో దాచుకున్న అమ్మ వ్యక్తిత్వం మహోన్నత శిఖరం..ఇదిగో నిన్ననే భార్య క్షమాపణలు అడుగుతూ అత్తమ్మను తీసుకురండి అంటూ ప్రాధేయపడితేనే ఇలా వచ్చాడు చాలా సంతోషంగా...

అమ్మను ఇక తనతోనే ఎప్పుడూ ఉంచుకోవాలనే తలంపుతో పసిపిల్లాడిలా తహతహలాడుతూ వచ్చాడు..

అమ్మ కనిపించని,అమ్మ స్వరం వినిపించని ఈ కొద్ది నిముషాలు ఎంత భయంకరంగా ఉన్నాయి....

అమ్మా....అమ్మా.... అంటూ ఇల్లంతా తిరిగిన తాను దేవుని గది చూడలేదన్న విషయం గుర్తొచ్చి అడువేపు అడుగులు వేసాడు....

అంతే....అమ్మా...! అంటూ గట్టిగా కేకపెట్టాడు...అతని కేకకు ఇంటి పక్కన వాళ్ళంతా అక్కడికి పరిగెత్తుకొచ్చారు..
ఆ దృశ్యం చూసి నిశ్చెస్టులైపోయారంతా

దేవుడి పటం పక్కనే నాన్నగారి ఫోటో కూడా ఉంటుంది...ఫొటొలకు నిన్నసాయంత్రం వేసిన మాలలు స్వచ్ఛంగా తెల్లగా నిండుగా ఉన్నాయి....అమ్మ ప్రాణాలు కూడా వాటిల్లో చేరి మరింత నిండుదనం ఆపాదించుకున్నాయి..తనకు సాష్టాంగపడిన ఆమెనలాగే తనలో చేర్చుకుని భార్యాభర్తలను విడదీసినందుకు పశ్చాత్తాప పడి ఇపుడే తప్పు సరిదిద్దుకుంటున్నట్టు దేవుని పటంలో కూడా ఓ కొత్త కళ తాండవమాడుతోంది..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios