Asianet News TeluguAsianet News Telugu

ఇప్పటికీ ఆ రెండు దేశాల్లో కరోనా టీకాలు వేయట్లేదు.. ఎరిత్రియా కథ ఇదీ

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు టీకా పంపిణీ చేస్తుంటే ఆ రెండు దేశాలు మాత్రం ఇప్పటికీ వ్యాక్సినేషన్ చేయడం లేదు. ఉత్తర కొరియా, ఆఫ్రికా దేశం ఎరిత్రియా ఇప్పటి వరకు టీకా పంపిణీ చేపట్టలేదు. అంతేకాదు, అంతర్జాతీయ సంస్థలు టీకాలు అందించడానికి ముందుకు వచ్చినా తిరస్కరిస్తున్నాయి. ఎరిత్రియాను సుమారు మూడు దశాబ్దాలుగా పాలిస్తున్న ఇసాయిస్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశానికి మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి.

these two nations till not started vaccination
Author
New Delhi, First Published Dec 16, 2021, 6:45 PM IST

న్యూఢిల్లీ: కరోనా వైరస్(Coronavirus) రూపాలు మార్చి మరీ తరుచూ విరుచుకుపడుతున్నది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఇప్పటికైతే ప్రపంచ దేశాలు టీకాలనే నమ్ముకున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా దాదాపు అన్ని దేశాలూ వ్యాక్సినేషన్ చేపడుతున్నాయి. కానీ, రెండు దేశాలు ఇప్పటికీ కరోనా టీకా పంపిణీ(Vaccination) ప్రారంభించనే లేదు. ఆ రెండు దేశాలు.. ఒకటి ఉత్తర కొరియా(North Korea), రెండోది ఎరిత్రియా(Eritrea). ఈ రెండు దేశాలకు కొవావాక్స్ ద్వారా టీకాలు అందించడానికి సహాయ హస్తం చాచినా వారు తిరస్కరించారు. నమ్మలేకుండా ఉన్నా ఇది నిజం. ఆ రెండు దేశాల్లో ఇప్పటికీ టీకాలు వేయడం లేదు. ఉత్తర కొరియా గురించి అంతో ఇంతో వార్తల్లో వస్తున్నా.. ఎరిత్రియా గురించిన వార్తలు మాత్రం దాదాపు లేవు. అందుకే ఎరిత్రియా కథ ఏమిటో.. ఆ దేశం ఎందుకు టీకాలను వ్యతిరేకిస్తున్నదో? ఓ సారి చూద్దాం.

ప్రపంచంలో వెనుకబడ్డ.. అత్యంత ఒంటరి దేశం ఆఫ్రికాలోని ఎరిత్రియా. సుమారు మూడు దశాబ్దాల పాటు ఈ దేశం ఒక నియంత చేతుల్లో నలిగిపోతున్నది. ప్రెసిడెంట్ ఇసాయిస్ అఫ్‌వెర్కీ చేసినవే చట్టాలు.. వాటిని అంగీకరించనివారు.. అదృశ్యమైపోతారు. ఆయనకు ఎదురెల్లిన వారిని ఓ షిప్పింగ్ కంటైనర్‌లో బంధించి 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఎడారిలో వదిలిపెడతారు. ఆ మంటలకు మరణించాల్సిందే. 

Also Read: అంతుచిక్కని వ్యాధితో సూడాన్‌లో సుమారు 100 మంది మృతి.. అప్రమత్తమైన డబ్ల్యూహెచ్‌వో టాస్క్ ఫోర్స్

ఎరిత్రియాలో వ్యాక్సినేషన్ చేపట్టాలని ఇతర ఆఫ్రికా దేశాలు ఎరిత్రియాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశాయి. కానీ, సఫలం కాలేదు. అయితే, ఆ దేశానికి చెందిన కొందరు ప్రవాసుల నుంచి తెలిసిన సమాచారం విస్తూపోయేలా ఉన్నది. ఇసాయిస్ ఎందుకు తన సొంత ప్రజలకు టీకాలను వ్యతిరేకిస్తున్నాడనే విషయాలను వారి నుంచి తెలుసుకుంటే ఖంగుతినాల్సిందే. అది పూర్తిగా రాజకీయ కారణంగా ఉన్నది. ఎరిత్రియాకు సమీపంలోని ఇథియోపియాకు చెందిన టిగ్రే రీజియన్‌కు మధ్య ఘర్షణలు ఉన్నాయి. ఎరిత్రియా నియంత ఇసాయిస్‌కు టిగ్రే స్వేచ్ఛ కోసం పోరాడే టీపీఎల్ఎఫ్ బృందానికి తీవ్ర ఘర్షణలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న టెడ్రోస్ అధనామ్ గెబ్రియసస్ ఒకప్పుడు ఆ టీపీఎల్ఎఫ్ సభ్యుడు. ఇప్పుడు డబ్ల్యూహెచ్‌వో ఆమోదిత కోవావాక్స్ నుంచి టీకాలు తీసుకోవడం అంటే.. తాను ద్వేషిస్తున్న టీపీఎల్ఎఫ్ మాజీ సభ్యుడు సారథ్యం వహిస్తున్న సంస్థ నుంచి టీకాలు తీసుకోవడమేనని ఆయన భావిస్తున్నారని తెలుస్తున్నది. అందుకే టీకాలను ఆయన స్వీకరించడం లేదు.

అంతేకాదు, ఎరిత్రియాలో కొవావాక్స్‌పై దుష్ప్రచారం ఉన్నది. ఎరిత్రియాలోని సంపదను కొల్లగొట్టడానికి పాశ్చాత్య దేశాలు తయారు చేసిన ఆయుధంగా కోవావాక్స్‌ను అనుమానిస్తున్నారు. కొవావాక్స్‌లో చేరి టీకాలు స్వీకరించి వ్యాక్సినేషన్ చేయడం మూలంగా.. తాను ద్వేషించే టిగ్రే నివాసి విజయవంతం కావడం ఇసాయిస్‌కు గిట్టడం లేదని ఆ దేశ వ్యవహారాలపై అవగాహన ఉన్న కొన్ని వర్గాలు తెలిపాయి. దీనికి తోడు ఇసాయిస్ మరో దృక్పథం.. ఎరిత్రియాకు బయటి నుంచి సహాయం అవసరం లేదు అనేదీ ఒక కారణమై ఉండొచ్చు. 2020లో జాక్ మా ఆఫ్రికాలోని అన్ని దేశాలకు మెడికల్ సప్లైలు, పీపీఈ కిట్‌లను విరాళంగా పంపినప్పుడు ఒక్క ఎరిత్రియా దేశం మాత్రమే ఆ సహకారాన్ని తిరస్కరించింది.

Also Read: రెండో ప్రపంచయుద్ధంలో ఇండియాలో పాతిపెట్టిన బాంబులు.. ఇప్పటికీ ప్రాణాలు తీస్తున్నాయి

విదేశీ సహాయం తీసుకోవద్దని భావించే ఎరిత్రియా ప్రెసిడెంట్.. ఆ దేశ ప్రవాసులు విరాళాలు ఇవ్వడాన్ని ఆమోదిస్తారు. ఎలాంటి ప్రశ్నలు వేయకుండా ప్రవాసులు విరాళాలు ఇవ్వడం ప్రెసిడెంట్‌కూ సుఖంగా ఉన్నదని మరికొన్నివర్గాలు వివరించాయి. కాగా, ఆ దేశంలో హెల్త్ మినిస్ట్రీ కూడా తప్పుడు వివరాలు వెల్లడిస్తున్నది. వాస్తవంలో అక్కడి పేషెంట్లు, మరణాల సంఖ్యను చాలా వరకు ఆ మినిస్ట్రీ గణించడం లేదు. ఆర్టీపీసీఆర్ టెస్టు చేసుకోవడానికి అక్కడ 100 అమెరికన్ డాలర్లు. అక్కడి పేదలు టెస్టు చేసుకోవడానికీ జంకుతున్నారు. టెస్టు పాజిటివ్ వచ్చినా బయటికి చెప్పడం లేదు. ఎందుకంటే వారిని తీసుకుని క్వారంటైన్‌లో పెడితే ఒక వేళ మరణించినా మృతదేహం తిరిగి కుటుంబ సభ్యులకు అందడం చాలా కష్టం. అందుకే అక్కడి సంప్రదాయాల గీతను దాటకుండా వారు హాస్పిటల్‌కు వెళ్లే సాహసం చేయడం లేదని సమాచారం. అయితే, ఇంత బాధ్యతారాహిత్యం ప్రపంచానికీ ముప్పు అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఎరిత్రియా అంటే వైరస్ కుతకుత ఉడుకుతున్న కుండ అని.. ఎప్పుడు బద్ధలైన పరిస్థితులు దారుణంగా ఉండవచ్చని పేర్కొంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios