చరిత్రలోనే తొలిసారి అత్యంత కనిష్ఠ స్థాయికి క్రూడ్ ధరలు...
కరోనా వైరస్ స్రుష్టిస్తున్న విలయం చెప్పనలవి కాదు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధర 244 శాతం పతనమైంది. ‘0.01 డాలర్‘కు బ్యారెల్ ముడి చమురు ధర పలికింది. ఇది గల్ఫ్ యుద్ధం నాటి కనిష్ఠ స్థాయి. మంగళవారం వేకువ జామున తిరిగి కొంత పుంజుకున్నది క్రూడ్ ధర. ముడి చమురు మార్కెట్ చరిత్రలోనే అత్యంత కనిష్ఠ స్థాయికి ధరలు పడిపోవడం ఇదే తొలిసారి.
కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పాతాళానికి పడిపోతున్నాయి. ముఖ్యంగా తీవ్ర ఒడిదుడుకుల మధ్య అమెరికా ఫ్యూచర్ మార్కెట్‌లో చారిత్రక కనిష్ఠానికి పతనమయ్యాయి.
మే నెలకు సంబంధించి వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ, నైమెక్స్) రకం బ్యారల్ క్రూడాయిల్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ధర ఏకంగా 244 శాతానికి పైగా క్షీణించి -26.24 డాలర్లకు (భారత కాలమానం ప్రకారం సోమవారం అర్థరాత్రి 12.10 గంటల సమయానికి) పడిపోయింది.
గల్ఫ్ యుద్ద సమయంలోనూ ఈ స్థాయి ధరలు నమోదు కావటం గమనార్హం. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఏకంగా 244 శాతానికి పైగా పడిపోయింది.
కరోనా ధాటికి దాదాపు ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ కాగా, ఇంధన వినియోగం పెద్ద ఎత్తున తగ్గిపోయింది. కాగా, మే నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు మంగళవారంతో ముగుస్తుండటం కూడా మార్కెట్‌లో డిమాండ్‌ను ఒక్కసారిగా తగ్గించేసింది.
ముఖ్యంగా మే మధ్యనాటికి అమెరికా ముడిచమురు నిల్వ సామర్థ్యాన్ని మించి ఉత్పత్తి ఉండవచ్చన్న అంచనాలు మార్కెట్‌ను ముంచేశాయి. ఇక జూన్ కాంట్రాక్ట్ ట్రేడింగ్‌లోనూ బ్యారెల్ చమురు ధర 12 శాతం క్షీణించి 22 డాలర్లకు పరిమితమైంది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్ ప్రామాణికం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సోమవారం 26.30 డాలర్లు పలికింది.
also read ప్రభుత్వం మీ ఖాతాలో వేసే రూ.1500/- జమ అయ్యాయో లేదో ఇలా తెలుసుకోండి..
కరోనా కారణంగా ముడి చమురుకు డిమాండ్ గణనీయంగా తగ్గటంతో పాటు అమెరికాలో వైరస్ విశ్వరూపం చూపడటమే ధరల పతనానికి ప్రధాన కారణంగా ఉంది. మరోవైపు జూన్ నెల ఫ్యూచర్స్‌కు సంబంధించి బ్రెంట్ రకం కూడ్రాయిల్ బ్యారల్ ధర కూడా 5.7 శాతం క్షీణించి 26.48 డాలర్లకు చేరుకుంది.
డబ్ల్యుటీఐ-బ్రెంట్ చమురు ధరల మధ్య ఇంత భారీ స్థాయిలో వ్యత్యాసం ఉండటం ఇదే మొదటిసారి. మే 1వ తేదీ నుంచి రోజువారీ ఉత్పత్తిని 1.2 కోట్ల బ్యారళ్ల మేరకు తగ్గించేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాలు (ఒపెక్) అంగీకరించినప్పటికీ ధర కుప్పకూలటం గమనార్హం.
జర్మనీ, జపాన్‌ల్లో ఇంధన వినియోగం తగ్గవచ్చన్న అంచనాలు, అమెరికాలో స్టోరేజీ వసతులు పూర్తిగా నిండటం వంటి అంశాలు చమురు మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని విశ్లేషకులు అంటున్నారు.
ప్రపంచంలోని దేశాలన్నీ లాక్‌డౌన్ కావటంతో చమురు డిమాండ్ లేకపోవటం కూడా క్రూడ్ మార్కెట్‌పై పడింది. ఈ వారంలో మే నెల ఫ్యూచర్స్ కాంట్రాక్టుల గడువు ముగియనుండటంతో కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపలేదని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
భారత ఫ్యూచర్స్ మార్కెట్లోనూ ధరల పతన ప్రభావం కనిపించింది. మల్టీ కమోడిటీస్ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో సోమవారం పీపా చమురు ధర 21.24 శాతం నష్టంతో రూ.1,131కి పడిపోయింది. డిమాండ్ పడిపోతున్న నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లు తగ్గించుకోవడమే ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పతనం కొనసాగుతున్నా..ఆ ప్రయోజనం దేశంలోని వినియోగదారులకు దక్కడం లేదు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారమే ఇందుకు ప్రధాన కారణం ఉంది. కరోనా నేపథ్యంలో పెరిగిన ఖర్చులను ప్రభుత్వం ఈ రూపంలో రాబట్టుకోవాలని భావిస్తోంది.