Asianet News TeluguAsianet News Telugu

ఆర్‌బిఐ కీలక ప్రకటన...బ్యాంకులు రిస్క్ చేస్తేనే ఉపయోగం...

కరోనా మహమ్మారి విసురుతున్న సవాల్‌తో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుందని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దేశీయ ఆర్థిక వ్యవస్థను సరైన మార్గంలో పెట్టే దిశగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ కేంద్రీయ బ్యాంక్​ తీసుకున్న విధాన నిర్ణయాలపై ఆర్థిక వేత్తలు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. రెపోరేటు తగ్గించడంతో విపణిలోకి నిధుల ప్రవాహం పెరుగుతుందని.. అయితే బ్యాంకులు రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 

rbi  says   RBI reduces interest on money banks keep in RBI
Author
Hyderabad, First Published Apr 18, 2020, 1:09 PM IST

ముంబై/న్యూఢిల్లీ: కరోనా వైరస్​ ప్రభావంతో గాడితప్పనున్న ఆర్థిక వ్యవస్థను.. సరైన రీతిలో నడిపేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ప్రకటనలు చేసింది. మొండి బకాయిల నిబంధనలను సడలించడమే కాకుండా రుణదాతల డివిడెండ్ చెల్లింపులు, రివర్స్ రెపోరేటు శాతం తగ్గించింది. 

ఆర్బీఐ విధివిధానాలపై ఆర్థిక వేత్తలతో సహా సంస్థలు, వ్యాపార వర్గాలు సానుకూలంగా స్పందించాయి. రివర్స్ రెపోరేటు తగ్గింపు సరైన నిర్ణయమేనని, కానీ బ్యాంకులు రిస్కు తీసుకునేందుకు సిద్ధమైతేనే రేట్ల కోతతో ఫలితం ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

4 శాతంగా ఉన్న రివర్స్ రెపోరేటును ఆర్బీఐ పావుశాతం (25 పాయింట్లు) తగ్గించింది. కేంద్రీయ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బ్యాంకులకు అందుబాటులోకి వచ్చే నిధులను పెరగనున్నాయి. వాటిని ఉత్పాదక రంగాల్లో రుణాలు, పెట్టుబడుల రూపంలోకి మళ్లించడంతో ఆర్థిక వ్యవస్థలోకి నగదు ప్రవాహం పెంచు కోనున్నాయి.


కేర్ రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త మదాన్ సబ్నవిస్ ఈ సందర్భంగా స్పందిస్తూ ‘రివర్స్ రెపో రేటు తగ్గింపు సరైనదే. అయితే ప్రైవేటు సెక్టార్లలోకి నిధుల ప్రవాహం పెరిగిందా లేదా అని చూడాలి’ అని తెలిపారు. 

నిధులు తమ వద్ద ఉండిపోకుండా బ్యాంకులకు అందుబాటులోకి తేవడం ద్వారా రుణ కార్యకలాపాలు ఊపందుకునే దిశగా.. ఆర్బీఐ నిర్ణయం తీసుకుందని డీబీఎస్ బ్యాంక్ ఆర్థికవేత్త రాధిక రావు వెల్లడించారు. మార్చి నెలలో 30 బేసిస్ పాయింట్లు తగ్గించినా కేంద్రీయ బ్యాంక్ వద్ద ఇంకా నిధులు ఉండి పోయాయన్నారు. 

ప్రస్తుత నిర్ణయం ద్వారా కొంతమేరకు రుణాలు ఇచ్చే అవకాశాలు పెరగనున్నాయని డీబీఎస్ బ్యాంక్ ఆర్థిక వేత్త రాధికారావు చెప్పారు. అయితే, దీనివల్ల బ్యాంకులకు నష్టభయం కూడా కలిగే అవకాశం ఉందన్నారు. అయితే రివర్స్ రెపోరేటును ఇంకా తగ్గిస్తే ఫలితాలు ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయని రాధిక రావు పేర్కొన్నారు.

 

also read బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తున్నారా...అయితే దేంట్లో ఎక్కువ వడ్డీ వస్తుందో తెలుసా...

ఆర్​బీఐ నిర్ణయంపై ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు(ఎన్​పీఏ) నిబంధనల్లో తాజాగా ప్రకటించిన సడలింపులతో.. బ్యాంకులకు, వినియోగదారులకు ఉపశమనం కలుగుతుందన్నారు.

‘మూలధన వ్యయ సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుతమున్న ఆర్​బీఐ 90 రోజుల నిబంధనపై పునఃసమీక్షించాలి. ఓ ఆస్తిని ఎన్​పీఏగా పరిగణించిన అనంతరం రుణగ్రహీతకు మరో రుణదాత నుంచి నిధులు అందే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు 90 రోజుల ఎన్​పీఏ గడువును 180 రోజులకు పెంచాలి’ అని సౌమ్య కాంతి ఘోష్ అని చెప్పారు.

అయితే 180 రోజుల గడువును ప్రస్తుతం అమల్లోకి తీసుకొచ్చి.. రాబోయే రెండేళ్లలోగా 90 రోజుల నిబంధనను తిరిగి అమలు చేయాలని సౌమ్యకాంతి ఘోష్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు రూ. 50వేల కోట్లతో ప్యాకేజీ ప్రకటించింది ఆర్బీఐ. ఈ నిధులను బాండ్లు, కమర్షియల్ పేపర్లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల ద్వారా విపణిలోకి అందుబాటులోకి తీసుకురానుంది.

ఆర్బీఐ ప్రకటించిన ఉద్ధీపనల ద్వారా బ్యాంకింగేతర ఆర్థిక రంగం, గృహ రుణ సంస్థలు, చిన్నతరహా ఆర్థిక సంస్థలకు ఉపశమనం లభించనుందని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ క్రిష్ణన్ సీతారామన్ చెప్పారు. తాజా నిర్ణయం ద్వారా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు.. సూక్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు రుణాలు ఇచ్చే అవకాశాలు పెరుగుతాయని డెలాయిట్ అంచనా వేసింది.

ఆర్బీఐ తాజా ఉద్దీపనలతో బ్యాంకులు రుణాలు ఇవ్వగలిగే అవకాశాలు పెరుగుతాయి. తద్వారా నిధుల లేమితో వ్యాపార సంస్థలు ఇబ్బంది పడే అవకాశం ఉండదని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

కరోనాతో తలెత్తే సంక్షోభానికి ఆర్బీఐ పరిష్కారం చూపిందని ఇండియా ఇంక్ వెల్లడించింది. సంక్షోభంలో కూరుకుపోయే అవకాశం ఉన్న రంగాలకు చేయూత ఇచ్చే దిశగా ఆర్​బీఐ నిర్ణయం తీసుకుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు 

బ్యాంకింగ్ నిబంధనల్లో తాజా సడలింపుల వల్ల బ్యాంకులు కరోనా ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉందని ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే బ్యాంకులపై ఆధార పడకుండా వ్యాపారాలకు మూలధన వ్యయాన్ని పెంచాలని సంగీతారెడ్డి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios