Asianet News TeluguAsianet News Telugu

అడుగడుగునా కరోనా కష్టాలు..మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల మూసివెత..వేల కోట్లకు ముప్పు

అడుగడుగునా కరోనా కష్టాలు ఎదురవుతున్నాయి. తుమ్మినా.. దగ్గినా.. జ్వరం వచ్చినా కరోనా అనుమానాలు మొదలయ్యాయి. ఇక మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమపై దీని ప్రభావం చూపింది. ఈ ఫండ్ పథకాల మూసివేతకూ కారణం ఈ మహమ్మారే. ఇప్పుడు దేశీయ ఆర్థిక వ్యవస్థను కరోనా సంక్షోభం కబళించేస్తున్నది. నగదు వనరులను మింగేస్తూ భవిష్యత్ మీద భరోసా లేకుండా చేస్తున్నది. ముఖ్యంగా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో అలజడి సృష్టిస్తున్నది. 25 ఏళ్లుగా భారత్‌లో నడుస్తున్న ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆరు రుణ పథకాలను మూసేసింది. ఫలితంగా రూ.31 వేల కోట్ల  మదుపరుల సంపద ప్రమాదంలో పడింది.

lock down effect: mutual funds closes 6 schemes thousand crores in danger
Author
Hyderabad, First Published Apr 25, 2020, 11:08 AM IST

ముంబై: దేశీయ ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రత్యక్ష ప్రభావం మొదలైంది. ఇన్నాళ్లూ ఓ రంగానికి అంత నష్టం.. మరో రంగంలో కొన్ని వేల ఉద్యోగాలు పోనున్నాయన్న అంచనాలే ఇప్పటికి వచ్చాయి. కానీ ఈ మహమ్మారి కారణంగా అమెరికాకు చెందిన ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ భారత్‌లో ఆరు రుణ పథకాలను మూసేస్తున్నట్లు ప్రకటించింది. 

భారతీయ మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో 25 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పుడు రూ.30,800 కోట్ల మదుపరుల సంపద ఇరుక్కుపోయింది. తమ నిర్ణయం గురువారం నుంచే అమల్లోకి వస్తుందని సంస్థ స్పష్టం చేసింది. 

తమ మ్యూచువల్ పథకాల మూసివేతపై మార్కెట్‌ రెగ్యులేటర్‌ ‘సెబీ’తో చర్చించామని శుక్రవారం ఫ్రాంక్లిన్‌ ఇండియా తెలిపింది. అలాగే మార్కెట్‌ నిబంధనల ప్రకారం మదుపరులకు వారి పెట్టుబడులు తిరిగి అందుతాయని స్పష్టం చేసింది. 

కరోనా నేపథ్యంలో ఏర్పడిన విపత్కర పరిస్థితులను కారణంగా చూపుతూ ఓ ఫండ్‌ మేనేజర్‌ తమ పథకాలను మూసివేయడం ఇదే తొలిసారి. ఆర్థిక ఒత్తిళ్ల మధ్య అత్యధిక మదుపర్లు తమ పెట్టుబడుల ఉపసంహరణకు ముందుకు వస్తున్నారని ఫ్రాంక్లిన్‌ తెలిపింది. బాండ్‌ మార్కెట్లలో నగదు కొరత కూడా తమ ఈ నిర్ణయానికి ఓ కారణమని పేర్కొన్నది. 

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ తీసుకున్నసంచలన నిర్ణయంతో మదుపరులు ఉలిక్కిపడ్డారు. మదుపర్లకు ఎటూ తోచని పరిస్థితి ఏర్పడింది. ఓవైపు కొత్త పెట్టుబడులకు అవకాశం లేకుండా పోయింది.. మరోవైపు ఇప్పుడున్న పెట్టుబడులను వెనక్కి తీసుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటి వరకు ఫండ్లలో మదుపు చేసిన సొమ్మంతా అలా నిలిచిపోయి ఉంటుంది. 

సెక్యూరిటీస్‌ని అమ్ముతూ.. ఫండ్‌ మెచ్యురిటీ అయిన వారికి అయినట్లు చెల్లిస్తూ వస్తుంది. దీనికి ఒక కచ్చితమైన సమయం మాత్రం చెప్పే పరిస్థితి లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

also read బంగారం ధరలు భగభగ...తులం రూ.82వేలు?!

ఎంత సొమ్ము తిరిగి మదుపర్ల దగ్గరకు వస్తుందన్న దాంట్లో కూడా అనిశ్చితి నెలకొంది. మదుపర్లు ఇప్పటి వరకు మదుపు చేసిన సొమ్ముతో పాటు, ఫండ్లలో పెట్టిన పెట్టుబడుల సెక్యూరిటీలను మార్కెట్లో విక్రయిస్తే వచ్చిన ఆదాయంపై ఇది ఆధారపడి ఉండనుందని సమాచారం. 

ఫ్రాంక్లిన్ మ్యూచువల్‌కు చెందిన ఆరు పథకాలపై రూ.25వేల కోట్ల పెట్టుబడులు ఉన్నాయని తెలుస్తుండగా, రూ. 30,800 కోట్లు ఇరుక్కుపోయాయని పరిశ్రమ వర్గాల అంచనా. ఇదిలావుంటే రుణ పథకాలు సురక్షితమేనని, ఒక్క సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఆందోళన చెందాల్సిన పని లేదని మ్యూచువల్‌ ఫండ్‌ ఇండస్ట్రీ సంఘం ఆంఫీ మదుపరులకు భరోసానిచ్చింది. 

బాండ్‌ మార్కెట్లలో ద్రవ్య లభ్యత భారీగా తగ్గిపోవడం, పథకం నుంచి ఉపసంహరణకు మదుపర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంక్లిన్ వెల్లడించింది. రోజురోజుకీ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో మదుపర్లకు మెరుగైన రిటర్నులను అందించాలంటే ఇంతకంటే మేలైన మార్గం లేదని సంస్థ వివరించింది.

ఇప్పుడు అన్ని సమస్యలకు ఏకైక కారణం కరోనా. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. దీంతో రుణ చెల్లింపులపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. దీంతో మదుపర్లలో భయాలు పెరిగిపోయాయి. 

తద్వారా డెట్‌ ఫండ్‌ పథకాల నుంచి బయటకు రావడానికి క్యూ కట్టారు. గత నెల ఏకంగా రూ.1.94 లక్షల కోట్లు డెట్‌ ఫండ్ల నుంచి బయటకు వెళ్లాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే డెట్‌ మార్కెట్లలో లిక్విడిటీ సామర్థ్యం పడిపోవడంతో బాండ్ల విక్రయాలకు బ్రేక్‌ పడింది. దీంతో రుణాలు తీసుకొని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

రిజర్వు బ్యాంక్‌ సైతం బాండ్‌ మార్కెట్లలో లిక్విడిటీ పెంచడం కోసం పలు చర్యలు చేపట్టింది. రూపీ-డాలర్‌ స్వాప్‌ విండో ఏర్పాటు చేయడం, లాంగ్‌ టర్మ్‌ రెపో ఆపరేషన్స్‌(ఎల్‌టీఆర్‌ఓ)ను నిర్వహించడం వంటి చర్యలు తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఫ్లాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

ఫ్రాంక్లిన్‌ ఇండియా నిలిపివేసిన పథకాలివే: డ్యూరేషన్‌ ఫండ్‌, డైనమిక్‌ అక్రూయల్‌ ఫండ్‌, క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌, షార్ట్‌ టర్మ్‌ ఇన్‌కం ప్లాన్‌, అల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్‌, ఇన్‌కం ఆపర్చునిటీస్‌ ఫండ్‌. ఈ ఆరు పథకాలూ ఎక్కువ రిస్క్‌, ఎక్కువ రిటర్నులతో కూడినవి.

Follow Us:
Download App:
  • android
  • ios