న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తీసుకువచ్చిన ముప్పు అంతా ఇంతా కాదు. మున్ముందు పసిడిని పట్టుకుంటే భగ్గుమనడం ఖాయం. అవును ఇది నిజం. పుత్తడి ధరలు భగభగ మండబోతున్నాయి.  కరోనా వైరస్‌ తాకిడితో స్టాక్‌-బాండ్‌ మార్కెట్లు కుప్పకూలుతున్న వేళ మదుపరులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను సురక్షితమైన అతి విలువైన లోహాలవైపు మళ్లిస్తున్నారు.

ఈ క్రమంలోనే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ (బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీ) వచ్చే ఏడాది చివరినాటికి 10 గ్రాముల ధర ఏకంగా రూ.82 వేలకు చేరుకుంటుందని అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్‌ గోల్డ్‌ ధర 3000 డాలర్లకు చేరుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఔన్స్‌ ధర 1,726 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నది.

ఇప్పటి అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే పసిడి సురక్షితమైనదని బీవోఎఫ్ఎస్ సెక్యూరిటీస్ అభిప్రాయ పడింది. ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలవుతుండటం, కరోనాతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోవడమే దీనికి కారణమని విశ్లేషించింది. 

మరోవైపు అమెరికా మార్కెట్లో క్రూడాయిల్‌ ప్రతికూలానికి పడిపోవడం కూడా పసిడి భగ్గుమనడానికి పరోక్షంగా దోహదం చేయనున్నదని తెలిపింది. లాక్‌డౌన్‌ వల్ల బంగారు ఆభరణాల దుకాణాలు మూతపడటంతో ఫ్యూచర్‌ మార్కెట్లో పసిడి ధర అధికమవుతున్నది. 

అలాగే డాలర్‌ బలపడుతుండటం, ఆర్థిక మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు క్రమంగా తగ్గుతుండటం, అధిక ధరల కారణంగా భారత్‌-చైనా దేశాల్లో పసిడికి డిమాండ్‌ పడిపోతున్నదని బీవోఎఫ్‌ఏ తెలిపింది.  

ఇదిలా ఉంటే, భారతదేశంలో బంగారాన్ని కొనుగోలు చేయడం సాధారణం. కానీ గత కొంత కాలంగా బంగారం కొనుగోళ్లు తగ్గాయి. భవిష్యత్​లో మాత్రం పెరుగుతాయని తాజా స్టడీ ఒకటి వెల్లడించింది. గోల్డ్‌‌పై ఆసక్తి తగ్గుతున్నా, డబ్బులు ఉన్నప్పుడు బంగారం కొనుక్కుంటే అవసరాల్లో ఉపయోగపడుతుందనే ఆలోచన కొందరిలో ఉంది.

ఇండియన్‌‌ రిటైల్‌‌ ఇన్వెస్టర్లలో 29 శాతం మంది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బంగారాన్ని కొనుగోలు చేయలేదని ప్రపంచ పసిడి మండలి (డబ్యూజీసీ) తాజాగా రూపొందించిన నివేదిక‌లో పేర్కొంది. కానీ ఫ్యూచర్‌‌‌‌లో కొనడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. 

also read అక్షయతృతీయ స్పెషల్ : బంగారు ఆభరణాలపై ఆన్ లైన్ ఆఫర్లు..

52 శాతం మంది గతంలో కొంత బంగారాన్ని కొన్నారని డబ్యూజీసీ పేర్కొంది. ఇండియన్‌‌  గోల్డ్‌‌ మార్కెట్‌‌పై డబ్యూజీసీ సర్వే చేసి ‘ఇండియా రిటైల్‌‌ ఇన్వెస్టర్‌‌‌‌ ఇన్‌‌సైట్స్‌‌’ పేరుతో ఓ రిపోర్ట్‌‌ను విడుదల చేసింది.  ఈ సర్వే కోసం 1,005 మంది రూరల్‌‌ ఇన్వెస్టర్లను (ఫేస్ టూ ఫేస్‌), 1,280 మంది అర్బన్‌‌ ఇన్వెస్టర్ల (ఆన్‌‌లైన్‌‌లో) ను ఇంటర్వ్యూ చేశారు.

ఇండియన్‌‌ కల్చర్‌‌‌‌ వలన బంగారాన్ని కొంటున్నప్పటికి, ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ కోసం కూడా గోల్డ్‌‌ను కొంటున్నారని ఈ నివేదిక తెలిపింది. పసిడి కొనుగోలు విషయంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు విభిన్నంగా ఆలోచిస్తున్నాయని పేర్కొంది.

ఇండియన్‌‌ రిటైల్‌‌ ఇన్వెస్టర్లలో 52 శాతం మంది ఇప్పటికే ఎంతో కొంత గోల్డ్‌‌ను కొన్నారు. ఇందులో 48 శాతం మంది ఈ సర్వేకి ఏడాదికి  ముందే కొన్నారు. 29 శాతం మంది ఇప్పటి వరకు గోల్డ్‌‌ను కొనలేదు. కానీ ఫ్యూచర్‌‌‌‌లో గోల్డ్‌‌ను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

గోల్డ్‌‌ను గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే పట్టణ ప్రజలు ఎక్కువగా కొంటున్నారు. పట్టణాలలోని ఇన్వెస్టర్లలో 76 శాతం మంది ఇప్పటికే గోల్డ్‌‌ను కొనుగోలు చేశారు. 21 శాతం మంది ఇప్పటి వరకు గోల్డ్‌‌ కొనుగోలు చేయలేదు కానీ ఫ్యూచర్‌‌‌‌లో కొనడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాలలో 37 శాతం మంది ఇప్పటి వరకు గోల్డ్‌‌ను కొనలేదు. కానీ భవిష్యత్‌‌లో కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇండియన్‌‌ మార్కెట్‌‌ను మరింతగా అర్థం చేసుకోవడానికి 2,000 మంది రిటైల్‌‌ ఇన్వెస్టర్లతో ఈ సర్వే చేశామని డబ్ల్యూజీసీ తెలిపింది ఈ సర్వేతో ఇన్వెస్టర్ల ఆలోచన విధానాలను తెలుసుకోవడానికి వీలవుతుందన్నది.

29 శాతం మంది రిటైల్‌‌ ఇన్వెస్టర్లు ఇప్పటి వరకు గోల్డ్‌‌ను కొనుగోలు చేయలేదనే పాయింట్‌‌ తమ దృష్టిని ఆకర్షించిందని డబ్ల్యూజీసీ వెల్లడించింది. ఇండస్ట్రీ నుంచి మరిన్ని ఆలోచనలను స్వాగతిస్తాం. గోల్డ్‌‌ ఇండస్ట్రీ సామర్ధ్యాన్ని మరింత విస్తరించడానికి కృషి చేస్తాం’ అని డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం తెలిపారు.