టోక్యో/వాషింగ్టన్: చైనా దిగుమతులపై అధికంగా ఆధారపడుతున్న దేశాలకు కరోనా వైరస్‌ గొప్ప గుణపాఠం నేర్పింది. కొద్ది నెలల క్రితం వుహాన్‌లో ఈ వైరస్‌ తెరమీదకు రాగానే చైనా దేశంలో లాక్ డౌన్ విధించింది. 

దీంతో ఆ దేశంలోని అనేక పరిశ్రమల నుంచి ప్రపంచ దేశాలకు వివిధ రంగాల పరిశ్రమలకు ముడి సరుకు సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇక దిగుమతుల కోసం చైనాపై ఆధారపడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని భావిస్తున్న అమెరికా, జపాన్‌ తదితర దేశాలు చైనా నుంచి తమ కంపెనీలను వెనక్కు రప్పించేందుకు చర్యలు చేపట్టాయి. 

ఇలాంటి పలు సంస్థలు ఇప్పుడు భారత్‌ లాంటి వర్థమాన దేశాలవైపు చూస్తున్నాయి. చైనాకు ఏ మాత్రం తీసిపోనంత భారీ స్థాయిలో శ్రామికశక్తిని, మార్కెట్‌ను కలిగి ఉండటం, మానవవనరులు చౌకగా అందుబాటులో ఉండటం భారత్‌కు సానుకూల అంశాలు.

అంతర్జాతీయ ఉత్పత్తి రాజధాని (గ్లోబల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్యాపిటల్‌)గా భాసిల్లుతున్న చైనాను ప్రపంచ దేశాలు కొద్దినెలల క్రితం వరకు తమ వర్క్‌షాప్‌గా చెప్పుకొన్నాయి. కానీ అది గత వైభవంగానే మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

చైనాపై అధికంగా ఆధారపడినందుకు ప్రపంచ దేశాలు ఇటీవల భారీ మూల్యాన్ని చెల్లించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రపంచంలో ఎక్కడా లేనంత భారీస్థాయిలో వస్తువులను ఉత్పత్తిచేస్తున్న చైనా.. 2009 నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుగా కొనసాగుతున్నది. 

ప్రపంచ దేశాలకు అనేక రకాల వస్తువులను ఎగుమతిచేస్తూ రోజురోజుకూ ఆర్థికంగా ఎంతో బలపడుతున్న చైనా.. ఈ ఏడాది తమ ఉత్పత్తులతోపాటు ప్రాణాంతక కరోనా వైరస్‌ను కూడా ప్రపంచానికి ఎగుమతి చేసింది. అదే ఇప్పుడు చైనా కొంప ముంచుతున్నది. 

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రస్తుతం యావత్‌ ప్రపంచ ప్రజలంతా వ్యక్తిగత దూరాన్ని పాటిస్తున్నారు. ఇదేవిధంగా చైనాతో ఆర్థిక దూరాన్ని (ఎకనమిక్‌ డిస్టెన్స్‌ను) పాటించడం శ్రేయస్కరమని పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ దిశగా రెండు దేశాలు అమెరికా, జపాన్ ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టాయి.

కరోనా వైరస్‌ వల్ల ఎదురైన భారీ నష్టం నుంచి గుణపాఠం నేర్చుకొంటున్న అమెరికా, జపాన్‌.. ఇప్పుడు చైనాలోని తమ సంస్థలను వెనక్కు రప్పించేందుకు చర్యలు చేపడుతున్నాయి. ఈ విషయంలో జపాన్‌ ముందంజలో ఉన్నది. 

కరోనా వైరస్‌పై పోరాడేందుకు దేశంలో ఎమర్జెన్సీ (అత్యయిక పరిస్థితి) విధించిన జపాన్‌ ప్రధాని షింజో అబే.. ఈ మహమ్మారి వల్ల తమ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లిన నష్టాన్ని తగ్గించుకొనేందుకు దాదాపు లక్ష కోట్ల డాలర్లతో భారీ ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించారు. 

‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఇప్పుడు జపాన్‌ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో జపనీయుల ప్రాణాలను, ఉద్యోగాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే 108 ట్రిలియన్‌ యెన్లతో కూడిన భారీ ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటిస్తున్నాం. దీని విలువ మా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 20% మేరకు ఉంటుంది’ అని జపాన్ ప్రధాని షింజో అబె వివరించారు. 

చైనా నుంచి వెలుపలికి వచ్చే జపాన్‌ సంస్థలకు చేయూతనిచ్చేందుకు ఈ ప్యాకేజీలో 220 కోట్ల డాలర్లను షింజో అబె కేటాయించారు. ఇందులో చైనా నుంచి జపాన్‌కు తిరగొచ్చే సంస్థలకు 200 కోట్ల డాలర్ల సాయాన్ని, చైనా నుంచి ఇతర దేశాలకు తరలివెళ్లే జపాన్‌ సంస్థలకు 20 కోట్ల డాలర్ల సాయాన్ని అందజేయనున్నట్టు తెలిపారు. 

also read చమురు ఉత్పత్తి తగ్గింపునకు ఒకే: ఆ వెంటనే పెరిగిన ధరలు?

తద్వారా చైనాలోని జపాన్‌ సంస్థలు స్వదేశానికి తిరిగి రావాలని, లేదంటే మరో దేశానికి తరలిపోవాలని, చైనాలో మాత్రం ఉండవద్దని షింజో అబె స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లయింది. మరోవైపు చైనా నుంచి అమెరికా కంపెనీలు వైదొలగడం గతంలోనే ప్రారంభమైంది. 

చైనా-అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం మొదలవడంతో దాదాపు 50 అమెరికన్‌ కంపెనీలు ఇప్పటికే చైనా నుంచి వైదొలిగాయి. ఇప్పుడు కరోనా వైరస్‌ వల్ల ఈ ప్రక్రియ మరింత వేగవంతమవుతున్నది. 

ప్రస్తుతం మరో 200కుపైగా అమెరికన్‌ కంపెనీలు చైనా నుంచి భారత్‌లోకి రావాలని యోచిస్తున్నట్టు యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ అధ్యక్షుడు ముఖేశ్‌ అఘీ తెలిపారు. అమెరికాలో సంస్కరణలను వేగవంతం చేయడంతోపాటు విధాన నిర్ణయ ప్రక్రియలో పారదర్శకతను పెంపొందించాలని కొత్త ప్రభుత్వానికి యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌ సిఫారసు చేయనున్నదని చెప్పారు.

చైనా నుంచి విదేశీ కంపెనీల నిష్క్రమణలతో ప్రధానంగా ఐదు దేశాలకు లబ్ధిచేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిలో భారత్‌ ముందు వరుసలో ఉన్నది. చైనాకు ఏమాత్రం తీసిపోనంత భారీస్థాయిలో కార్మికులను, మార్కెట్‌ను కలిగి ఉండటం, శ్రామికశక్తి చౌకగా అందుబాటులో ఉండటం ఇందుకు ప్రధాన కారణాలు. 

ఈ ఐదు దేశాల్లో భారత్‌ తర్వాత వియత్నాం, థాయ్‌లాండ్‌, మలేషియా, ఇండోనేషియా కూడా ఉన్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందక  ముందు వరకు వియత్నాం దాదాపు ఐదు వేల రకాల ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నది.

గోటి చుట్టు రోకటి పోటు అన్నట్లు అమెరికా మార్కెట్లో చైనా టెలికం (అమెరికాస్‌) సంస్థ సర్వీసులను నిలిపివేస్తామని అగ్రరాజ్యం హెచ్చరించింది. న్యాయ, భద్రతాపరమైన సమస్యల దృష్ట్యా ఈ చర్య చేపట్టనున్నట్టు అమెరికా న్యాయ విభాగం ప్రకటించింది. 

అమెరికాలో అంతర్జాతీయ టెలీకమ్యూనికేషన్‌ సేవలందించేందుకు వీలుగా చైనా టెలికం (అమెరికాస్‌)కు ఇచ్చిన అన్ని అనుమతులను ఉపసంహరించుకోవాలని అమెరికా రక్షణ, విదేశాంగ, అంతర్గత భద్రతా శాఖలు సహా పలు కీలక ప్రభుత్వ విభాగాలు ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (ఎఫ్‌సీసీ)కు సిఫారసు చేసినట్టు న్యాయ విభాగం ఓ ప్రకటనలో వెల్లడించింది. 

ఈ సిఫారసు ఆమోదం పొందితే అమెరికాలో చైనా టెలికం సంస్థకు చెందిన లక్షల మంది ఫోన్‌, ఇంటర్నెట్‌ ఖాతాదారులకు సేవలు నిలిచిపోతాయి. పరిస్థితులను బట్టి వైట్ హౌస్ ఈ సిఫారసులపై జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.