ధనవంతులపై పిడుగు.. రెవెన్యూ పెంపు కోసం కరోనా టాక్స్...

కరోనా మహమ్మారి ప్రభావం అందరితోపాటు సంపన్నుల పైనా పడుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు అన్వేషిస్తోంది. ఈ క్రమంలో సంపన్నులపై 40 శాతం పన్ను విధించాలని సీబీడీటీకి ఐఆర్‌ఎస్‌ అధికారులు నివేదిక సమర్పించారు. విదేశీ సంస్థలపైనా అధిక లెవీ విధించాలని సిఫారసు చేశారు.

IRS officers suggest higher tax on rich, Covid-19 cess to boost revenue

ముంబై/న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో సంపన్నులపై 40% అధిక పన్ను వేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్‌ పీసీ మోదీకి భారతీయ రెవిన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) సంఘం సూచించింది. దేశంలోని విదేశీ సంస్థలపైనా అధిక లెవీ విధించాలని పేర్కొన్నది.

‘ఫిస్కల్‌ ఆప్షన్స్‌ అండ్‌ రెస్పాన్స్‌ టు ది కొవిడ్‌-19 ఎపిడెమిక్‌'-ఫోర్స్‌ పేరుతో ఓ నివేదికను ఈ నెల 23న సీబీడీటీ చైర్మన్‌కు ఐఆర్‌ఎస్‌ అసోసియేషన్‌ సమర్పించింది. ఇందులో కరోనా మహమ్మారి నిర్మూలనకు పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి దన్నుగా సూపర్‌-రిచ్‌ ట్యాక్స్‌ను సీనియర్‌ పన్ను అధికారులు ప్రతిపాదించారు. 

లాక్‌డౌన్‌ దెబ్బకు దేశ ఆర్థిక పరిస్థితులు తలకిందులైన సంగతి తెలిసిందే. దీంతో కరోనా సహాయ చర్యలకు నిధుల కొరత వచ్చిపడుతున్నది. 

కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యను అధిగమించేందుకు 50 మంది సభ్యులు గల ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్స్ అసోసియేషన్‌ ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేసింది. నిజాయితీగల పన్ను చెల్లింపుదారులకూ పన్ను మినహాయింపులను పరిమితం చేయాలన్నది. 

రూ. కోటి, అంతకుమించి వార్షిక ఆదాయం ఉన్నవారిపై అత్యధికంగా 40 శాతం పన్ను వేయాలని ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పేర్కొంది. ప్రస్తుతం ఇది 30 శాతంగా ఉన్నది. అలాగే ఏటా రూ.5 కోట్లకుపైగా వార్షిక ఆదాయం ఉన్నవారిపై సంపద పన్నును మళ్లీ తీసుకురావాలని సలహా ఇచ్చారు. 

also read ఆన్‌లైన్ ఆశలు ఆవిరి: అక్షయ తృతీయపై లాక్ డౌన్ ప్రభావం

ఇక దేశంలోని విదేశీ సంస్థల నుంచి అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలని, సర్‌చార్జీని పెంచాలని ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తెలిపింది. రూ.1-10 కోట్ల వార్షిక ఆదాయంపై 2 శాతం, ఆపైన 5 శాతం చొప్పున ప్రస్తుత సర్‌చార్జీని వసూలు చేస్తున్నారు. 

ఇక పన్ను సహిత ఆదాయం రూ.10 లక్షలకుపైగా ఉంటే 4 శాతం ఏక కాల ‘కొవిడ్‌ రిలీఫ్‌ సెస్’ను వేయాలని ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ పన్నులు, సెస్సులను అమల్లోకి తెస్తే రూ.15వేల కోట్ల నుంచి 18వేల కోట్లు కలిసొస్తాయని అంచనా.

అయితే, ఐఆర్‌ఎస్‌ అధికారుల సూచనలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ  శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది క్రమశిక్షణా రాహిత్యమని, విధి నిర్వహణ నిబంధనలకు విరుద్ధమని ఆర్థిక శాఖ మండి పడింది. ఈ క్రమంలోనే  సీబీడీటీ సైతం దీనిపై విచారణకు ఆదేశించింది. 

ఈ తరహా నివేదికను ఇవ్వాలని ఐఆర్‌ఎస్‌ అధికారుల సంఘాన్ని  తాము ఎట్టి పరిస్థితుల్లోనూ కోరబోమని ఆదివారం స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా ఐఆర్‌ఎస్‌ అధికారులు పన్ను విషయాల్లో జోక్యం చేసుకున్నారన్నది. ఈ నివేదికను ఎవరెవరు కలిసి  రూపొందించారు, ఇందుకు ఎవరు ఆదేశించారు అన్నది తెలుసుకుంటున్నట్లు చెప్పింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios