న్యూఢిల్లీ: పరిశ్రమలకు తక్షణమే రూ.15 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీ గానీ, దేశ జీడీపీలో 7.5 శాతానికి సమాన స్థాయిలో ఆర్థిక ఉద్దీపనల ప్యాకేజీని ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఐఐ కోరింది. కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావితమైందని ఆందోళన వ్యక్తం చేసింది.

చికిత్స చేయడానికి, వ్యాక్సిన్‌ వచ్చే వరకు కరోనా వైరస్‌ ప్రభావం మరో 12–18 నెలల వరకు కొనసాగే అవకాశాలున్నాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు, పేదలకు తక్షణమే ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని సీఐఐ అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల నుంచి కోలుకునేందుకు రెండేళ్లు పడుతుందని పేర్కొంది.

ప్రభుత్వ బాండ్లను ఆర్బీఐకి విక్రయించడం ద్వారా రూ.2 లక్షల కోట్లు, సెకండరీ మార్కెట్‌ నుంచి రూ.2 లక్షల కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడం ద్వారా రూ.4లక్షల కోట్ల మేర సర్దుబాటు చేసుకోవచ్చని సీఐఐ సూచించింది. 

also read హెచ్-1 బీ వీసాదారులకు బ్యాడ్ న్యూస్..అమెరికాలో వీసాల జారీపై నిషేధం...

‘50 రోజులకు పైగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ముందస్తు అంచనాల కంటే కూడా ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం గణనీయంగా ఉండనున్నది. దీన్ని అధిగమించేందుకు భారీ ఆర్థిక ప్యాకేజీ అవసరం. అప్పుడే ఉద్యోగాలు, జీవనోపాధిని కాపాడుకోవచ్చు’’ అని సీఐఐ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ కిర్లోస్కర్‌ అన్నారు. ప్రభుత్వ ప్యాకేజీలో రూ.2 లక్షల కోట్లను జన్‌ధన్‌ ఖాతాదారులకు నగదు బదిలీ రూపంలో అందించడం కూడా భాగంగా ఉండాలని సీఐఐ సూచించింది.   

కార్మిక చట్టాలను దేశవ్యాప్తంగా రెండు నుంచి మూడేళ్ల కాలానికి రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని పారిశ్రామిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. దాంతో కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన పరిస్థితుల నుంచి పరిశ్రమలు గట్టెక్కగలవని అభిప్రాయపడ్డాయి. 

కార్మిక మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ శుక్రవారం సీఐఐ, ఫిక్కీ, అసోచామ్‌ ప్రతినిధులతో ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడం, పరిస్థితుల మెరుగుపై వెబినార్‌ నిర్వహించారు. చట్ట పరిధిలో సవరణలు ఇవ్వాలని, కార్మికుల పని గంటలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచాలని కోరాయి. అలాగే, కనీస వేతనం, బోనస్‌ మినహా కార్మిక చట్టంలోని మిగిలిన సెక్షన్లను సస్పెండ్‌ చేయాలని కోరాయి.