న్యూఢిల్లీ: శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు.. తమ ఉత్పత్తులను మార్కెట్ మార్కెట్ చేసుకుని ఆదాయం సంపాదనకు వివిధ సంస్థలు వినూత్నంగా ప్రయత్నిస్తున్నాయి. ఫుడ్ అగ్రిగ్రేటర్లు నిత్యావసర సరుకులు ఆన్‌లైన్‌లో సరఫరా చేస్తుండగా, ఫేస్ మాస్క్‌లు పంపిణీ చేస్తున్నాయి. 

తాజాగా రిటైల్ నెట్ వర్క్ సంస్థలు ఫ్యూచర్‌‌ గ్రూప్‌‌, స్పెన్సర్స్‌‌ రిటైల్‌‌, మెట్రో క్యాష్‌‌ అండ్‌‌ క్యారీ, వాల్‌‌మార్ట్‌‌ బెస్ట్‌‌ప్రైస్‌‌ వంటి పెద్ద పెద్ద ఆఫ్‌‌లైన్‌‌ రిటైల్‌‌ స్టోర్లన్నీ కస్టమర్లకు ఆన్‌‌లైన్‌‌లో సేవలు ఇచ్చేందుకు చురుగ్గా ప్రయత్నిస్తున్నాయి. 

దేశంలో లాక్‌‌డౌన్‌‌ను మే 3 దాకా పొడిగించడంతో వివిధ మార్గాలలో కస్టమర్లకు సరుకులు డెలివరీ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందుకోసం ఆమ్ని ఛానెల్‌‌ మోడల్స్‌‌ను అనుసరిస్తున్నాయి.

కరోనా వైరస్‌‌ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌‌డౌన్‌‌ విధించడంతో కస్టమర్లు ఇంటి నుంచే ఆన్‌‌లైన్‌‌లో ఆర్డర్లు ఇస్తున్నారు. దీంతో ఆన్‌‌లైన్‌‌ కంపెనీలకు డిమాండ్‌‌ బాగా పెరిగింది. ఇది చూసిన ఆఫ్‌‌లైన్‌‌ స్టోర్లు ఇప్పుడు తాము కూడా ఆన్‌‌లైన్‌‌ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాయి.

అయితే, లాక్‌‌డౌన్‌‌ తర్వాత కూడా డిమాండ్‌‌ ఇలాగే కొనసాగుతుందా లేదా అనేది ఇప్పుడే తెలీదు. ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్‌‌)లోని ఈజీ డే స్టోర్స్‌‌ ద్వారా మాత్రమే ఆన్‌‌ లైన్‌‌ ఆర్డర్లు తీసుకున్న ఫ్యూచర్‌‌ గ్రూప్‌‌ తాజాగా దేశంలోని 250 బిగ్‌‌ బజార్‌‌ స్టోర్లకూ ఆన్‌‌లైన్‌‌ ఆర్డర్లు తీసుకుంటోంది. పది రోజుల్లోనే బిగ్‌‌బజార్‌‌.కామ్‌‌ను అందుబాటులోకి తెచ్చింది.

రోజుకి 10 వేల ఆర్డర్లను తట్టుకునేలా చేయగలిగామని ఫ్యూచర్‌‌ గ్రూప్‌‌ వైస్‌‌ ప్రెసిడెంట్‌‌ భారతి బాలక్రిష్ణన్‌‌ చెప్పారు. అమెరికా కంపెనీ అమెజాన్‌‌ కిందటేడాదే ఫ్యూచర్‌‌ గ్రూప్‌‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. అమెజాన్‌‌ ఆర్డర్లతోపాటు, తమ సొంత వెబ్‌‌సైట్‌‌, ఫోన్‌‌ ద్వారా వచ్చే ఆర్డర్లనూ నెరవేరుస్తున్నట్లు ఫ్యూచర్‌‌ గ్రూప్‌‌ పేర్కొంది.

also read  ఆపిల్ కొత్త స్మార్ట్ బడ్జెట్ ఐఫోన్...అప్​డేట్​ వెర్షన్​గా లేటెస్ట్ ఫీచర్లతో...

ఫ్యూచర్‌‌ గ్రూప్‌‌కు సొంత డెలివరీ ఫ్లీట్‌‌ ఉంది. అదనంగా హైపర్‌‌ లోకల్‌‌ డెలివరీ యాప్‌‌ డంజోతోనూ, లాజిస్టిక్స్‌‌ ప్లేయర్‌‌ షాడోఫాక్స్‌‌తోనూ ఇప్పుడు చేతులు కలిపింది. స్టోర్లు నడుపుతున్న ప్రతిచోటా ఆన్‌‌లైన్‌‌ అందుబాటులోకి తెచ్చామని, కొన్ని స్టోర్లు మిగతా వాటి కంటే ఈ విషయంలో ముందు ఉంటున్నాయని బాలక్రిష్ణన్‌‌ చెప్పారు. 

తమ అమ్మకాలలో ఆన్‌‌లైన్, టెలిఫోనిక్ ఆర్డర్ల వాటా 30 శాతంగా ఉందని చెబుతున్న ఫ్యూచర్‌‌ గ్రూప్‌‌, ఎక్కువ మంది కస్టమర్లు ఇంకా స్టోర్ల‌కు వచ్చే కొనుక్కోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఆన్‌‌లైన్‌‌, ఆఫ్‌‌లైన్‌‌ రెండూ కొనసాగాలని కస్టమర్లు భావిస్తున్నట్లు దీంతో అర్ధమవుతోందని బిగ్‌‌బజార్‌‌ అధికార ప్రతినిధి వెల్లడించారు.

ఫుడ్‌‌ డెలివరీ యాప్‌‌ స్విగ్గీ, క్యాబ్‌‌ బుకింగ్‌‌ యాప్‌‌ ఉబర్‌‌, బైక్‌‌ ట్యాక్సి యాప్‌‌ రాపిడో వంటి ఇంటర్‌‌నెట్‌‌ కంపెనీలతో జత కట్టింది కోలకతా కంపెనీ స్పెన్సర్స్‌‌ రిటైల్‌‌. తమ వెబ్‌‌సైట్‌‌ ద్వారా వచ్చిన ఆర్డర్లను కస్టమర్లకు డెలివరీ ఇచ్చేందుకే ఇలా కలిసి పనిచేస్తున్నట్లు స్పెన్సర్స్‌‌ రిటైల్‌‌ చెబుతోంది. 

రెండేళ్ల కిందటే షాపింగ్‌‌ యాప్‌‌ తెచ్చిన ఈ కంపెనీ అప్పట్లో ఫ్లిప్‌‌కార్ట్‌‌తోనూ కలిసి పనిచేసింది. ఆన్‌‌లైన్‌‌లోనూ తన వ్యాపారం పెంచుకోవడానికి ఫ్లిప్‌‌కార్ట్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌లోనూ తన ప్రొడక్ట్స్‌ అందుబాటులో ఉంచేది. లాక్‌‌డౌన్‌‌తో ఆన్‌‌లైన్‌‌ బిజినెస్‌‌ రెండంకెలకు చేరుకుందని స్పెన్సర్స్‌‌ రిటైల్‌‌ తెలిపింది. 

ఈ–కామర్స్‌‌, ఫోన్‌‌ ఆర్డర్లు చాలా రెట్లు పెరుగుతున్నాయని స్పెన్సర్స్ రిటైల్ సీఈఓ దేవేంద్ర చావ్లా తెలిపారు. దేశంలోని వివిధ సిటీల్లో స్పెన్సర్స్‌‌ రిటైల్‌‌ 200 సూపర్‌‌ మార్కెట్లు నిర్వహిస్తోంది.  మెట్రో క్యాష్‌‌ అండ్‌‌ క్యారీ ఈ నెల మొదట్లో తన మొబైల్‌‌ యాప్‌‌ తెచ్చింది. 

బెంగళూరులో మాత్రమే పైలట్‌‌ ప్రాజెక్టుగా అమలు చేద్దామని మొదట అనుకున్నా, లాక్‌‌డౌన్‌‌ విధింపుతో దేశమంతటా దానిని మెట్రో అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో స్టోర్‌‌కు రోజుకు 100 ఆన్‌‌లైన్‌‌ ఆర్డర్లు వస్తున్నాయని ఎండీ అర్వింద్‌‌ మెడిరట్ట చెప్పారు.