అతి తక్కువ ధరకే మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు...ధర ఎంతంటే...
భారతీయ వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి అందుబాటు ధరలో విద్యుత్ కారును మార్కెట్లోకి తేవడానికి చైనా గ్రేట్ వాల్ మోటార్స్ సిద్ధమవుతుంది. దీని ధర రూ.6.5 లక్షలుగా ఉండటంతోపాటు గరిష్ఠంగా 351 కి.మీ. దూరం ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం.
న్యూఢిల్లీ: భారత మార్కెట్లోకి వినియోగదారులందరికి అందుబాటులోకి చౌక ధరకే గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థ ‘ఆరా ఆర్-1’ విద్యుత్ కారును ఈ ఏడాది ప్రవేశపెట్టేందుకు సిద్ధం అవుతున్నది. 8,600 డాలర్ల నుంచి 11 వేల డాలర్ల (రూ.6.2 లక్షల నుంచి రూ.8 లక్షల) ధరకు లభ్యమయ్యే ఈ కారు ప్రపంచంలోకెల్లా అత్యంత చౌక విద్యుత్ వాహనంగా పరిగణించబడుతున్నది. 35 కిలోవాట్ల మోటారుతో గరిష్ఠంగా 351 కి.మీ. దూరం ప్రయాణించే ‘ఆరా ఆర్-1’ కారు ఇప్పటికే భారత మార్కెట్లో లభిస్తున్న ఇతర ఎలక్ట్రిక్ కార్లతో సరిపోల్చుకోవచ్చు.
also read విద్యుత్ వాహనాల వినియోగం....కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ప్రస్తుతం భారత మార్కెట్లో లభ్యమవుతున్న విద్యుత్ కార్లు 270 కి.మీ. సగటు రేంజ్ కలిగి ఉండగా, వీటిలో హ్యుండాయ్ కొనా కారు అత్యధికంగా 452 కి.మీ. రేంజ్ కలిగి ఉన్నది. అయితే దీని దర రూ.28 లక్షల మేర పలుకుతున్నది. భారత మార్కెట్లో లభ్యమవుతున్న విద్యుత్ కార్ల సగటు ధర రూ.13 లక్షలుగా ఉంది.
సంప్రదాయ ఇంధనం (పెట్రోల్, డీజిల్)తో నడిచే ఎంట్రీ లెవెల్ (హ్యాచ్ బ్యాక్) కార్ల సగటు ధరతో పోలిస్తే విద్యుత్ కార్ల సగటు ధర చాలా ఎక్కువ. దీనికి తోడు దేశీయ కర్బన ఉద్గార ప్రమాణాలకు, ఆర్థిక మాంద్యానికి మధ్య సందిగ్ధతలో కొట్టు మిట్టాడుతున్న భారతీయ వినియోగదారులను ‘ఆరా ఆర్-1’ మోడల్ విద్యుత్ కారు ఆకట్టుకోవచ్చునని భావిస్తున్నారు.
దేశంలో వాయు కాలుష్యం సమస్య నానాటికి పెరుగుతుండటంతో ప్రజలు తప్పనిసరిగా పర్యావరణ అనుకూల ఇంధన వనరుల వినియోగం వైపు మళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో దేశీయంగా విద్యుత్ వాహనాల ఉత్పత్తిని, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సర్కార్ రాయితీలు కల్పిస్తున్నది.
also read భారీగా పడిపోయిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు...కారణం బిఎస్ 6...?
అయితే ఎలక్ట్రిక్ వాహన ధరలు అందనంత ఎత్తులో ఉండటం కూడా దేశీయ వాహనదారులకు ఆందోళన కలిగిస్తున్నది. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం-అయాన్ బ్యాటరీలను తయారుచేసే సంస్థలు మనదేశంలో చాలా తక్కువగా ఉండటమే ఈ వాహన ధరలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ సంస్థలు చైనా, తైవాన్, కొరియా తదితర దేశాల నుంచి లిథియం-ఆయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది.
లిథియం ఆయాన్ బ్యాటరీల సమస్యను అధిగమించడానికి ఆటోమొబైల్ తయారీ సంస్థలు బ్యాటరీలను తయారు చేయడంపై కసరత్తు ప్రారంభించాయి. గుజరాత్ రాష్ట్రంలోని హన్సల్‌పూర్‌లో తాము సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న యూనిట్లో లిథియం బ్యాటరీల ఉత్పత్తి పెంచడానికి జపాన్ టెక్ దిగ్గజాలు సుజుకి తోషిబా, డెన్సో రూ.3,175 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. మహీంద్రా, టాటా సంస్థలు కూడా బ్యాటరీల ఉత్పత్తికి భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.