విద్యుత్ వాహనాల వినియోగం....కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
విద్యుత్ వాహనాల(ఈవీ) వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యుత్ వాహనాలకు ప్రధాన ఆటంకమైన ఛార్జింగ్ సమస్య తీర్చేందుకు దేశవ్యాప్తంగా 62 నగరాలకు 2636 విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు మంజూరు చేసింది.
దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చేలా ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మాన్యఫ్యాక్చరర్లను (ఓఈఎం) ప్రోత్సహించేందుకు అమలులోకి తెచ్చిన ఫేమ్ ఇండియా (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా) పథకంలో రెండో దశ అమలుకు కేంద్రం సిద్ధమైంది.
ప్రధానంగా దేశీయ మార్కెట్లో విద్యుత్ వాహనాల (ఈవీ) కొనుగోళ్లు, వినియోగం పెరిగేందుకు ప్రధాన ఆటంకం ఛార్జింగ్ స్టేషన్లు కొరవడటమే. ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా ఒకసారి ఛార్జింగ్ పెడితే, ఎక్కువదూరం ప్రయాణించడానికి అనువుగా ఉండటం లేదు. ఈ ఇబ్బంది నివారించడానికి ఫేమ్-2లో భాగంగా 24 రాష్ట్రాల్లోని 62 నగరాలకు 2636 విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది.
also read భారీగా పడిపోయిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు...కారణం బిఎస్ 6...?
ఇందువల్ల కంపెనీలూ విద్యుత్‌తో నడిపే సరికొత్త మోడల్ కార్లు రూపొందించేందుకు ముందుకు వస్తాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా కేంద్రం నిర్ణయించిన మేరకు విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పూర్తయితే నగరానికి ఒక చార్జింగ్ స్టేషన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది.
దీంతో సరికొత్త విద్యుత్ వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేలా ఓఈఎంలకు ప్రోత్సాహం లభిస్తుందని, అంతే కాక చార్జింగ్ సదుపాయాల లేమిని ద్రుష్టిలో పెట్టుకుని విద్యుత్ వాహనాల వినియోగం వైపు మళ్లాలా? వద్దా? అని సందేహిస్తున్న వినియోగదారుల్లోనూ నమ్మకం పెరిగేందుకు ఆస్కారం ఉంది.
తాజాగా కేంద్రం అనుమతించిన 2636 చార్జింగ్ స్టేషన్లలో మహారాష్ట్రకు పెద్దపీట వేసింది. మహారాష్ట్రకు 317, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 266, తమిళనాడుకు 256, గుజరాత్ రాష్ట్రానికి 228, ఉత్తరప్రదేశ్ కు 207, రాజస్థాన్ కు 205, కర్ణాటకకు 172, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 159, పశ్చిమ బెంగాల్ కు 141, తెలంగాణకు 138, కేరళకు 131, ఢిల్లీకి 72, చండీగఢ్ కు 70, హర్యానాకు 50, మేఘాలయకు 40, బీహర్ కు 37, సిక్కింకు 29, జమ్ముకు 25, శ్రీనగర్ కు 25 చార్జింగ్ స్టేషన్లు కేటాయించారు.
విద్యుత్ వాహనాల వినియోగం, అమ్మకాల ప్రోత్సాహానికి ప్రతిపాదించిన 'ఫేమ్' పథకం రెండోదశ కింద, ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రోత్సాహకాలు అందుకునేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లను భారీ పరిశ్రమల శాఖ ఆహ్వానిస్తోంది.
తాజా కేటాయింపులతో ప్రతి నాలుగు చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఒక ఛార్జింగ్ కేంద్రం వచ్చే అవకాశం ఉందన్నది శాఖ అభిప్రాయం. ఒప్పందం కుదిరి, స్థలాలు లభించాయి నిర్థారించాక, ఆయా సంస్థలకు విడతలలో కేటాయింపు పత్రాలు జారీ చేస్తారు. నగర పాలక సంస్థలు, విద్యుత్తు పంపిణీ సంస్థలు, ఇంధన సంస్థలతోనూ ఒప్పందాలుంటాయి. నిర్దేశిత సమయంలో ఇవి నెలకొల్పేలా ప్రభుత్వసంస్థలు చూడాల్సి ఉంది.
also read ఏకాభిప్రాయం లేకే దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం: మారుతీ చైర్మెన్
వీటిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాలను సమీకరించుకోవడంతోపాటు సంబంధిత సిటీ మున్సిపల్, కార్పొరేషన్లు, డిస్కంలు, చమురు కంపెనీల్లాంటి భాగస్వామ్య సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత ఆయా సంస్థలకు దశల వారీగా అనుమతి లేఖలు జారీచేస్తారు.
ఫేమ్ ఇండియా పథకం రెండో దశలో భాగంగా 62 నగరాల పరిధిలో చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను పొందాలని భావిస్తున్న సంస్థలు తమ ఆసక్తిని తెలియజేయలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఇటీవల బిడ్లను ఆహ్వానించింది. దీంతో దాదాపు 7000 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల నుంచి 106 ప్రతిపాదనలు వచ్చాయి. ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అండ్ శాంక్షనింగ్ కమిటీ సలహా మేరకు కేంద్రం ఈ ప్రతిపాదనలను మదింపు చేసి 62 నగరాల పరిధిలో 2636 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. వీటిల్లో 1633 ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి.